హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ధరణిలోని నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవసాయ భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్య లు చేపట్టింది. రైతులు దరఖాస్తు చేయకుండానే ప్రభుత్వమే పరిశీలించి ఈ భూములను విడుదల చేయనున్నది. అధికారులు ప్రతి గ్రామంలో నిషేధిత జాబితాలోని భూముల వివరాలను సర్వే నంబర్ల వారీగా సేకరిస్తున్నారు. సదరు భూమి నిషేధిత జాబితాలోకి ఎందుకు వెళ్లింది? దాన్ని జాబితా నుంచి విడుదల చేయడానికి లేదా చేయకపోవడానికి కారణలేమిటి? వంటి అంశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వోలు సర్వే చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సర్వే నివేదిక అందగానే పొరపాటున నిషేధిత జాబితాలో చేరిన భూములను విడుదలచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.