e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News క‌న్న‌బిడ్డ‌లు కాద‌నుకున్న అమ్మానాన్నల‌కు కొడుకు అయ్యాడు

క‌న్న‌బిడ్డ‌లు కాద‌నుకున్న అమ్మానాన్నల‌కు కొడుకు అయ్యాడు

పండుటాకులకు కొమ్మలే బలం. ఆ కొమ్మలే పట్టించుకోకుంటే.. రాలిపోవడమే కదా వాటి గతి! కావట్టి , మేమున్నమంటూ కొమ్మలు పండుటాకులకు ధైర్యం ఇయ్యాలె. మాకేం పని అనుకుంటే దానికి మించిన బాధ్యతారాహిత్యం, అమానవీయత ఉండదు. ఆ ఆకులే లేకుంటే పూలు వికసించేవా, పిందె కాయవుతుండెనా?

కరీంనగర్‌ల కరోనా కాలువెట్టింది. అంతరిక్షంలకు వోయేటందుకు వ్యోమగాములు ఆగమాగం తిరుగుతున్నట్టే ఉంది ప్రభుత్వ దవాఖాన పరిస్థితి. అప్పుడే ఓ కారు ఆగింది. ఆ కారు ఓ పెద్ద పోలీస్‌ సారుది. ఆ సంగతి పక్కకున్న డాక్టర్‌ ఫోన్లో మాట్లాడితే తెలుస్తున్నది. పది నిమిషాల పాటు వాళ్ల మాటలు నడిసినయి. ఆ మాటలను అక్కడున్న నర్సుతో బాధవడ్తూ చెప్తున్నడు డాక్టర్‌ సారు. అసలు విషయమేందంటే.. పోలీసు సారోళ్ల అమ్మకు కరోనా సోకింది. కానీ దగ్గు, దమ్మేం లేదు. సంతోషంగా అటీటు తిరుగుతున్నది. కానీ జరమున్నది. పరీక్ష చేపిత్తే కరోనా బయటవడ్డది. అంతే.. ‘మీ అమ్మ ఇంట్ల ఉండద్దంటే ఉండద్దు, పైసలెన్ని వోయినా మంచిదే గని, దవాఖన్ల షరీఖ్‌ చెయ్యి. లేకుంటే, ఆమెతో పాటూ నువ్వూ బయటనే’ అని ఆ ఇద్దర్ని బయటికి నూకేసిందట ఆ పోలీసు సార్‌ పెండ్లాం. ఆ అవ్వను దవాఖానల షరీఖ్‌ చేసుకుందామంటే మంచాలు ఖాళీ లేవు. మంచిగున్నామెను తీస్కచ్చి మంచాన వేస్తే కొనూపిరి మీదున్నోళ్ల పరిస్థితేందని మానవత్వంతోని ఆలోచించిండు డాక్టర్‌. ఆఖరికి ఆ పోలీసు సార్‌ ఆ అవ్వను వట్టుకొని ఎటువోయిండో.. ఆ అవ్వ మానసికంగ ఎంత కుంగిపోయిందో.. ఆ అవ్వను ఇడిసిపెట్టలేక ఆ పోలీసు సారు ఎంత కుమిలిపోయిండో ఆలోచించుకుంటెనే గుండెలవిసి పోతున్నయి. కరోనా సోకిన ఆ అవ్వను ఇంట్లనే ఓ మూలకుంచి బుక్కెడు బువ్వ వారెత్తే పద్నాలుగు రోజులు పద్నాలుగు నిమిషాలల్ల గడిసిపోతుండెనేమో.. కానీ ఆ కోడలు, తాను గూడ రేపటి అత్తే అన్న విషయం మరిసిపోయిందేమో.. రాయిగా మారిపోయింది!

- Advertisement -

..మచ్చుకు, ఒక్క పండుటాకు పరిస్థితి సదివితేనే కండ్లు చెమ్మగిల్లుతున్నయి కదా! మనకు కనవడని ఆకులెన్నో ఉన్నయి. అలాంటి, జీవితాలకు నేనున్నానంటూ భరోసానిస్తున్నడు సీపెల్లి వీరమాధవ్‌. ఒక్కసారి కరీంనగరం హౌజింగ్‌బోర్డు కాలనీలో ఉన్న వీరబ్రహ్మేంద్ర అనాథ, వృద్ధాశ్రమంలో ఉన్న పండుటాకులతో ముచ్చటవెట్టి, వాళ్ల మంచిచెడ్డలు అర్సుకుందాం..
జగిత్యాలకు చెందిన సంజీవం దంపతులకు ఇద్దరు బిడ్డలు. పెంచి, పెద్దజేసి, శేతనైన కాడికి కట్నకానుకలిచ్చి బిడ్డల్ని ఇద్దరయ్యల చేతిల వెట్టిర్రు. కాలం కలిసిరాకనో, ఆమెకు నూకలు అక్కడికే బాకీ ఉన్నయో గనీ సంజీవం భార్య కొన్నొద్దులకే కాలంజేసింది. ఆ బాధలో సంజీవం పానం మంచిగలేక మంచానవడ్డడు. కొన్రోజులకే కండ్లు కూడా కనవడకుండా పోయినయి. అంతే.. ఇద్దరు బిడ్డలకు సంజీవం చేదయ్యిండు. మంచిచెడ్డలు అర్సుకునేటోళ్లు లేక రోడ్డున పోయేటోళ్లు చూసి అయ్యో పాపం అనే పరిస్థితి వచ్చింది. సంజీవంను అట్లా సూడబుద్ధి గాక పక్కకున్నోళ్లు వీరబ్రహ్మేంద్ర (వీబీ) ఫౌండేషన్‌లో చేర్పించి ఎల్లిపోయిండ్రు. ఎనిమిదేండ్లాయే వీబీ ఫౌండేషన్‌లో సంజీవం సంతోషంగ ఉంటున్నడు. ‘ఇప్పుడు మీ బిడ్డలొచ్చి తీస్కపోతే పోతవా’ అని అడిగితే, ‘నా బిడ్డలు ఎన్నడో వోయిండ్లు, నాకెవ్వల్లేరు, వీరమాధవ్‌ తప్ప. ఆ దేవుడు పుష్కిపోయి నాకు మళ్లా కండ్లిస్తే మొట్టమొదాలు నేను చూసే వ్యక్తి వీరమాధవే..’ అని కడుపునిండా ప్రేమతో చెప్తున్నడు.

కొమురయ్యది కరీంనగర్‌ నగర కేంద్రానికి కొద్దిదూరంలో ఉన్న నగునూరు. ఆయన కన్నబిడ్డ, చేసుకున్న పెండ్లాం కొంత వ్యవధిలనే కాలంజేసిర్రు. ఇక ఉన్నదొక్క కొడుకు. ఆ
‘బంగారి’ కొడుకుతో కొమురయ్యకు రోజూ కొట్లాటే. కొడుకుతో కొమురయ్య దెబ్బలు తినని రోజు లేదట. కారణం.. కొమురయ్య పేర లక్షలు విలువ జేసే జాగలున్నయి. ఆ ఆస్తిని తన పేరు మీద చెయ్యిమని కొమురయ్యకు నరకం చూయించిండు. పడుసు పోరనితో కొట్లాడలేక కొమురయ్య ఓడిపోయిండు. ఆస్తులు తనపొంటి కాంగనే కొమురయ్యను ఇంట్లకెల్ల్లి ఎల్లగొట్టిండు కొడుకు. తనకెరుకున్న వాళ్లెవ్వరో వీబీ ఫౌండేషన్‌లో చేర్పిస్తే.. కొమురయ్య ఇప్పుడు అందరితో సంబురంగుంటున్నడు. ‘మీ కొడుకుకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆయన దగ్గరికి మళ్లా పంపుతం పోతవానే కొమురన్న’ అని ఎవ్వరన్న అడిగితే.. ‘నేను ఇంట్లకెల్లి ఎల్లంగనే వాని మీద మన్నువోసి అచ్చిన బిడ్డా..’ నేనొచ్చినంక ఆర్నెల్లకు తాగి ఎక్కన్నో బస్సు కింద వడ్డడని తెల్సింది. వాని శవాన్ని కూడా సూడబుద్ధి గాక ఇక్కన్నే ఉంటున్న’.. అని చెప్తున్నడు. సంజీవం..

కొమురయ్య.. వంటి వందలాది మంది పండుటాకులు ఈ ఆశ్రమంలో ఒకరికొకరు తోడుగా, ఆనందంగా ఉంటున్నరు. ఒక్క తెలంగాణోళ్లే కాదు.. ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషా నుంచి వచ్చిన అనాథలు కూడా వీబీ ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్నరు. ప్రస్తుతం ఈ ఫౌండేషన్‌లో 40 మంది వృద్ధులున్నారు. ఇప్పటివరకు సుమారు 200 మంది వీబీ ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందారు. ఈ ఆశ్రమంలో ఉంటూనే 118 మంది తమ జీవిడిసిండ్రు. కన్నవాళ్ల శపం ఇంటిముందుండగానే ఆస్తుల కోసం కొట్లాడుకునే కొడుకులను చూసినం. అగ్గివెడితే అదో అపచారమన్నట్లు కూడా చూస్తరు కొందరు. అలాంటిది వీబీ ఫౌండేషన్‌లో చనిపోయిన 81 మందికి కర్మకాండలు నిర్వహించాడు వీరమాధవ్‌. మేం నిర్వహించుకుంటామని వచ్చిన బంధువులకు మాత్రం పార్ధ్థివదేహాలను అప్పజెప్తడు.

వీర‌మాధ‌వ్ (ఎడ‌మ ), సంజీవ‌య్య (కుడి)

ఎవరీ వీరమాధవ్‌..?

సీపెల్లి వీరమాధవ్‌ సిన్నగున్నప్పుడు సుగుణవ్వ మంచిగ బతికింది. వీరమాధవ్‌కు పూట గడవకుంటే ఓ పూట అన్నం పెట్టింది కూడా. అవసరం ఉంటే పదో, పరకో పైసలిచ్చింది. ఒక్క మాధవ్‌కే కాదు, శానమందికి సుగుణవ్వ సాయం చేసింది. ఆమె నసీబ్‌ మంచిగ లేక పెనిమిటి మధ్యల్నే కాలం జేసిండు. ఉన్నొక్క కొడుకు పత్తా లేకుండా వోయిండు. సుగుణవ్వకు వయస్సు మీద వడంగనే ఆమెకు శాతగాకుంటైంది. ఆమెకున్న అద్దగుంట అగ్గువకే అమ్ముడువోయింది. ‘తిన్న కొద్దీ గుట్టలైనా కరుగతయ’నే సామెత ఉత్తగ వుట్టిందా..? ఇగ దిక్కూ దివానా లేకుండై రోడ్డు మీద వడ్డది సుగుణవ్వ. ఇంటికో ముద్ద అడుక్కుంటూ కడుపు నింపుకొన్నది. ముందుగాల్ల ఆమెను చేరదీసిండు వీరమాధవ్‌. సుగుణవ్వకు తన చేత అన్నం కలిపి నోట్లె ముద్ద వెట్టినప్పుడు అచ్చిన ఆనందం జీవితంల ఎప్పుడూ రాలేదంటడు వీరమాధవ్‌. ఇట్లా.. ఒక్క సుగుణవ్వే కాదు, కన్నవాళ్ల, అయినోళ్ల ఆదరణ కరువై రోడ్డు మీద విసిరేయబడ్డ పండుటాకులకు పెద్ద బిడ్డయిండు వీరమాధవ్‌. 2003లో ముగ్గురితో మొదలైన వీబీ ఫౌండేషన్‌ వెనుక ఎందరో మానవతా హృదయులున్నారని గొప్పగా చెప్తడు మాధవ్‌. వాళ్లందరి ప్రోత్సాహంతోనే నడుస్తున్నదని సంబురంగా చెప్తున్నడు.

తనింట్లో వృద్ధులు, తాను కిరాయింట్లో..

వీబీ ఫౌండేషన్‌లో అనాథలు, వృద్ధులు పెరుగుతుండటంతో ఆశ్రమం ఇరుకుగా మారిపోయింది. వీళ్ల కోసం ఇల్లు కిరాయికి అంటే ఎవరన్న ముందుకువస్తరో, రారోనని.. వృద్ధులను తనింట్లోకి మార్చిండు మాధవ్‌. తాను కిరాయింట్లో ఉంటున్నడు. ఇది చూసిన మంత్రి గంగుల కమలాకర్‌ చొరవ తీసుకొని ఆశ్రమం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. అందులో భవన నిర్మాణం కొనసాగుతున్నది. వీబీ ఫౌండేషన్‌ కోసం సొంతంగా భవనం ఉండాలనేది వీరమాధవ్‌ చిరకాల కోరిక.

ఆస్రా , చిరంజీవి, పావని

ఆశ్రమంలో ఆ నలుగురు..

ఆశ్రమంలో కీలక పాత్ర వీరమాధవ్‌ది కాగా.. మనకు కనవడని సహృదయులు మరో ముగ్గురున్న‌రు. ఆస్రా.. ముస్లిం అమ్మాయి. వృద్ధులకు సేవ చేసుకుంటూ, వాళ్ల పూర్తి బాధ్యతలు తానే చూసుకుంటున్నది. మిగతా ఇద్దరి విషయానికి వస్తే.. పావని, చిరంజీవి. వీళ్లిద్దరు అక్కా తమ్ముళ్లు. అమ్మానాన్న చనిపోవడంతో అనాథలయ్యారు. మానసికంగా అనారోగ్యానికి గురైన పావని, చిరంజీవి.. ఇద్దర్నీ దగ్గరి సుట్టాలు తీసుకొచ్చి ఫౌండేషన్‌లో చేర్పించారు. అప్పుడు చిరంజీవి వయస్సు పదేండ్లు. వీరమాధవ్‌ మానసిక చికిత్స చేయించడంతో, ఇప్పుడు పావని ఆరోగ్యంగా ఉన్నది. ఆశ్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నది. మాధవ్‌కు చిరంజీవి కుడిభుజమైండు. తన తదనంతరం ఈ ఫౌండేషన్‌ బాధ్యతలు చిరంజీవే సూసుకుంటడని వీరమాధవ్‌ ఆశ, ఆకాంక్ష.

-గడ్డం సతీష్‌, 99590 59041

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

అత‌ని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశ‌మంత‌..

Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్‌స్పిరేష‌న్‌.. ఐఏఎస్ సాధించ‌డ‌మే కాదు..

gongadi trisha | క్రికెట్‌లో యువ సంచ‌ల‌నం మ‌న తెలంగాణ అమ్మాయి త్రిష‌..

Matilda Kullu | వ్యాక్సిన్లు వేసే ఆశావ‌ర్క‌ర్ ఫోర్బ్స్ జాబితాలోకి.. ఎలా సాధ్య‌మైంది?

కోట్లు సంపాదించి.. తన కంపెనీ ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చాడు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement