e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News యాదాద్రి వైభవం

యాదాద్రి వైభవం


ఆధ్యాత్మిక పౌరాణిక చారిత్రక ధారావాహిక 12
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. ఓ గిరిపుత్రుడి మాటలు కూడా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అంతలోనే నర్మగర్భంగా మాట్లాడుతున్న ఓ బాలకుడు ప్రభువుల వారికి దిశానిర్దేశం చేస్తాడు. అంతలోనే, ఓ ముసుగు వ్యక్తి త్రిభువన మల్లు మీద దాడికి తెగబడతాడు. ఎవరా అగంతకుడు?

ఒకవైపు హొయసల రాజ్యంలో మహాశక్తివంతమైన ‘గరుడ’దళం నేతృత్వంలో యుద్ధానికి సిద్ధమవుతున్నది విష్ణువర్ధనుడి సేనావాహిని.
ఇంకోవైపు.. తగిన మార్గదర్శకత్వం కోసం భువనగిరి రాజ్యం ఎదురు చూస్తున్నది. సార్వభౌముడు లేని సమయంలో, తనకున్న తాత్కాలిక అధికారంతో యుద్ధ ప్రకటన చేసే ఉద్దేశ్యం లేదు మహారాణి చంద్రలేఖాదేవికి. అంతేకాక, కుమారుడి వ్యాధి తీవ్రత రోజురోజుకూ ఎక్కువవుతున్నది.
ప్రవాహంలా పరుగుతీసే కాలం.. ఎవరికోసమూ ఆగదు. కానీ, కాలపురుషున్ని నియంత్రించే భగవంతుడికి తెలుసు కర్మననుసరించి, ధర్మాన్ని అనుసరించి ఎవరికి ఎప్పుడు ఏం జరుగాలో..! నీటిలో మునిగిపోతున్నవాడు ఆసరాకోసం ఏ కర్రముక్క దొరికినా పట్టుకుంటాడు. కష్టాల్లో మునిగిపోతున్న వాడికి ఆసరా ఎవరిస్తారు? ఎక్కడ దొరుకుతుంది?
ఆచరించే ధర్మంలో! అనుసరించే దైవంలో!
ఇతరులకు సహాయపడే కార్యంలో!
నారసింహో మహాసింహో
దివ్యసింహో మహాబలః
ఉగ్రసింహో సుహాదేవ
స్తృంభజశ్చోగ్రలోచనః
సర్వ సంపత్కరం చైవ
స్వర్గమోక్ష ప్రదాయకమ్‌
ధ్యాత్వా నృసింహదేవేశం
హేమసింహాసన స్థితిమ్‌
నారసింహదేవుణ్ణి నమ్మినవాడు ఎప్పుడూ ధైర్యం కోల్పోకూడదు. సకల శక్తి స్వరూపుడైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అభయం ఇచ్చాడంటే ఇక ఎవరికీ ఎటువంటి భయం ఉండదు. స్వామివారి అనుగ్రహం పొందాలంటే నిజమైన భక్తి, తోటి మనిషిపట్ల సానుభూతి, మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా కొద్దిసేపు అయినా ‘ఓం నమో నారసింహాయ’ అని స్మరించగలిగే ఏకాగ్రత ఉండాలి.

