e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News మగధీర ధీరావత్‌ మహేశ్‌

మగధీర ధీరావత్‌ మహేశ్‌

ఆరేండ్ల వయసులో ప్రమాదవశాత్తు చేతికి దెబ్బ తగిలింది. పరిస్థితి విషమించడంతో కుడిచెయ్యి తొలగించారు. అయినాసరే, ఏనాడూ కుంగి పోలేదు. ఆటలంటే అతడికి ఇష్టం. మైదానంలో పరుగులు తీసేందుకైనా వైకల్యాన్ని జయించాలని అనుకున్నాడు. క్రీడలపైనే దృష్టిపెట్టాడు. ప్రస్తుతం, దివ్యాంగుల జాతీయ క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.. ధీరావత్‌ మహేశ్‌ నాయక్‌!

చేయగలనన్న ఆత్మవిశ్వాసం ఉంటే చేతులు లేకున్నా విజయ తీరాలకు చేరుకోవచ్చు. ధీరావత్‌ మహేశ్‌ నాయక్‌ ధీరగాథ చెబుతున్నదీ అదే. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి మండలం లింగాపూర్‌ తండా తన సొంతూరు. మహేశ్‌కు ఆటలంటే ప్రాణం. చిన్నప్పటి నుంచీ క్రికెట్‌, వాలీబాల్‌లలో రాణిస్తున్నాడు. పెద్దయ్యాక మంచి ఆటగాడు కావాలని కలలుగనేవాడు. అంతలోనే పెను విపత్తు. చేతిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

ఆత్మన్యూనత నుంచి..
మహేశ్‌ది పేద కుటుంబం. అమ్మానాన్న పనికి వెళ్తేనే పూటగడిచేది. అప్పుడు, మహేశ్‌కు ఆరేండ్లు. ఇంటి మీద ఆడుకుంటున్నాడు. చూసుకోకుండా సజ్జపైకి ఎక్కాడు. చకచకా దిగాలన్న తొందర్లో సజ్జపై నుంచి కిందపడ్డాడు. లేత శరీరం కావడంతో కుడిచెయ్యి విరిగింది. వెంటనే, గాంధీ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉందన్నారు డాక్టర్లు. ఉన్నది ఒకటే దారి. దెబ్బతిన్న చేతిని శాశ్వతంగా తొలగించాలి. లేదంటే, ప్రాణానికే ప్రమాదం. సరేననక తప్పలేదు కన్నవారికి. ఆ ఒంటిచేతి పిల్లగాడు అవహేళనలు, ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. ‘ఆటలా? నీవల్ల కాదు’ అన్న మాటలు శూలాలై గుచ్చుకున్నాయి. దీంతో ఆత్మన్యూనతకు గురయ్యాడు. ఈ అనుభవాలన్నీ మహేశ్‌లో జీవితంపై కసిని రగిలించాయి. పాఠాలు నేర్పాయి. చిన్నతనంలోనే జీవితం గురించి తెలుసుకునేలా ప్రేరేపించాయి.

కఠోర సాధన
ఒక చెయ్యి లేదన్న కఠిన వాస్తవం బాధించినప్పుడల్లా.. రెండో చేయి ఉందన్న విషయం గుర్తుకొచ్చేది. ఎక్కడలేని ధైర్యం ఆవహించేది. మరో వ్యాపకం ఏదైనా ఉంటే, ఆ ఆలోచనల్లోంచి బయటపడొచ్చనే ఉద్దేశంతో క్రికెట్‌, వాలీబాల్‌పై దృష్టి పెట్టాడు. రెండు చేతులూ సక్రమంగా ఉన్నా క్రికెట్‌, వాలీబాల్‌లలో తడబడతారు చాలామంది. మహేశ్‌ అలుపెరుగని సాధనతో ఆ పరిమితినీ అధిగమించాడు. ఒంటి చేత్తో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో రాటుదేలాడు. ఆల్‌రౌండర్‌ అనిపించుకున్నాడు.

బీడీసీఏ కెప్టెన్‌గా
జిల్లా స్థాయిలో దివ్యాంగుల క్రికెట్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు మహేశ్‌. ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. అక్కడ కూడా వైస్‌ కెప్టెన్‌ హోదా వరించింది. తాజాగా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక్కడా తను సారథే. బోర్డ్‌ ఆఫ్‌ డిజేబుల్డ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (బీడీసీఏ) కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. మహేశ్‌ పేదరికాన్ని గెలిచి, వైకల్యాన్ని తట్టుకొని ఈ స్థాయికి చేరాడు. వాలీబాల్‌లోనూ జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడు. పారా వాలీబాల్‌ ఏషియన్‌ గేమ్స్‌ జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నాడు ధీరావత్‌ మహేశ్‌.

వరల్డ్‌ కప్‌ కోసం..
2019లో చైనాలో జరిగిన బీచ్‌ వాలీబాల్‌ ప్రపంచ సిరీస్‌లో, 2021లో ఇరాన్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొన్నాడు మహేశ్‌. 2021 ఆగస్టులో హైదరాబాద్‌లో నిర్వహించిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ దివ్యాంగ జట్టుతో ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2021 పారా ఆసియా ఓసియానియా సిట్టింగ్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకూ ఎంపికయ్యాడు. తాజాగా జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గత నెలలో జరిగిన ఇండియా- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరించాడు. త్వరలో జరిగే 20-20కి కూడా మహేశే కెప్టెన్‌. అంతేనా, వరల్డ్‌ కప్‌ టీమ్‌లో కూడా చోటు సంపాదించుకున్నాడు. ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నాడు కెప్టెన్‌ మహేశ్‌. అతడి సంకల్ప బలానికి ఏదీ అసాధ్యం కాదు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement