e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News పాఠశాల పచ్చబడాలని!

పాఠశాల పచ్చబడాలని!


దేశమంతటా లాక్‌డౌన్‌. స్కూళ్లన్నీ మూతపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా మహదేవ ప్రభుత్వ పాఠశాల మాత్రం తెరుచుకునే ఉంది. పాఠాల కోసం కాదు. మొక్కల కోసం. బయటకు రావద్దని చెప్పినా పొద్దున లేవగానే స్కూల్‌కి వచ్చేవాడు ఒక ఉపాధ్యాయుడు.

ప్రభుత్వ పాఠశాలలోని మొక్కలు, వాటర్‌ ప్లాంట్ల కోసమే ఆ ఉపాధ్యాయుడు స్కూల్‌కి వచ్చేవాడు. 20 ఏండ్లుగా హరిత ఉద్యమం చేస్తున్న ఆ ఆదర్శ ఉపాధ్యాయుడే మహదేవ పాఠశాలలో పనిచేసే అలోక్‌ త్రిపాఠి.
మొక్కలు నాటడమే దినచర్య
80వ దశకంలో టీచర్‌ ఉద్యోగంలో చేరాడు అలోక్‌. విహారయాత్రకు వెళ్లినప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం ఒక ఎన్‌జీఓ చేస్తున్న పనులకు ఆకర్షితుడయ్యాడు. తానూ పర్యావరణ అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని అనుకున్నాడు. మహదేవ ప్రభుత్వ పాఠశాలలో 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఖాళీ ప్రదేశం ఉంది. పాఠశాల భవన సముదాయాల వరకే శుభ్రం చేసి మిగతా స్థలాన్ని వదిలేయడం వల్ల అదొక చెత్త నిల్వ కేంద్రంలా కనిపించింది. ఇక్కడ వేలాది మొక్కలను పెంచి ఆక్సీజన్‌ చాంబర్‌గా తీర్చిదిద్దాలనేది అతడి లక్ష్యం. రోజూ మొక్కలు నాటడం దినచర్యగా మార్చుకున్నాడు.
మొదట నిరాశ కలిగింది
పెరుగుతున్న కాలుష్య దుష్ప్రభావానికి లోను కావద్దంటే ‘ఆక్సీజన్‌ పార్క్‌లు’ కావాల్సిందే అనుకున్నాడు అలోక్‌. ఐదు మొక్కలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. మూడు రోజులకు చూస్తే ఒక్క మొక్కకూడా లేదు. ‘ఇలా అయ్యిందేంటి?’ అని నిరాశపడినా లక్ష్యం గుర్తుకొచ్చింది. మళ్లీ ఓ పది మొక్కలు నాటాడు. ఆవులు, బర్రెలు మేసి పోయాయి. పరిష్కారం కోసం ఆలోచించాడు.
ఎవరు దొంగిలిస్తున్నారు?
గ్రామ పంచాయతీ అధికారులకు మొక్కల పెంపకం పట్ల అవగాహన కల్పించి పాఠశాల చుట్టూ సరిహద్దు గోడను నిర్మించేందుకు ఒప్పించాడు. గోడ చిన్నదే అయినా నిర్మించడానికి సంవత్సరాలు పట్టింది. ఇక సమస్య పరిష్కారం అయినట్టే అనుకొని మళ్లీ ఓ యాభై మొక్కలు నాటాడు. వెదురు ట్రీగార్డులను అమర్చాడు. మళ్లీ పాత అనుభవమే. ఈసారి ట్రీగార్డులను కూడా విరిచేశారు. ‘ఈ మొక్కలను దొంగిలించడం ఏంటి? ట్రీగార్డులను విరిచేయడం ఏంటి?’ అని ఆవేదన చెందాడు. తాను ఏనాడూ మొక్కలు నాటేందుకు ఎవరి సహాయమూ తీసుకోలేదు. ప్రభుత్వ అధికారుల సహకారమూ కోరలేదు. అయినా తనపై ఎందుకు మానసిక దాడి చేస్తున్నారని బాధపడ్డాడు.
కొత్త ఆలోచన మార్చేసింది
అది 2000 సంవత్సరం. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ మొక్కలు నాటాడు అలోక్‌. ఈసారి వేరే విధానంతో, కొత్త నినాదంతో. ఊర్లో రాకేశ్‌ అనే పూర్వ విద్యార్థి వాళ్ల నాన్న చనిపోయారు. ‘ఆయనకు జ్ఞాపకార్థం ఎలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది?’ అని అలోక్‌ను అడిగాడు రాకేశ్‌. ‘ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే బాదం మొక్కలు నాటండి’ అనే సలహా ఇచ్చాడు అలోక్‌. అలా 27 బాదం మొక్కలు నాటాడు. చనిపోయినవారికి గుర్తుగా మొక్కలు నాటారు కాబట్టి వాటిని దొంగిలించడానికి ఎవరూ సాహసించలేదు. ఇక ఇదే వ్యూహం కొనసాగించాలనుకొన్నాడు అలోక్‌. ఆ మొక్కలు ఒక్కొక్కటి ఇప్పుడు 20 అడుగుల ఎత్తు పెరిగాయి. అలా ఇప్పటివరకు వేల సంఖ్యలో మొక్కలు నాటాడు. పాఠశాల ప్రాంగణంలో మామిడి, ఆమ్లా, జామున్‌, వేప, తులసి, అశ్వగంధ, కరివేపాకు, వేప వంటి మొక్కలు ఏపుగా పెరిగాయి.
వలస కార్మికులకు అండగా..
ప్రతీ మొక్కకు అలోక్‌ వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఒక్క ట్రీ గార్డుకే రూ.1500 అవుతుంది. ఈ ఖర్చునంతా తానే భరిస్తున్నాడు. కొంతవరకు తోటి ఉపాధ్యాయులు కూడా సహకరిస్తున్నారు. అతడు చేస్తున్న మంచి పనికి స్పాన్సర్లు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అలా తన స్నేహితుడొకరు 1000 లీటర్ల వాటర్‌ ట్యాంక్‌ డొనేట్‌ చేశాడు. తన హరిత మిషన్‌తోపాటు సంచార కుటుంబాలకు చెందిన 30 మంది పిల్లలను పాఠశాలలో చేర్చుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అలోక్‌. వాస్తవానికి వలస కుటుంబాలకు ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలూ లేవు. కానీ అలోక్‌ తెల్లపేపర్‌పై వివరాలు రాసుకొని అందరికీ తానే సాక్షిగా నిలబడి స్కూల్లో చేర్చుకున్నాడు. ఈ కృషిని గుర్తించిన మధ్యప్రదేశ్‌ పాఠశాల విద్యా విభాగం 2017లో ‘అత్యుత్తమ ఉపాధ్యాయ అవార్డు’ ఇచ్చింది. గవర్నర్‌ చేతులు మీదుగా అలోక్‌ ఈ పురస్కారం అందుకున్నాడు.

ఆకుపచ్చ క్యాంపస్
అలోక్‌ త్రిపాఠీ
క్యాంపస్‌లో మొక్కలు వృద్ధి చెందడం, ఆ ప్రయత్నంలో పిల్లలు కూడా భాగస్వాములు కావడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా ఆకుపచ్చ కల నెరవేరుతున్నదని అనిపిస్తున్నది. నేను పదవీ విరమణ పొందే లోపే క్యాంపస్‌ ఆకుపచ్చగా మారుతుందనే ధీమా కలుగుతున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పాఠశాల పచ్చబడాలని!

ట్రెండింగ్‌

Advertisement