- Advertisement -

తెలతెలవారుతున్న సమయం. ప్రకృతి సమస్తం మేలుకొని ‘నరసింహస్వామీ.. మమ్మేలుకో’ అని ఏకకంఠంతో సుప్రభాతం పాడుతున్నదా అన్నట్టు.. పక్షుల కిలకిలరావాలు చెవులకు విందుగా వినిపిస్తున్నాయి.
త్రిభువన మల్లునికి కొండగుహలో కొలువైన సింహదేవుణ్ణి సేవించుకోవాలనే కోరిక తీవ్రమవుతున్నది.
ఎక్కడ? అన్ని సౌఖ్యాలు ఉన్న హంసతూలికాతల్పం.. రాజమందిరంలోని తను నిదురించే ఊయల మంచం..
ఎక్కడ? ఈ ముళ్లతో నిండిఉన్న కటికనేల.. తను ఆదమరిచి నిద్రపోయిన స్థలాన్ని చూసిన ఆయన పెదవుల పైన చిరుమందహాసం విరిసింది.
రాజ్య పాలన.. ‘భాగ్యం’ అనుకుంటారు చాలామంది. ‘సుఖాల నిలయం’ అనుకుంటారు. అది కిరీటం కాదు, ‘ముళ్ల కిరీటం’ అని దాన్ని ధరించిన వాడికే తెలుస్తుంది. ‘భాగ్యం కాదు బాధ్యత’ అనీ, ఆ బాధ్యత నిర్వహించడంలో తన కుటుంబాన్ని, వారి క్షేమాన్ని అవసరమైతే తన ప్రాణాన్నీ త్యాగం చేయవలసి ఉంటుందనీ అనుభవించే వాడికే తెలుస్తుంది. ప్రజలు నిశ్చింతగా నిద్రించాలంటే.. పరిపాలించేవాడు నిద్రకు దూరం కావాలి. అహోరాత్రులు ఆలోచిస్తూనే ఉండాలి. అనుక్షణం కార్యాచరణ రూపొందిస్తూనే ఉండాలి. అధికారాన్ని చూసి అమితంగా గౌరవించే వారుంటారు. కానీ, అంతరంగాన్ని అర్థం చేసుకొనే ఆత్మీయులు ఉండరు. ఒకరిద్దరు ఉన్నా వారు అధినేతను అర్థం చేసుకోవడం కంటే.. అపార్థం చేసుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తారు.
తప్పదు, విధికి ఎదురు నిలబడి తన విధిని నిర్వహించక తప్పదు. కట్టుకున్న ఇల్లాలిని, కన్న కొడుకునూ.. అంతకంటే తాను ఎక్కువగా ప్రేమించే ప్రజలను కాపాడుకోక తప్పదు. కంఠంలో ఊపిరి ఉన్నంత కాలం..!
త్రిభువనుడి ఆలోచనలు ఒక్కసారిగా తెగిపోయాయ్‌.
“రాజా.. కదలకు.. కదిలితే కత్తి నీ మెడనుంచి తలకాయను వేరు చేస్తుంది” త్రిభువన మల్లుని కంఠంపైన ఒక పదునైన పట్టా కత్తిని అదిమి పడుతూ.. అన్నాడు ఒక ముసుగు మనిషి.
మెడపైన బలంగా కత్తి ఒరుసుకు పోతుండటంతో సన్నని రేఖలాగా రక్తం పైకొస్తున్నది.
“ఎవరు నువ్వు? ఏం కావాలి?”
“త్రిభువన మల్ల చక్రవర్తీ! నేనెవరో నీకు తెలియాల్సిన అవసరం లేదు. నాకు ఏం కావాలో అది నేనే నీ దగ్గర్నుంచి తీసుకోగలను. నాకు కావాల్సింది నీ ప్రాణం. నేను అడుక్కోవడానికి రాలేదు. నిన్ను హతం చేయడానికే వచ్చాను”
ఆ ముసుగు వ్యక్తి అలా అంటుండగానే.. చెట్ల కొమ్మలనుంచి మరో నలుగురు బయటికి దూకారు.
“నువ్వు ఈ దేశస్థుడివా..? పరాయివాడివా..? తెలిస్తేనే కదా.. నా స్పందన ఎలా ఉండాలో నాకు తెలిసేది” స్థిరంగా పలికాడు త్రిభువనుడు.
అలా అంటుండగానే కంఠంపై ఉన్న కత్తి గాల్లోకి లేచింది. అయితే, ముసుగు మనుషులు ఊహించని విధంగా, త్రిభువనుడు కాలితో చెట్టు ఊడను పట్టుకొని, ఆ వేగంతో కొమ్మకు తలకిందులుగా వేళ్లాడాడు. గొంతుకు పెట్టిన కత్తి కాళ్ల దగ్గరికి వచ్చింది. ఒక్క కదలికతో ఆ కత్తిని ఎగురగొట్టాడు. అది గాల్లో మూడుసార్లు గిరికీలు కొట్టి పెంపుడు పక్షి భుజంమీద వాలినట్టు, త్రిభువనుడి చేతిలోకి వచ్చింది.
ఒక్కక్షణం అందరూ ఆగిపోయారు.
త్రిభువనుడు అదే కత్తిని ముసుగు మనిషి గుండెకి ఆన్చి..
“ఇప్పుడు చెప్పు.. నీ పరిచయం?”
“చెప్తాను.. నీకు భయపడి కాదు. నువ్వు భయపడాలని చెప్తున్నా.. నా పేరు నరవర్మ” ముసుగు తొలగించాడు.
భీకరమైన ఆకారం. హావభావాల వల్ల వికృతంగా కనిపిస్తున్నది ముఖం.
“నువ్వా..? మా మితృడు జగద్దేవుని తమ్ముడివి కదా!” ఆశ్చర్యంగా అడిగాడు త్రిభువనుడు.
“అవును”
“నీ అన్న జగద్దేవుడికి ప్రాణభిక్ష, రాజ్యభిక్ష పెట్టిందే నేను. అలాంటిది నన్ను చంపడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? కారణం?” నమ్మశక్యం కాదన్నట్టుగా పలికాడు త్రిభువనుడు.
“నీపైన నాకు పగ ఎందుకో తెలుసా? మాల్యా సామ్రాజ్యానికి శత్రువులతో ఆపద వచ్చినప్పుడు.. మా అన్న జగద్దేవుడు నిన్ను సాయం కోరాడు. నువ్వొచ్చి నీ సైనిక బలంతో మాపై దాడిచేసిన శత్రురాజులను సంహరించావు. మా రాజ్యానికి శతృభయం లేకుండా చేశావు” ఏ భావం లేనట్టుగా చెప్పాడు నరవర్మ.
“నేను మీ శతృరాజులను సంహరించి, మీ రాజ్యాన్ని నిలబెట్టాను. అందుకు నా మెడలో పూల మాలలు వేయాలి గానీ, కంఠానికి కత్తెందుకు పెట్టావ్‌? విచిత్రంగా ఉందే?”
“త్రిభువనమల్లా..? అమాయకత్వం నటించకు. నువ్వు సాయం చేసిన మాట నిజమే.. నీ శక్తితో మా మాల్యా రాజ్యానికి శత్రుభయం లేకుండా చేసిందీ వాస్తవమే. కానీ, నువ్వు జగద్దేవున్ని సింహాసనంపైన కూర్చోబెట్టావు. ఆ సింహాసనంపైన కూర్చోవాలనుకున్నది నేను. అసలు శత్రురాజుల ప్రణాళిక తయారు చేసిందే నేను. మాల్యా సామ్రాజ్యాధికారం, సింహాసనం.. నావి! ఎలాగైనా అవి నాకే చెందాలి” నిష్కర్షగా చెప్పాడు నరవర్మ.
“అదెలా సాధ్యం?.. జగద్దేవుడు నీకన్నా పెద్దవాడు. మీ తండ్రిగారి తదనంతరం సింహాసనానికి వారసుడు. అంతకన్నాకూడా ప్రజలు ఆమోదించిన వ్యక్తి! సింహాసనంపైన జగద్దేవుడు కూర్చోవడమే సరైన విధానం” మరోమాట లేదన్నట్టుగా చెప్పాడు త్రిభువనుడు.


“విధానాలు కాదు.. నాకు సింహాసనమే ప్రధానం. అందుకే అన్నను అడ్డు తొలగించుకోవాలనుకున్నా.. నువ్వు, నీ శక్తి గుర్తొచ్చి కాస్త వెనుకడుగు వేశాను. కానీ, నా అదృష్టం కొద్దీ నువ్వు ఈ అడవిలో ఒంటరిగా దొరికావు” నవ్వుతూ అన్నాడు నరవర్మ.
“నీ పేరు నరవర్మ! కానీ, నరుడికి ఉండాల్సిన ఒక్క లక్షణమూ నీకు లేదు. ఇప్పుడు కత్తి నా చేతిలోకి వచ్చిందన్న విషయం నువ్వు మరిచిపోతున్నావ్‌” తనూ నవ్వుతూ బదులిచ్చాడు సార్వభౌముడైన త్రిభువనుడు.
అయితే.. త్రిభువనుడు మాట పూర్తి చేసేలోపే, మరో ఇద్దరు పైనుంచి దూకారు. కత్తిని బలంగా లాక్కొనే ప్రయత్నం చేశారు. ఆ పెనుగులాటలో ఒకడికి చెయ్యి తెగింది. మిగిలిన వాళ్లు ఆ కత్తిని బలంగా లాగేశారు. అలా లాగుతున్నప్పుడు.. ఆ కత్తి త్రిభువన మల్లుని వీపు చర్మాన్ని అడ్డంగా చీల్చుకుంటూ వెళ్లింది.
శరీరం నుంచి రక్తం జలజలా ఉప్పొంగింది. అలాగే వెళ్లి వీపును చెట్టుకు అదిమిపెట్టి నిలబడ్డాడు త్రిభువనుడు.
“త్రిభువన మల్లా! నీ ప్రాణం తీయడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకొనే ఇక్కడికి వచ్చాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా అన్నను కూలదోసి, నన్ను సింహాసనం పైన కూర్చోబెడతానంటే.. నీ ప్రాణాలు నిలబడతాయి. లేదంటే నిన్నెవరు చంపారో ప్రపంచానికి తెలియకుండా ఈ లోకం నుంచి పంపించేస్తాను” అంటూ త్రిభువనుడి సమాధానం కోసం ఆగాడు నరవర్మ.
“మిత్రమా నరవర్మా! నువ్వు నా కదలికల గురించి బాగానే తెలుసుకున్నావ్‌. కానీ, నా వ్యక్తిత్వం గురించి తెలుసు కదా!?”
ఆ మాటకు వికటంగా నవ్వాడు నరవర్మ.
“చక్రవర్తీ! సింహాసనంపైన, రాజసభలో.. అన్ని రక్షణల మధ్య కూర్చొని ఆదేశాలిస్తున్నప్పుడు ఎవడి వ్యక్తిత్వమైనా గొప్పగానే ఉంటుంది. ఒంటరిగా.. నిస్సహాయుడిగా ఉన్నప్పుడు, పది మంది ముట్టడించి బంధించినప్పుడు.. వ్యక్తిత్వానికి అస్తిత్వం ఉండదు. ఆ సంగతి నీకూ తెలుసు, నాకూ తెలుసు. నేను అడుగుతున్నది శక్తిలేక కాదు. నువ్వొచ్చి మా అన్నను కూలదోసి, నన్ను రాజును చేస్తే.. రక్తపాతం లేకుండా ప్రజల సమ్మతి పొందవచ్చని! ఇది నాకు కాదు అవకాశం! నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నీకిచ్చిన అవకాశం! ఆలోచించుకో.. నీకిది ఆఖరిసారిగా చెప్తున్నా..” తీవ్రమైన హెచ్చరికను ధ్వనింపజేస్తూ చెప్పాడు నరవర్మ.
ఆలోచించాడు త్రిభువనుడు.
తను ఒంటరిగానే ఉన్నాడు. చేతిలో ఆయుధం లేదు. శత్రువులు సాయుధులు. పదిమంది చుట్టుముట్టి ఉన్నారు.
మాల్యా రాజ్యం భారత ఉపఖండంలో మధ్య భారతం నుంచి కొన్ని భాగాలుగా దక్షిణ భారతం దాకా ఉంది. జగద్దేవుడు రాజు. ఒక్కసారిగా శత్రురాజులు ముట్టడికి రావడంతో తనను శరణు కోరుతూ వర్తమానం పంపాడు. ఎన్నో యుద్ధాలు చేసిన తనకు ఆ యుద్ధం పెద్ద లెక్కలోకి రాలేదు. సునాయాసంగా జయించాడు. ప్రజల్లో మంచిపేరున్న జగద్దేవరాజును సింహాసనంపైన కూర్చోబెట్టాడు. అప్పుడు ఈ తమ్ముడు నరవర్మ తనకు ఎంతో గౌరవ మర్యాదలు ప్రకటించాడు. కానీ, ఇప్పుడు తన అసలు రూపం బయటపెట్టాడు.
తన దృష్టిలో ‘ధర్మం-న్యాయం’ అనేవి స్థిరమైనవి.
తను క్షేమంగా ఉన్నప్పుడూ, తాను సంక్షోభంలో పడ్డప్పుడూ పరిస్థితులు మారుతాయి తప్ప ‘ధర్మం.. న్యాయం’ ఎప్పటికీ మారవు.
“మిత్రమా, మనిషికి ఆశయం ఉండాలి. అది నెరవేర్చుకోవాలి. ఆశలుకూడా ఉండొచ్చు, వాటిని పండించుకొనే ప్రయత్నాలు చేసుకోవచ్చు. తప్పులేదు. కానీ, అత్యాశ, దురాశ, దుర్మార్గమైన పేరాశ ఉండకూడదు. నేను నిండు రాజసభలో చెప్పిన మాటకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. నీ రాజ్యాన్ని పరిపాలించే అర్హత, యోగ్యత నీ అన్న జగద్దేవరాజుకే ఉన్నాయి. నీకు లేవు”
త్రిభువనుడు ఈ మాటలు అంటుండగానే నరవర్మ కండ్లు ఎర్రబడ్డాయి. మనసు విచక్షణను కోల్పోయింది. తన మనుషులకు సైగ చేశాడు.
వారి దాడి ఎదుర్కొనే ప్రయత్నంలో తన శక్తికొద్దీ పోరాడుతున్నాడు త్రిభువనుడు.
మొదట తనకు ఎదురైన తాపసి చెప్పిన మాటలు తన హృదయంలో మార్మోగాయి.
‘ఇక్కడ భక్తులకే కానీ, భయపెట్టేవారికి అవకాశం ఉండదు’
‘తన రక్తం చిందినా ఫరవాలేదు కానీ, పవిత్ర ప్రదేశంలో తాను ఇతరుల రక్తాన్ని చిందించకూడదు. తన రక్షణ బాధ్యత తనదికాదు.
ఆ స్వామిదే..!’ అనుకుంటూ ప్రతిఘటించలేదు త్రిభువనుడు.
ఆ పోరాటంలో తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు ప్రాణాలు కోల్పోయిన స్థితిలో ఉన్న అతన్ని, గాల్లో గిరగిరా తిప్పి కొండల్లోకి విసిరేశారు నరవర్మ దళపతులు.
“ఇంక ఈ త్రిభువనుడి సాయం మా అన్నకు దొరకదు. సింహాసనం నాదే” అంటూ విజయగర్వంతో నవ్వుతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు నరవర్మ తన అనుచరులతో శరవేగంగా..
అప్పుడు ప్రారంభమైంది వర్షం. క్షణాల్లోనే కుంభవృష్టిగా మారిపోయింది.
కొండకాళ్ల మధ్య కదలిక లేకుండా పడి ఉన్న త్రిభువన మల్లుడి శరీరం.. వర్షానికి మట్టి కరిగి, బురదలా మారిన నేలమీద ఏటవాలుగా జారుతూ కొద్దికొద్దిగా ముందుకు
జరుగుతున్నది.

రాజ్య పాలన.. ‘భాగ్యం’ అనుకుంటారు చాలామంది. ‘సుఖాల నిలయం’ అనీ అనుకుంటారు. అది కిరీటం కాదు, ‘ముళ్ల కిరీటం’ అని దాన్ని ధరించిన వాడికే తెలుస్తుంది. భాగ్యం కాదు బాధ్యత అనీ, ఆ బాధ్యత నిర్వహించడంలో తన కుటుంబాన్ని, వారి క్షేమాన్ని అవసరమైతే తన ప్రాణాన్నీ త్యాగం చేయవలసి ఉంటుందనీ అనుభవించే వాడికే తెలుస్తుంది. ప్రజలు నిశ్చింతగా నిద్రించాలంటే.. పరిపాలించేవాడు నిద్రకు దూరం కావాలి. అహోరాత్రులు ఆలోచిస్తూనే ఉండాలి.

“త్రిభువనమల్లా..? అమాయకత్వం నటించకు. నువ్వు సాయం చేసిన మాట నిజమే.. నీ శక్తితో మా మాల్యా రాజ్యానికి శత్రుభయం లేకుండా చేసిందీ వాస్తవమే. కానీ, నువ్వు జగద్దేవున్ని సింహాసనంపైన కూర్చోబెట్టావు. ఆ సింహాసనంపైన కూర్చోవాలనుకున్నది నేను. అసలు శత్రురాజుల ప్రణాళిక తయారు చేసిందే నేను. మాల్యా సామ్రాజ్యాధికారం, సింహాసనం.. నావి! ఎలాగైనా అవి నాకే చెందాలి” నిష్కర్షగా చెప్పాడు నరవర్మ.

అల్లాణి శ్రీధర్

[email protected]

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాదాద్రి వైభవం
యాదాద్రి వైభవం
యాదాద్రి వైభవం

ట్రెండింగ్‌

Advertisement