e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిందగీ వరాహావతార వైశిష్ట్యం!

వరాహావతార వైశిష్ట్యం!

వరాహావతార వైశిష్ట్యం!
వైష్ణవ వాగ్గేయకారులలో ప్రముఖులైన శ్రీ జయదేవ గోస్వాముల వారు తన ‘దశావతార స్తోత్రం’లో వరాహావతారం వైశిష్ట్యాన్ని ఎంతో హృద్యంగా వివరించారు.
వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా
శశిని కళంక కలేవ నిమగ్నా
కేశవ ధృత శూకర రూప జయ జగదీశ హరే!

‘శూకర రూపాన్ని ధరించిన ఓ కేశవా! ఓ జగదీశా! ఓ హరి! నీకు జయము జయము. గర్భోదక సముద్రంలో మునిగి విశ్వపు అడుగు భాగానికి చేరిన ధరణి, చంద్రునిపై మచ్చవలే నీ కొమ్ము దంతం అంచున ఇమిడి ఉన్నది’.
సృష్టి ఆరంభం నాటినుంచి దేవతలు, దైత్యులనబడే ఇరువర్గాల జీవరాశులు విశ్వంలోని లోకాలన్నిటినీ శాసించేవారు. ఈ విశ్వంలోని దేవతలలో బ్రహ్మదేవులు ప్రథములైతే, దైత్యులలో హిరణ్యాక్షుడు ప్రథముడు. భగవంతుడు ఏర్పర్చిన సృష్టిలో కొన్ని నిర్దిష్ట నియమాల ప్రకారమే వివిధ లోకాలలోని గ్రహాలన్నీ శూన్యంలో తేలియాడే బంతుల్లా అంతరిక్షంలో తిరుగుతున్నాయి. వాటి అంతఃనిర్మాణమే ఇందుకు కారణం. విశ్వంలోని సగభాగం గర్భోదక జలంతో నిండి ఉండగా, మిగతా సగభాగం అసంఖ్యాకమైన గ్రహాలతో కూడి ఉన్న లోకాలతో నిండి ఉంది. ఈ లోకాలన్నీ తమ తమ కక్ష్యలలో తిరిగేందు కోసం నిర్దేశితమైన నియమాలకు విఘ్నం వాటిల్లినపుడు విశ్వంలోని గర్భోదక జలంలో అవి పతనమవుతాయి.
పూర్వం హిరణ్యాక్షుడనే (బంగారాన్ని కొల్లగొట్టే దురాశాపరుడు) అసురుడు ఈ గ్రహాల కక్ష్య క్రమానికి విఘాతం ఏర్పరచడంతో భూలోకం తన భార రహిత స్థితిని కోల్పోయి, గర్భోదక జలంలో పతనమైంది. అప్పుడు జగత్తునకు స్థితికారకుడైన భగవంతుడు భీకరమైన శూకర (వరాహ) రూపాన్ని ధరించి తన కొమ్ము దంతాలతో గర్భోదక జలంలోని భూ మండలాన్ని ఎత్తి పట్టాడు.

ఆ సందర్భంలో తనను అడ్డగించబోయిన హిరణ్యాక్షుడిని స్వామి తన కొమ్ము దంతాలతో గుచ్చి సంహరించాడు. భగవంతుని అవతారాలకు గల వైశిష్ట్యం ఇదే. పై వంటి అసాధారణ పరిస్థితులలోనే భగవంతుడు అవతరిస్తాడు. మనిషి చింతనకైనా అందని పరమాద్భుత రీతిలో ఆయన తన లీలలను ప్రదర్శిస్తాడు. శ్రీల ప్రభుపాదులవారు ఇలా అంటారు- ‘ఇటువంటి ఉత్సవ సందర్భాలలో భక్తులకు భగవంతుని లీలలను విని తరించే అవకాశం లభిస్తుంది. శ్రీ కృష్ణుడు, ఆయన లీలలకు ఎటువంటి భేదం లేదు. మీన, వరాహ, కూర్మ మొదలైన అనేకానేక రూపాలలో భగవంతుడు నిత్యం అవతరిస్తూనే ఉంటాడు.

శ్రీ కృష్ణుని లీలలను మళ్ళీ మళ్ళీ శ్రవణం (వినడం) చేయడం ద్వారానే భగవంతుని సాకారతత్తానికి మనం స్థిరచిత్తులం కాగలం. అలా కాక కేవలం నిరాకార పరబ్రహ్మ తత్త్వాన్ని మాత్రమే అర్థం చేసుకున్నట్లయితే ‘సంపూర్ణ ఆనందం’ లభించదు. ఎందుకంటే, జీవులంతా ఆనందాన్వేషకులు. ఒక విమానాన్ని ఎక్కి కేవలం ఆకాశంలో ఎగురుతూనే ఉన్నామనుకోండి, కాసేపటికి మనకే విసుగొస్తుంది. అలాగే, ప్రతీ జీవి ఆనందం కోసం అన్వేషిస్తుంది. ఆ ఆనందానికి మూలమే వైవిధ్యత. ఆ వైవిధ్యపూరితమైన శ్రీ కృష్ణుని లీలల్లో పాలు పంచుకొనగలిగితేనే సకలం ఆనందమయమవుతుంది. అదే మానవ జీవితానికి సార్థకతను చేకూరుస్తుంది. భగవంతుడు ఏ విధంగా తన భక్తుడిని రక్షిస్తాడో ‘వరాహ పురాణం’లో అద్భుతంగా వర్ణితమైంది.

భక్తుడు భగవద్ధామాన్ని చేరేందుకు అష్టాంగయోగ పద్ధతులను సాధన చేయనవసరం లేదు. భగవంతుడు స్వయంగా తానే ఆ బాధ్యతను స్వీకరిస్తాడు. తన భక్తుని సంరక్షణార్థం స్వయంగా భగవానుడే గరుడ వాహనంపై వచ్చి ఈ భవసాగరం నుంచి గట్టెక్కిస్తాడు. అందుకు మనం చేయవలసిందల్లా కృష్ణ చైతన్యవంతులమై వారి సేవలో తరించడమే. వివేకమంతులైనవారు ఆధ్యాత్మిక మార్గాలన్నిటిలోనూ భక్తిమార్గాన్నే తప్పక అనుసరిస్తారు.
శ్రీమాన్‌ సత్యగౌర
చంద్రదాస ప్రభూజి
93969 56984
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వరాహావతార వైశిష్ట్యం!

ట్రెండింగ్‌

Advertisement