e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిందగీ పౌల్ట్రీ పునాది ఆమె

పౌల్ట్రీ పునాది ఆమె


మనిషికొచ్చే ఆరోగ్య సమస్యల్లో చాలా వరకు పోషకాహారలోపం వల్లే వస్తాయి. కొవిడ్‌ కష్టకాలంలోనూ జనమంతా తమ రోగనిరోధకశక్తిని పెంచుకోవడానికి ఎక్కువగా తింటున్నది గుడ్లు, చికెన్‌ మాత్రమే. మన దేశంలో బలవర్ధక ఆహారంలో తక్కువ ధరకు దొరికేది ఖచ్చితంగా గుడ్డు మాత్రమే. మరి ఇంత తక్కువకు పోషకాహారమైన గుడ్డు అందుబాటులో ఉండటం వెనుక ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనే పద్మశ్రీ గ్రహీత డాక్టర్‌ బండా వాసుదేవరావు.ముందుచూపుతో ఆనాడు ఆయన కృషి చేయకపోయుంటే.. చికెన్‌, గుడ్లు కూడా మిగతా మాంసాహారాల్లాగా ఎక్కువ ధరకే దొరికేవి. అయితే ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ ఉంటుందన్న మాటకు ఖచ్చిత ఉదాహరణ బి.వి.రావు భార్య ఉత్తరాదేవి.

పౌల్ట్రీ పునాది ఆమె

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మనదేశంలో పేదరికం అధికమైంది. తినడానికి సరైన తిండి లేక ఎంతోమంది పోషకాహార లోపంతో అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, చదువుకున్న వాళ్లు పల్లెల్లో తిరుగుతూ పోషకాహారలోపాన్ని అధిగమించాలంటే ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్డును తినమని చెప్పేవారు. దాంతో చాలామంది ఇళ్లల్లో కోళ్లను పెంచుకుని గుడ్లను తినడం మొదలుపెట్టారు. అయినా సరే, అధిక సంతానం కారణంగా పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పౌల్ట్రీ ఇండస్ట్రీలోకి బి.వి.రావు అడుగుపెట్టారు. బ్రాయిలర్‌ కోళ్లు, వాటి గుడ్లు తక్కువ ధరకు విరివిగా దొరకడం మొదలైంది. దాంతో కటికపేదవాడు కూడా గుడ్లను తినగలుగుతున్నాడు. ఇదంతా బి.వి.రావు విజన్‌ వల్లే సాధ్యమైంది. అందుకే ఆయన్ని పౌల్ట్రీ పితామహుడిగా పిలుస్తారు. ఆయన జీవిత ప్రస్థానం, అందులో భార్య ఉత్తరాదేవి తోడ్పాటు గురించి వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ బి.వి.రావు 1960లో వెటర్నరీ సైన్సు చదివారు. తర్వాత పుణెలోని ఆర్బోర్‌ ఏకర్స్‌ కంపెనీలో ఉద్యోగం చేశారు. కానీ అది సంతృప్తిని ఇవ్వకపోవడంతో సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నారు. అది కూడా సమాజానికి ఉపయోగపడేదిగా ఉండాలనుకున్నారు. అయితే అప్పటికప్పుడు వ్యాపారం చేసేందుకు సంసిద్ధంగా లేక మరో కోళ్ల బ్రీడింగ్‌ సంస్థలో ఉద్యోగం సంపాదించారు. కానీ ఆయన భార్య ఉత్తరాదేవికి బి.వి.రావుపైన ఎంతో నమ్మకం ఉండేది. ఆయన ఏదైనా, ఎలాగైనా చేయగలరనే ధీమా ఉండేది. దాంతో చిన్న కోళ్ల ఫారం పెట్టమని సూచించారు. ఆ నమ్మకంతోనే ఆయన ఉద్యోగం చేస్తున్న రోజుల్లో నెలా నెలా జీతంలో కొంత మొత్తం పొదుపు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో చిన్నచిన్న ఆనందాలెన్నిటినో త్యాగం చేశారామె. పొదుపుగా జీవనం సాగిస్తూ బంగారం కొని దాచేవారు. తాను దాచిన మొత్తం చిన్న పౌల్ట్రీ ఫామ్‌ ఏర్పాటుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని భావించారామె. కానీ, పౌల్ట్రీ ఫామ్‌ ఏర్పాటుకు ఆ మొత్తం సరిపోదని తెలిసి తన బంగారాన్నంతా అమ్మేసి డబ్బు భర్త చేతికి అందించారు.
1969లో హైదరాబాద్‌ శివారులోని ఇంజాపూర్‌లో కొద్దిపాటి స్థలం కొని ‘వేంకటేశ్వర ఫాం’ పేరుతో కోళ్లఫామ్‌ ప్రారంభించారు. భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ ఆయన విజయానికి బాటలు వేశారు. పౌల్ట్రీ ఫామ్‌ అభివృద్ధికి ఉత్తరాదేవి ఎంతగానో కృషి చేశారు. తర్వాత కొంతకాలానికే అది ‘వేంకటేశ్వర హేచరీస్‌’ పేరుతో భారతదేశ కోళ్ల పరిశ్రమ స్థితిగతిని, రూపురేఖల్ని పూర్తిగా మార్చేసింది. వేంకటేశ్వర హేచరీస్‌ ఫౌండర్‌ చైర్మన్‌ డా॥బి.వి.రావు విజయంలో కీలక భూమిక పోషించారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సంస్థకు వ్యవస్థాపకురాలు ఉత్తరాదేవి అనే చెప్పవచ్చు.

ఉత్తరాదేవిదే ముఖ్యపాత్ర.. .
బి.వి.రావు సొంతంగా పౌల్ట్రీ పెట్టాక కూడా కొన్నినెలల పాటు ఆర్బోర్‌ ఏకర్స్‌కు కంపెనీ సాంకేతిక సలహాలను అందించే బాధ్యత తీసుకున్నారు. అప్పుడు ఆయనకు సొంత ఫారంకు పూర్తి సమయం కేటాయించేందుకు వీల్లేకుండా అయింది. అప్పుడు తనకు ఈ రంగంలో ఎలాంటి అనుభవం లేకున్నా, ఫారం నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు ఉత్తరాదేవి. తర్వాత 1971లో ‘బాబ్‌కాక్‌ పౌల్ట్రీ ఫారం’కు భారతదేశంలో ఏకైక ప్రాంఛైజీగా నియమితులయ్యే అవకాశం వచ్చినప్పుడు దీనికి అధిక మొత్తంలో పెట్టుబడి అవసరమవుతుందని డాక్టర్‌ బి.వి.రావు కేవలం దక్షిణ భారతదేశానికి మాత్రమే ఫ్రాంఛైజీ తీసుకోవాలనుకున్నారు. ఈ అవకాశానికి ఆర్థికభారం సమస్య కానేకాదని, భారతదేశం అంతటికీ ఫ్రాంఛైజీ తీసుకోవాలని ఆయనకు సలహానిచ్చి ప్రోత్సహించారామె. ‘వేంకటేశ్వర హేచరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ స్థాపనకు అవసరమైన పెట్టుబడికి ఆమె తన నగలను అమ్మి డబ్బు సర్దుబాటు చేశారు.

‘వీ.హెచ్‌ గ్రూప్‌’లో ‘వెంకాబ్‌’..
ఏడు కొండలవాడిపై ఉన్న అపారమైన భక్తితో బి.వి.రావు స్థాపించిన పరిశ్రమకు ‘వేంకటేశ్వర హేచరీస్‌ (వి.హెచ్‌)’ అని నామకరణం చేసి, పౌల్ట్రీ రంగంలో పెద్దపెద్ద మార్పులకు బీజం వేశారు. పెరటికే పరిమితమైన కోళ్ల పెంపకాన్ని పరిశ్రమగా తీర్చిదిద్ది, ఆవిధంగా రైతులకు జీవనోపాధిని, ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించొచ్చని ఆయన కలలు కన్నారు. ఆధునిక వ్యాక్సిన్ల తయారీ, పరికరాల ఏర్పాటు, కోడిపిల్లల ప్రాసెసింగ్‌, సూక్ష్మక్రిములు లేని గుడ్ల ఉత్పత్తి, రోగనిర్ధారణ, సూక్ష్మక్రిముల నివారణలాంటి ఎన్నో ఆధునిక పద్ధతులను కోళ్ల పరిశ్రమకు ఆయన తీసుకొచ్చారు. అమెరికాలో ప్రముఖ సంస్థ ‘బాబ్‌కాక్‌ పౌల్ట్రీ ఫారం’కు మనదేశంలో ఏకైక ఫ్రాంఛైజ్‌గా నియమితులై మన వాతావరణానికి అనువైన బ్రీడ్స్‌ని అభివృద్ధి చేసి పౌల్ట్రీ రంగానికి ‘వెంకాబ్‌’ అనే బ్రాయిలర్‌, బి.వి.300 లేయర్‌ బ్రీడ్స్‌ని అందించారు. తండ్రి తదనంతరం (1996) వి.హెచ్‌ గ్రూప్‌కు చైర్‌పర్సన్‌గా బి.వి.రావు కూతురు అనురాధ జె దేశాయ్‌ వ్యవహరిస్తున్నారు.

ఎన్‌.ఇ.సి.సి స్థాపన..
ఒకానొక సందర్భంలో గుడ్ల పంపిణీలో కొంద రు వ్యాపారుల, దళారుల బలమైన పాత్రతో.. వ్యాపారులకు లాభాలు, రైతులకు నష్టాలు వచ్చాయి. అప్పుడు రైతులు గిట్టుబాటు ధరలేక కోళ్ల ఫారాలనే మూసేసే పరిస్థితి వచ్చింది. ఆ దుస్థితిని తొలగించాలని డాక్టర్‌ బి.వి.రావు భావించారు. ‘నా గుడ్డు, నా ధర, నా జీవితం’ అనే నినాదం తీసుకొచ్చి ‘నేషనల్‌ ఎగ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (ఎన్‌.ఇ.సి.సి)’ని 25,000 రైతు సభ్యులతో స్థాపించారు. దీనిద్వారా రైతులు తాము ప్రకటించిన ధరలకే గుడ్లలను అమ్మేస్థితికి తీసుకొచ్చారాయన తద్వారా అటు ఉత్పత్తిదారులు, వినియోగ దారులు లబ్ధి పొందారు. పౌల్ట్రీ రైతులంతా ఆయన జన్మదినమైన నవంబర్‌ 6వ తేదీన ‘నేషనల్‌ ఎన్‌.ఇ.సి.సి డే’గా జరుపుతున్నారు.

పౌల్ట్రీ భవిష్యత్‌ బాగు కోసం..
నాణ్యమైన శిక్షణతోనే పౌల్ట్రీ అభివృద్ధి ఉంటుందని బలమైన నమ్మకం బి.వి.రావుది. అందుకే శాస్త్రీయ విజ్ఞానంతో కూడిన శిక్షణ కోసం పుణెలో ‘డా.బి.వి.రావు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పౌల్ట్రీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ’ అనే సంస్థను 1987లోనే స్థాపించారు. దేశవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమ విస్తరిస్తూనే ఉండాలన్న సత్‌సంకల్పంతో ఆయన ఈ సంస్థను పెట్టారు.

ఎగ్‌ బాస్కెట్‌ ఆఫ్‌ ఇండియా..
తెలంగాణ ప్రభుత్వం గుడ్లు, చికెన్‌ తినాలని ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉంది. కొవిడ్‌ టైమ్‌లో రోగనిరోధకశక్తి పెంచుకునేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయని ప్రభుత్వం సూచించింది. అలాగే ఇటీవల పక్కరాష్ర్టాల్లో బర్డ్‌ ఫ్లూ వస్తే, మనదగ్గర అలాంటి వైరస్‌ వ్యాప్తి లేదని ధైర్యంగా గుడ్లు, చికెన్‌ను బాగా ఉడికించుకుని తినేలా ప్రోత్సహించింది. తెలంగాణ ‘ఎగ్‌ బాస్కెట్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచింది. తల్లిపాల తర్వాత అత్యంత పోషకాలున్న ఆహారం గుడ్డు. ఆ విషయం తెలియక చాలామంది సరిపడా తినట్లేదని ఎన్నో సర్వేలు చెప్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో ఒక్కో వ్యక్తి ఏడాదికి దాదాపు 460 గుడ్లు తింటున్నారట. అలాగే జపాన్‌లో 380, అమెరికాలో 320 తింటున్నారు. కానీ మన దేశంలో మాత్రం ఒక్కొక్కరు ఏడాదికి సగటున ఎనభై గుడ్లు కూడా తినట్లేదు. కానీ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) మాత్రం ప్రతి ఒక్కరు ఏడాదికి కనీసం 180 గుడ్లు తినాల్సిందిగా సూచిస్తున్నది.

ఉమెన్స్‌ డే సందర్భంగా..

పౌల్ట్రీ పునాది ఆమె


మనందరికీ పోషకాహార భద్రత అందించేందుకు, పౌల్ట్రీ రైతుల సంక్షేమం కోసం డాక్టర్‌ బి.వి.రావు చేసిన కృషి గురించి చాలామందికి అవగాహన లేదు. ఆ కృషిలో ఆయన భార్య ఉత్తరాదేవి పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆమె వేసిన పునాది ఈరోజు వేంకటేశ్వర
హ్యాచెరీస్‌ గ్రూప్‌ విజయానికి మూలం. పౌల్ట్రీ రంగానికి శ్రీమతి ఉత్తరాదేవి అందించిన సేవలను ఈ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా అందరం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన దేశప్రజలకు బలవర్ధక ఆహారమైన గుడ్డు, చికెన్‌ చౌకగా దొరుకుతున్నాయంటే కారణం ఆమెకున్న దార్శనికత. ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం వీహెచ్‌ గ్రూప్‌కు ఉత్తరాదేవి కుమార్తె శ్రీమతి అనురాధ జె. దేశాయ్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “పౌల్ట్రీ రంగంలో ఉత్పత్తి, నాణ్యత, టెక్నాలజీ ఇలా అన్ని విషయాల్లో భారతదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉండాలన్నది నాన్న కల. ఆయన దూరదృష్టి, ముందస్తు ప్రణాళికల వల్లే ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద గుడ్ల ఉత్పత్తిదారుగా నిలిచింది. అలాగే బ్రాయిలర్‌ ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది. పౌల్ట్రీ ఇండస్ట్రీ భవిష్యత్‌ కోసం ఆయన ఎంతో నమ్మకంతో, అచంచలమైన కృషితో ముందడుగు వేశారు. ఆయన కలలను నెరవేర్చడానికి మనం కచ్చితంగా ప్రయత్నం చేసి తీరాలి. అదే మా లక్ష్యం” అంటున్నారామె.

నా భార్య వల్లే ఇదంతా..

పౌల్ట్రీ పునాది ఆమె

చౌకగా, ఇంత విరివిగా గుడ్లు, చికెన్‌ మనకు దొరికేలా చేసి, పౌల్ట్రీ పరిశ్రమని అభివృద్ధిపరచి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన డాక్టర్‌ బి.వి.రావును భారతదేశ రైతులంతా పౌల్ట్రీ పితామహునిగా కీర్తిస్తుంటారు. భారత ప్రభుత్వం ఆయన్ని ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. అలాగే కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. వరల్డ్‌ పౌల్ట్రీ సైన్స్‌ అసోసియేషన్‌ ‘ఇంటర్నేషనల్‌ పౌల్ట్రీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ అవార్డు ఇచ్చింది. ఇలా తన జీవితంలో ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో సత్కారాలు, సన్మానాలు అందుకున్నారాయన. పద్మశ్రీ అందుకున్నాక ఆయనకు జరిగిన సన్మాన సభలో బి.వి.రావు మాట్లాడుతూ.. “నేను ఇప్పుడున్న ఈ స్థాయి, అందుకుంటున్న ఈ గౌరవమర్యాదలన్నింటి వెనుక నా మనసుకు మాత్రమే కనపడే నా భార్య అదృశ్య హస్తం ఉంది. ఆ అదృశ్య హస్తం ఎప్పుడూ నా చేయి పట్టుకుని నన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది” అని ఉత్తరాదేవి గురించి సభాముఖంగా చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పౌల్ట్రీ పునాది ఆమె

ట్రెండింగ్‌

Advertisement