e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home News మాస్టర్‌ చేతిలో ఆరోగ్యం..

మాస్టర్‌ చేతిలో ఆరోగ్యం..


తరాలు మారుతున్న కొద్దీ వేషభాషల్లో, భోజన విధానాల్లో మార్పులు వస్తాయి. ముఖ్యంగా కొవిడ్‌ మనుషుల ఆలోచనల్లోనే కాదు ఆహారంలోనూ మార్పులు తెచ్చింది. వైరస్‌ బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచే సంప్రదాయ మూలికలు, దినుసులను వంటల్లో గుప్పించడం అలవాటు చేసుకున్నారంతా. సామాన్య ప్రజలతో పాటు చెయ్యి తిరిగిన షెఫ్‌లు కూడా అరుదైన మూలికలు, రకరకాల మసాలాలు చేరుస్తూ కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతున్నారు.

ప్రపంచమంతా కరోనా వైరస్‌కు భయపడుతున్న సందర్భంలో.. భారతీయులు సహజ సిద్ధంగా రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు వైద్య మూలికలను, సంప్రదాయ దినుసులను మళ్లీ వాడకంలోకి తీసుకొచ్చారు. వాటివల్లే చాలామందిపై వైరస్‌ ప్రభావం నామమాత్రంగా కనిపించిందని డాక్టర్లు తేల్చిచెప్పారు. అందరూ కాడ కషాయం, పసుపు పాలు, మూలికల తేనీరు తీసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ముంబయికి చెందిన మాస్టర్‌ షెఫ్‌లు వంటల తయారీలోనూ మార్పులు తెచ్చారు.
ఆరోగ్యానికి అశ్వగంధ
షెఫ్‌ పూజా దింగ్రా తన స్టార్టప్‌ ‘లే 15’లో తయారు చేసే కేకులు, కుకీస్‌లో ఇమ్యూనిటీ బూస్టింగ్‌ పదార్థాలను కలుపుతున్నారు. ఇంట్లో అందరూ చాయ్‌లో అల్లం వేసుకోవడం, పాలలో పసుపు కలుపుకొని తాగడం వంటి సంప్రదాయ చిట్కాలను చిన్నప్పటి నుంచీ పాటిస్తూ పెరిగింది పూజ. అయితే, వాటిని మామూలు విషయాలుగానే చూసింది తప్ప పెద్దగా పట్టించుకోలేదు. కొవిడ్‌ మొదలయ్యాక ఆమె ఆలోచనా విధానంలో, వంటల తయారీలో మార్పు మొదలైంది. ‘సాధారణంగా ఇంట్లో వండుకునేటప్పుడు మసాలా దినుసులు ఉపయోగించేదాన్ని. కొవిడ్‌ కారణంగా వీటి వినియోగం బాగా పెరిగింది. ‘లే 15’లో తయారయ్యే ఆహార పదార్థాల్లోనూ మూలికలను వాడుతున్నా. ఒత్తిడిని తగ్గించి, మెదడు పని తీరును మెరుగుపరిచే అశ్వగంధ పొడిని ప్లమ్‌ కేక్‌లో జతచేస్తున్నాం. బట్టర్‌ కుకీస్‌లో పసుపు కలిపి వాటిని గోల్డెన్‌ కుకీస్‌లా మార్చేశాం’ అంటున్నది పూజ.
ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్
తాతలనాటి వంటకాల పేర్లు సైతం మర్చిపోయాం. చిరుధాన్యాలతో చేసే వెరైటీల సంగతే ఎవరికీ తెలియదు. కరోనా దెబ్బతో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి ఆపాత రుచులపై మక్కువ పెంచుకుంటున్నారు. బియ్యం, గోధుమలకు బదులు కొర్రలు, సామలుకు అలవాటు పడుతున్నారు. ఇండ్లలోనే కాదు రెస్టారెంట్లూ ఈ బాటనే ఎంచుకుంటున్నాయి. పూర్తిగా చిరుధాన్యాలతోనే మెనూ అంతా సిద్ధం చేస్తున్నారు. చిరుధాన్యాల వెరైటీలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు షెఫ్‌ అనాస్‌ ఖురేషి. ఆయన రెస్టా
రెంట్‌లో చేసేవన్నీ చిరుధాన్యాల వంటకాలే! ‘ఈ మధ్య కాలంలో జనాల్లో మిల్లెట్స్‌పై ఆసక్తి విపరీతంగా పెరిగింది. హోటల్‌కు వచ్చినా హెల్దీఫుడ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అప్పట్నించి మా హోటల్లో చిరుధాన్యాలతో రకరకాల వంటలు తయారు చేస్తూ కస్టమర్లకు అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు వాటితో కొత్త వంటలు తయారు చేయడం నాకూ చాలెంజింగ్‌ అనిపిస్తుంద’ని అంటారు ఖురేషి. ఫైవ్‌స్టార్‌ హోటల్‌ షెఫ్‌ తన స్థాయిలో ప్రయోగాలు చేస్తే.. బస్తీలోని చాయ్‌ మాస్టర్‌ తానేమీ తీసిపోను అన్నట్టు, తన వంతు ఆవిష్కరణలూ చేశాడు. బండి పక్కనే ‘కరోనా స్పెషల్‌ చాయ్‌’ బోర్డు ఆ ప్రయోగ ఫలితమే.

వెరైటీ మిక్సింగ్స్
గతేడాది నుంచి పాకశాస్త్రంలోనూ కొత్తకొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ‘కౌడ్‌ కిచెన్‌ పరాట్‌’ అనే రెస్టారెంట్‌ని స్థాపించిన హరన్‌గద్‌ సింగ్‌ కొత్తరకం వంటలు చేయడంలో దిట్ట. ఆయన తయారు చేసిన కొత్త ఫ్లేవర్‌ ‘పాన్‌ జామూన్‌’ అక్కడి కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నది. ఘాటైన తమలపాకులో తియ్యటి జామూన్‌ పెట్టి కస్టమర్లకు కొత్త రుచిని అందిస్తున్నాడు. దీంతో పాటు మరెన్నో ఆయుర్వేద చిట్కాలను తన వంటల్లో ప్రయోగిస్తున్నాడాయన.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాస్టర్‌ చేతిలో ఆరోగ్యం..

ట్రెండింగ్‌

Advertisement