e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News పోరాటయోధుడు మన రాంజీ

పోరాటయోధుడు మన రాంజీ

1857లో మొదలైన సిపాయిల తిరుగుబాటు భారత స్వాతంత్య్ర పోరాటంగా ఖ్యాతికెక్కింది. మొదలైనపుడు ఈ పోరాటం స్థానికమైనదే. అది బ్రిటిష్‌ ఇండియా అంతటా విస్తరించి, ఒక దేశ నిర్మాణానికి, జాతీయతా భావనకు స్ఫూర్తినిచ్చిందంటారు చరిత్రకారులు. తెలంగాణలో అప్పటి పాలకులు అసఫ్‌జాహీలు. వీరు బ్రిటిష్‌ రక్షణలో బతుకడానికి లొంగిపోయి, హైదరాబాద్‌ దేశ భవిష్యత్తును, సమాజాన్ని బ్రిటిష్‌ వారికి అప్పనంగా అప్పగిస్తూ వచ్చారు. బ్రిటిష్‌ సైన్యాధికారుల చేతిలో నైజాములు రాజులుగా పేరున్న బందీలైనారు.

బ్రిటిష్‌ వారినుంచి ఝాన్సీని కాపాడుకోవడానికి రాణి లక్ష్మీబాయి పోరాడుతూ నానాసాహెబ్‌ను సాయం కోరింది. బ్రిటిష్‌ వారి వ్యూహాల వల్ల రాణికి సాయం చేయడానికి నానా సాహెబ్‌కు సాధ్యం కాలేదు. ఝాన్సీని కోల్పోయింది లక్ష్మీబాయి. గ్వాలియర్‌ యుద్ధంలో రాణీ లక్ష్మీబాయి మరణించింది. తాంతియ తోపే రోహిల్లాలతో బలమైన సైన్యాన్ని ఏర్పర్చుకున్నా బ్రిటిష్‌ వారిని ఎదిరించలేక, వారికి వ్యతిరేకంగా దక్కన్‌ ప్రాంత పాలకుల మద్దతును సాధించే ప్రయత్నం చేశాడు. గ్వాలియర్‌ యుద్ధంనుంచి వెనక్కి తగ్గిన రోహి ల్లా సైనికులను దక్కనులోనికి పంపించాడు తాంతియా. ఇక్కడి పాలకులకు నానాసాహెబ్‌ లేఖలు రాశాడు. సమ్మతించినవారు రహస్యంగా పోరాటాలకు సిద్ధపడ్డారు.

- Advertisement -

రోహిల్లా సైనికుల్లో ఒక భాగం ఇప్పటి నిర్మల్‌జిల్లా కేం ద్రంలో ఉండేది. ప్రస్తుత జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌కు ‘జనగామ’ అనేది పూర్వనామం. జనగామ కేంద్రంగా పాలించే గోండ్‌ రాజుగా ‘రాంజీ’ని పేర్కొంటారు చరిత్రకారులు. రోహిల్లాలకు ఆశ్రయం ఇచ్చిన వారినందరిని తిరుగుబాటుదారులుగానే భావించిన బ్రిటిష్‌ ప్రభుత్వం వారిని అణచివేయడానికి హైద్రాబాద్‌ ప్రభువు 5వ నిజాం నుంచి అనుమతి పొందింది. రోహిల్లాలతో కలిసి రాంజీ బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. అంతకుమునుపు రాంజీ గురించి చారిత్రకంగా ఏమీ తెలియదు.

తాంతియతోపే నర్మదానది దాటి దక్కన్‌లోనికి ప్రవేశిస్తున్నాడనడానికి రోహిల్లాల కార్యకలాపాలు కారణమైనాయి. బ్రిటిష్‌ వారు బ్రిగేడియర్‌ హిల్‌ ఆధ్వర్యంలో తమ సైన్యాలను దక్కన్‌లో వినియోగించారు. ఫలితంగా తమ సేవలో 500 మంది రోహిల్లాలను పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే జావ్లా అధిపతి, అతని సోదరుడు, షా గులాంహుస్సేన్‌, సయ్యద్‌ హుస్సేన్‌లను నిర్బంధించారు. ముఖ్యమైన రోహిల్లా, అరబ్‌ నాయకులను ఉరితీశారు. బస్మత్‌ నగర్‌, నాగేశ్వరి వంటి కోటలను, రోహిల్లాల స్థావరాలను నేలమట్టం చేశారు. ఈ కాలంలోనే ఇప్పటి జిల్లా కేంద్రం నిర్మల్‌ను రోహిల్లా తిరుగుబాటుదారులు స్థావరంగా చేసుకున్నారు.అప్పుడు వారు గోండుల నాయకుడు రాంజీ గోండు తో కలిశారు. 1860 ఏప్రిల్‌లో అప్పటి ఆదిలాబాద్‌ కలెక్టరు ఆధ్వర్యంలో సైన్యాలు 500 మంది గోండు సైన్యంతో నిర్మల్‌కు దూరంగా దుర్గమ ప్రదేశం లో తలపడ్డారు. బ్రిటిష్‌ సైన్యం చేతిలో గోండు లు గాయపడి తప్పుకొన్నారు. రాంజీ కూడా తప్పించుకున్నాడు. తర్వాత బ్రిటిష్‌ సైనికులు తమ చేతికి చిక్కిన రాంజీని ఉరి తీశారు.

రోహిల్లాల తిరుగుబాటు (ఉపద్రవం) 1860 దాక కొనసాగింది. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో రాంజీ నాయకత్వంలో ఉన్న గోండులతో రోహిల్లాలు కలిశారు. నిర్మల్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో 1860 ఏప్రిల్‌ 9న నిర్మల్‌కు కొంచెం దూరంలోని అడివిలో రోహిల్లాలు, గోండులు, దక్కనీల దండు మీద దాడి జరిగింది. ఈ సంఘటన గురించిన నివేదిక హైదరాబాద్‌లోని సెంట్రల్‌ రికార్డ్స్‌ కార్యాలయంలో భద్రపర్చబడి ఉన్నది.

నాగపూర్‌ నుంచి సహాయం అందుతున్న రోహిల్లాలు, గోండుల దండులో వేయిమంది ఉన్నారని నిర్మల్‌ తాలూక్దార్‌ దీవాన్‌కు తెలియజేశాడు. రోహిల్లాలు, గోండుల దండు-బ్రిటిష్‌ సైనికుల మధ్య మొదట ఎదురుకాల్పులు జరిగాయి. తర్వాత కత్తి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కొద్దిమంది గాయపడ్డారు. బ్రిటిష్‌ సైన్యం తిరుగుబాటుదారులను చుట్టుముట్టింది. రాంజీ తప్పించుకున్నాడు. బ్రిటిష్‌ రెసిడెంట్‌కు ఈ సంఘటన వివరాలు తెలియపర్చబడ్డాయి. రెసిడెంట్‌ తన జవాబులో తాలూక్దార్‌ సేవలను ప్రశంసిస్తూ రాంజీని తప్పకపట్టుకోవాలని తెలిపాడు. కానీ, రాంజీ అరెస్టు గురించి సమాచారం ఇచ్చే ఫైల్‌ ఎక్కడా లేదు.

తర్వాత కాలంలో రాంజీని బంధించి నిర్మల్‌లో ఉరితీశారు. ఆదిలాబాద్‌లోని ఉపద్రవం ఇట్లా అణచివేయబడ్డది. రోహిల్లాల తిరుగుబాటు 1860లో సమసిపోయింది. రోహిల్లాలను బంధించి, విచారించి దీర్ఘకాలంలో ఖైదులో పెట్టింది ప్రభుత్వం. వేయి మందిని ఒకే మర్రిచెట్టుకు ఉరితీసిన సమాచారం ఏదీ లేదు. ప్రజల్లో వాడుకగా మాత్రం వీరోచిత గాథగా చెప్పుకొంటున్నారు. రాంజీ స్వాతంత్య్ర పోరాటయోధుడిగా పేర్కొనదగినవాడు. అతని చరిత్రను పాఠశాలల్లో ఒక పాఠం గా చదువుకోదగిన వీరుడు అతడు.

(వ్యాసకర్త: కన్వీనర్‌, కొత్త తెలంగాణ చరిత్ర బృందం)
శ్రీరామోజు హరగోపాల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement