e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News నన్నయకు ముందే పద్యం

నన్నయకు ముందే పద్యం


తెలంగాణ సాహిత్య ప్రస్థానం -3
నిరవద్యుడు వేములవాడ చాళుక్యరాజు రెండో అరికేసరికి సమకాలికుడు. ఆ అరికేసరి కాలంలోనే వేయబడిన క్రీ.శ. 945 నాటిదైన జినవల్లభుడు అనే జైనముని వేయించిన కుర్క్యాల శాసనం రెండోది. దీనిలో కంద పద్యాలున్నాయి. కందం అచ్చమైన తెలుగు పద్యం. కందం దేశీ ఛందస్సు. మూడు కందపద్యాలతో ఉన్న ఈ శాసనం కుర్క్యాలలో శిలాఫలకంగా దొరికింది. క్రీ.శ. 945లో వేయించిన శాసనంలో కన్నడ, సంస్కత పద్యాలతో పాటు మూడు కంద పద్యాలు తెలుగులో ఉన్నాయి. కరీంనగరం జిల్లాలోని గంగాధర కుర్క్యాల మధ్య ‘త్రిభువన తిలక’మనే జైన వసతి నిర్మించుకొని జినవల్లభుడు శిష్యపరంపరతో ఉండేవాడు.నిత్యాన్నదానం చేసేవాడు. ఇతడు కన్నడ ఆదికవి పంపనికి సోదరుడు. పంపనికి ‘కవితా గుణార్ణవుడ’ని బిరుదముంది. జినవల్లభుడు ఒక చెరువును తవ్వించి దానికి గుణార్ణవమని పేరు పెట్టాడు.‘కందం చెప్పినవాడే కవి’ అని తెలుగులో లోకోక్తి ఉంది. అటువంటి కందం మొదటిసారిగా ఈ శాసనంలో దర్శనమివ్వటం వల్ల తెలుగులో చక్కని దేశీ కవిత్వం రచింపబడుతున్నదని తెలుస్తున్నది.

నన్నయకు ముందే పద్యం

శాసనాల ద్వారా నన్నయకు వంద సంవత్సరాలకు పూర్వమే తెలంగాణలో తెలుగు కవిత్వం వికసించిందని, కావ్యరచనలు జరిగి ఉంటాయని చెప్తున్నాయి. ఈ కావ్య కృషి గురించి వేములవాడ చాళుక్యుల చరిత్ర చదివితే మనకు స్పష్టమవుతున్నది.

తెలంగాణలో నన్నయకు పూర్వం చక్కని అలంకార శైలితో కూడిన పద్యరచన సాగిందని చెప్పే శాసనం క్రీ.శ.1000 నాటిదైన విరియాల కామసాని వేయించిన గూడూరు శాసనం. ఈ శాసనంలో మూడు చంపకమాల, రెండు ఉత్పల మాల పద్యాలున్నాయి. నన్నయకు పూర్వం మొదటిసారిగా మనకు సంస్కృత ఛందస్సులు తెలుగులోకితెచ్చి రాసిన వృత్త పద్యా లు కన్పిస్తున్నాయి. కొంత చారిత్రక ఘటనలు చెప్పటంలో అస్పష్టత ఉన్నా, వృత్త పద్యాలు చక్కని సంస్కృత దేశీ పదాల కూర్పుతో ఉత్ప్రేక్ష రూపకాలంకారంతో అందమైన శైలిలో ఉన్నాయి.
నన్నయకు యాభై ఏండ్ల పూర్వం వేయబడిన ఈ శాసనంలో కావ్యశైలి ఆనాటికే తెలుగులో కావ్యరచనలు జరిగాయని తెలియ జేస్తున్నది. ఈ శాసనం వేయించిన విరియాల కామసాని సాహసవంతురాలు. కాకతి బేతడు చిన్నవాడు. బాలున్ని తన సంరక్షణలోకి తీసుకొని పల్లవ రాజు సోమేశుని సహాయం తెచ్చి బేతని శత్రువును చంపి (శత్రువు ముదిగొండ చాళుక్యరాజు అయివుంటాడు) కాకతి సింహాసనం మీద కూర్చుండబెట్టిన వీరవనిత విరియాల కామసానియే ఈ శాసన రచయిత్రి కావచ్చును. అప్పుడు తెలుగులో మొట్టమొదటి కవయిత్రి విరియాల కామసాని అని చెప్పుకోవాలి.
వేములవాడ చాళుక్యులు-
తెలుగు కావ్యరచనారంభం:
బాదామి చాళుక్యరాజు రెండవ పులకేశి ఆంధ్రదేశంలోని తూర్పుతీర ప్రాంతంలో వేంగీ మండలాన్ని జయించి తన తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుడిని సామంతుడిగా కూర్చోబెట్టాడు. రెండవ పులకేశి మహావీరుడు. విజేత. ఆయన నర్మదా నది వరకు విజయాన్ని సాధించి అక్కడ ‘లాట’ దేశానికి తన ఇంకో తమ్ముడు జయసింహున్ని సామంతునిగా చేశాడు. ఆ జయసింహుని వంశం వాడే విక్రమాదిత్య యుద్ధమల్లుడు. రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుని వద్ద సేనాపతిగా ఉండి అనేక యుద్ధాలలో విజయాలను సాధించాడు. దానికి రాష్ట్రకూట రాజులు సంతోషించి యుద్ధమల్లన్ని తెలంగాణలోని ఈ నాటి నిజామాబాద్‌లో ఉన్న పోతన (బోధన్‌) ప్రాంతానికి సామంతరాజుగా చేశారు. యుద్ధమల్లుని వంశరాజులు క్రమంగా దక్షిణ ప్రాంత రాజ్యాలను జయించి తమ రాజ్యాన్ని వేములవాడకు మార్చుకున్నారు. అప్పటినుంచి వాళ్లు వేములవాడ చాళుక్యులుగా ప్రసిద్ధి చెందారు.
వేములవాడ చాళుక్యులకు రాష్ట్రకూటుల అండదండలున్నాయి కాబట్టి సంస్కృతం, తెలుగుతో పాటు కన్నడభాషను ఆదరించా రు. తమ శాసనాలను కన్నడ, సంస్కృత భాషలో వేయించారు. కన్నడ సాహిత్యం లో ఆదికవి అయిన పంపడు వేములవాడ చాళుక్యరాజు రెండవ అరికేసరి ఆస్థానంలో దండనాథునిగా ఉన్నాడు. ఆ పంపకవి కన్నడం లో ఆదికావ్యం ‘విక్రమార్జున విజయం’ కావ్యా న్ని క్రీ.శ. 930లో రచించాడు. మహాభారత కథను తీసుకొని అర్జునున్ని నాయకునిగా చేసి ఏకనాయకాశ్రంగా రచించాడు. రెండవ అరికేసరి గొప్ప వీరుడు. ఎన్నో యుద్ధాలు చేసి విజయాలను సాధించాడు. అందుకేనేమో పంపడు అర్జునునికి, రెండో అరికేసరికి అభేదం చేస్తూ ‘విక్రమార్జున విజయం’ కావ్యం రచించాడు.
కన్నడ సాహిత్యంలో ఆదికావ్యం తెలంగాణ నేలమీద రాయబడటం విశేషం. రెండో అరికేసరి క్రీ.శ. 930-55 మధ్య పరిపాలించాడు. ఆయన సాహిత్యప్రియుడైన రాజు. సాహిత్య సమరాంగణ చక్రవర్తి. శ్రీకృష్ణదేవ రాయలతో, రఘునాథరాయలతో పోల్చదగిన రాజు. అతని ఆస్థానంలో సంస్కృతం, కన్నడం, తెలుగు భాషలకు చెందిన కావ్యాలు రచింపబడినాయి. లాటదేశం నుండి సామదేవసూరి అనే సంస్కృత పండితుడు, ప్రసిద్ధ జైనకవి వచ్చి అరికేసరి ఆస్థానంలో కవిగా గౌరవం పొందాడు. ఆయన ‘యశస్తలక చంపువు’ అనే ప్రసిద్ధ సంస్కృత కావ్యాన్ని, నీతి కావ్యమనే రాజనీతి శాస్త్ర గ్రంథాన్ని రచించాడు.

  • ముదిగంటి సుజాతారెడ్డి
    9963431606
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నన్నయకు ముందే పద్యం

ట్రెండింగ్‌

Advertisement