e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News వార్నర్‌ ఈజ్‌ బ్యాక్‌

వార్నర్‌ ఈజ్‌ బ్యాక్‌

  • దంచికొట్టిన ఓపెనర్‌
  • శ్రీలంకపై ఆసీస్‌ గెలుపు

విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తిరిగి ఫామ్‌లోకి రావడంతో పొట్టి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆడమ్‌ జంపా, స్టార్క్‌, కమిన్స్‌ ధాటికి శ్రీలంక ఓ మాదిరి స్కోరుకు పరిమితమైతే.. వార్నర్‌ దెబ్బకు ఆసీస్‌ 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్‌-12లో కంగారూలకు ఇది రెండో విజయం కాగా.. తొలి పోరులో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన లంకేయులు ఈ మ్యాచ్‌లో ఆ స్థాయి పోరాట పటిమ కనబర్చలేకపోయారు!

దుబాయ్‌: సమస్యలతో సతమతమవుతూ పొట్టి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా.. వరుస విజయాలతో నాకౌట్‌కు చేరువైంది. సూపర్‌-12 తొలి పోరులో దక్షిణాఫ్రికాపై నెగ్గిన ఆసీస్‌.. గురువారం 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (42 బంతుల్లో 65; 10 ఫోర్లు) దంచికొట్టడంతో కంగారూల విజయం సులువైంది. గ్రూప్‌-1లో భాగంగా జరిగిన పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. కుషాల్‌ పెరెరా (35; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), చరిత అసలంక (35; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), భానుక రాజపక్స (33 నాటౌట్‌; 4 ఫోర్లు , ఒక సిక్సర్‌) తలా కొన్ని పరుగులు చేశారు.

- Advertisement -

ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా, మిషెల్‌ స్టార్క్‌, కమిన్స్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్‌ 17 ఓవర్లలో 3 వికెట్లకు 155 పరుగులు చేసింది. పేలవ ఆటతీరుతో ఐపీఎల్‌ కెప్టెన్సీతో పాటు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తుది జట్టులో చోటు కోల్పోయి విమర్శల పాలైన ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. తన సహజసిద్ధ ఆటతో విజృంభించగా.. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. మ్యాక్స్‌వెల్‌ (5) విఫలమైనా.. స్టొయినిస్‌ (16 నాటౌట్‌)తో కలిసి స్టీవ్‌ స్మిత్‌ (28 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చాడు. లంక బౌలర్లలో వణిండు హసరంగ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆడమ్‌ జంపాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

వేలానికి వార్నర్‌
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)కు ఏకైక టైటిల్‌ అందించిన కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున బరిలోకి దిగడం అనుమానంగా కనిపిస్తున్నది. తాజా సీజన్‌లో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించిన రైజర్స్‌ యాజమాన్యం.. తుది జట్టులోనూ అతడికి చోటు కల్పించలేదు. దీంతో ఈ ఏడాది చివర్లో జరుగనున్న మెగా వేలంలో రైజర్స్‌ తనను రీటైన్‌ చేసుకోకపోవచ్చని వార్నర్‌ అభిప్రాయపడ్డాడు. గురువారం వార్నర్‌ మాట్లాడుతూ.. ‘జట్టు నుంచి ఎందుకు తప్పించారో చెప్పలేదు. రీటెన్షన్‌లో తిరిగి దక్కించుకుంటారనే నమ్మకం లేదు. వేలంలో పాల్గొంటా. వచ్చే సీజన్‌ను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నా’ అని పేర్కొన్నాడు.

సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 154/6(కుషాల్‌ 35, అసలంక 35; జంపా 2/12, స్టార్క్‌ 2/27), ఆస్ట్రేలియా: 17 ఓవర్లలో 155/3 (వార్నర్‌ 65, ఫించ్‌ 37; హసరంగ 2/22).

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement