e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home News భక్తి యుక్తమైన యుక్తి!

భక్తి యుక్తమైన యుక్తి!


ఒక సేనాధిపతి తన సైన్యాన్ని యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాడు. నిజానికి తన సైన్యం కంటే శత్రుసైన్యం సంఖ్యాపరంగా పెద్దది. సామ ర్థ్యం పరంగా చూసినా, ‘తన సైన్యం శత్రుసైన్యం కంటే వెయ్యి రెట్లు మెరుగ్గా ఉందన్నది’ ఆ సేనాధిపతి నమ్మకం. అది మామూలు నమ్మకమే కాదు, ఆయన ఆత్మైస్థెర్యం కూడాను. అంతేకాదు, ‘యుద్ధంలో విజయం తమదేనన్న’ విశ్వాసం ఆయనకు కొండంత ఉంది. సైనికులతో మాట్లాడినప్పుడు, ‘శత్రుసైన్యంతో పోలిస్తే తాము సంఖ్యాపరంగా తక్కువగా ఉండటం వల్ల యుద్ధంలో గెలువలేమేమో’ అన్న సందేహం వారిలో ఉన్నట్లు గమనించాడు సైన్యాధిపతి. తీవ్రంగా ఆలోచించాడు. ఓ నిశ్చయానికి వచ్చినవాడిలా సైనికులందరినీ సమీకరించాడు.
యుద్ధభూమికి వెళ్తూ, దారిలో ఉన్న ఒక కాళికామాత ఆలయంలో ప్రార్థనలు, పూజలు తాను చేస్తూ, తన సైనికులందరితోనూ చేయించాడు. ‘ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించుకోవాలని’ అన్నాడు. ‘అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని’ సైనికుల్లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పాడు. ఆ తర్వాత సేనాధిపతి తన చేతిలోని నాణేన్ని అందరికీ చూపిస్తూ, ‘ఇది కాళికామాత వరప్రసాదం. మహిమగల నాణెం. జయాపజయాలను ఇది కచ్చితంగా సూచిస్తుంది. ఇప్పుడే నాణేన్ని గాల్లోకి ఎగురవేస్తాను. బొమ్మ పడితే విజయం మనదే. బొరుసు పడితే అపజయం ఎదురవ్వచ్చు. విధిరాత ఎలా ఉందో చూద్దాం. అయినా, ఒక మఖ్య విషయం అందరూ గుర్తుంచుకోవాలి. అదేమంటే, ఫలితం ఏదైనా యుద్ధం చేయకతప్పదు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన- అన్న గీతావాక్యం మీకందరికీ తెలిసిందే కదా!’ అంటూ చేతిలోని నాణేన్ని గాల్లోకి ఎగురవేశాడు.
తలెత్తిన వాళ్లంతా నేలకేసి చూస్తే బొమ్మ పడింది. అది చూసిన సైనికుల ముఖాలు ఆనందంతో కాకర పువ్వొత్తుల్లా వెలిగిపోయాయి. ‘అమ్మవారి అనుగ్రహం తమ వైపున్నప్పుడు తమ సంఖ్య తక్కువుంటేమి? గెలుపు తమదేనని విధి ప్రబోధిస్తున్నప్పుడు విజయం తమను కాకపోతే మరెవరిని వరిస్తుంది?’ అన్నట్లు మురిసిపోయారందరూ. ఓటమి ఆలోచన లేకుండా, అసలు ఆ ఆలోచనే రాకుండా, సైన్యంలోని ప్రతి ఒక్కరూ అందరై, అందరూ ఒక్కొక్కరై, పూర్తి స్థాయిలో తమ శక్తియుక్తుల్నీ, శక్తి సామర్థ్యాల్నీ ప్రదర్శించి, శత్రువులతో పోరాడి గెలిచారు.
యుద్ధంలో గెలువటానికి కావాల్సింది సంఖ్యాబలం కాదు, సంకల్ప బలం; తమ శక్తియుక్తుల పట్ల అపారమైన ఆత్మవిశ్వాసం, తమ పరాక్రమాన్ని ప్రదర్శించడంలో ఎనలేని ధైర్యమూ, ైస్థెర్యమున్నూ. అందుకే, యుద్ధం ముగిశాక, ‘విధిరాతను ఎవరూ మార్చలేరు. విధియే మనలను గెలిపించింది’ అని గట్టిగా అరిచాడొక సైనికుడు, గాల్లో కత్తిని విదిలిస్తూ విజయగర్వంతో. ‘అవును, నిజమే!’ అన్నాడు సేనాధిపతి, తన చేతిలోని రెండువైపులా బొమ్మే ఉన్న నాణేన్ని తదేకంగా చూస్తూ, తనలో తాను తృప్తిగా నవ్వుకుంటూ. కథలాంటి ఈ అంశం చిన్నదైనా ఒక సేనాధిపతి సమయస్ఫూర్తినీ, యుక్తినీ, రాజభక్తినీ ప్రతిబింబిస్తూంది. ఇలాంటి యుక్తి యుక్తమైన అంశాలు ప్రపంచ చరిత్రలో కోకొల్లలు.
మన దేశ చరిత్రలో యుగంధరుడు, తిమ్మరుసుల తెలివితేటలు, శక్తియుక్తులు వివేకంతో కూడుకున్నవి. దేశ భవిష్యత్తు దృష్ట్యా విస్తృతమైనవి. అక్బర్‌ చక్రవర్తి ఆస్థానంలోని బీర్బల్‌, సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని తెనాలి రామకృష్ణుని యుక్తులు చమత్కార సంపన్నమైనవి, సభామర్యాదను, రాజగౌరవాన్ని కాపాడటానికి పరిమితమైనవి. ఏ కాలానికైనా యుగంధరుని యుక్తి, చాణుక్యుని నీతి మన దేశ గౌరవ ప్రతిష్ఠలను ఇనుమడింపజేసేలా నిలుస్తాయన్నది నగ్నసత్యం.

డా॥ కె.వి.రమణ
98480 98990

Advertisement
భక్తి యుక్తమైన యుక్తి!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement