e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News దోస్తానా v కరోనా!

దోస్తానా v కరోనా!

‘మనిషి ఈ భూమ్మీదకి ఎలా వచ్చాడు’ అన్నదానికి అనేక కారణాలు వినిపిస్తాయి.
అందుకు సాక్ష్యంగా ఎన్నో సిద్ధాంతాలు, నమ్మకాలూ కనిపిస్తాయి. కానీ, ఆ మనిషి ఎలా మనుగడ సాగించాడు, లోకాన్ని ఎలా జయించాడు అన్న ప్రశ్నలకు మాత్రం ఓ ముఖ్యమైన కారణం కనిపిస్తుంది.అదే.. బంధం. ఒంటరిగా ఉంటే అపర కుబేరుడు సైతం, అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకొనే నిరుపేదలని చూసి ఈర్ష్య పడాల్సిందే! ఆత్మీయులు తోడున్నవారికి, ఆఖరి క్షణాల్లో సైతం నిరాశ తలవంచాల్సిందే.

మరి అంత గొప్ప బంధం చేజిక్కేదెలా? బంధువులను ఎలాగూ ఎంచుకోలేం. సహోద్యోగులను చూసి ఉద్యోగంలో చేరలేం. చాలా సందర్భాలలో మనకు నచ్చినవారితో కలిసి ప్రయాణించలేం. కానీ, ఒక్క స్నేహితుడిని మాత్రమే ఎంచుకోగలం. తనతో మనసును పంచుకోగలం. బహుశా ఈ తరం, జీవితంలోనే తొలిసారిగా ఆ స్నేహాలకు అనూహ్యమైన పరీక్ష వచ్చిపడింది. కొవిడ్‌తో అన్నీ మారినట్టే… స్నేహం కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నది.

- Advertisement -

11 మార్చి 2020.. చాలా రోజుల సంశయం తర్వాత ‘కొవిడ్‌ ఓ మహమ్మారి’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. పక్షం రోజులు గడవకుండానే మన దేశం కూడా లాక్‌డౌన్‌ ప్రకటించింది. జనానికి కాలం ఆగిపోవడం అంటే ఏమిటో అనుభవంలోకి వచ్చింది. మనిషిని మనిషి తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితి. నాలుగు గోడల మధ్యే తనను తాను బంధించుకోవాల్సిన దుస్థితి. ఫలితంగా ప్రతి రంగమూ ప్రభావితమైంది. ఉపాధి చిన్నబోయింది, విద్య దూరమైంది, ప్రయాణం కలగా మారింది. ఇవన్నీ ఫర్వాలేదు. బతికుంటే చాలు, మున్ముందు అన్నీ ఆస్వాదించవచ్చు. కానీ మిత్రులను కూడా కలవనివ్వని ఒంటరితనాన్ని ఎలా అధిగమించాలి? ఇప్పటికీ భౌతిక దూరాలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. చదువూ, ఉద్యోగాలు ఆన్‌లైన్‌లోనే కొనసాగుతున్నాయి. అలలు అలలుగా ముంచుకొస్తున్న కొవిడ్‌ మరిన్ని నెలల పాటు మనల్ని విడిచి పెట్టేట్టు లేదు. మొత్తానికి, కొవిడ్‌ మన స్నేహబంధాలకు బీటలు వేస్తున్నది.

స్నేహం మిస్‌ అవుతున్నది
ఒక పరిశోధన ప్రకారం స్నేహం మీద తీవ్ర లాక్‌డౌన్‌ ప్రభావం చూపించింది. ఆస్ట్రేలియాలో ప్రతి ఇద్దరిలోనూ ఒకరు తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవించారు. అమెరికా, బ్రిటన్‌ లాంటి చోట్ల ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ‘కొవిడ్‌ సమయంలో నేరుగా మాట్లాడుకోవడం బదులు సామాజిక మాధ్యమాలను ఆశ్రయించడం వల్ల కొన్ని స్నేహాలు మాత్రమే నిలువడం గమనించాను’ అంటారు బోవర్‌ అనే మనస్తత్వ శాస్త్రవేత్త.

ఆన్‌లైన్‌ చిచ్చు
స్కూల్‌, కాలేజి, ఉద్యోగం, డ్యాన్స్‌ క్లాసులు… ఇలాంటి చోట్ల ఏర్పడే స్నేహాలు చాలాకాలం నిలుస్తాయి. మానసిక ఒత్తిడినికూడా మాయం చేస్తాయి. కానీ ఆన్‌లైన్‌ పుణ్యమాని ఆఫ్‌లైన్‌లో ఆత్మీయులున్నా పలుకరించలేని పరిస్థితి. నిజానికి ఈ విషయం చాలామంది విద్యావేత్తలను కంగారు పెడుతున్నది. సుదీర్ఘకాలపు ఆన్‌లైన్‌ క్లాసులు పిల్లల సామాజిక ఎదుగుదలమీద ప్రభావం చూపిస్తున్నాయన్నది వారి వాదన.

సరదాలు ఎగిరిపోయాయి
ఇద్దరు స్నేహితులు కలిస్తే ఎప్పుడూ జీవితం గురించో, కష్టసుఖాల గురించో మాట్లాడుకోరు. కవ్వించుకుంటారు, ఏడిపించుకుంటారు, గొడవ పడతారు, గాసిప్స్‌ చెప్పుకొంటారు. వీటిని సామాజికవేత్తలు ‘మైక్రో ఇంటరాక్షన్స్‌’ అంటారు. పనికిరానట్టు కనిపించే ఈ కబుర్లే బంధాన్ని బలపరుస్తాయి. ఆన్‌లైన్‌లో ఆ చనువు అంత తేలికగా రాదు.

తనలో.. లోలోపలికి
కొంతమంది అంతర్ముఖంగా ఉంటారు. అది ఓ వ్యక్తిత్వం. కానీ మరికొందరు డిప్రెషన్‌ లాంటి కారణాలతో తమలో తామే కుంగిపోతుంటారు. అలాంటివారికి తరచూ పలకరింపులు అవసరం. ‘నేను అండగా ఉన్నాననే’ భరోసా ఇస్తూ, ధైర్యం చెబుతూ, సరదాగా నవ్వించే స్నేహితులే వీరికి బలం. కానీ కొవిడ్‌ కాలంలో ఇదంతా కుదరడం లేదు. ఫలితంగా, మరింత కుంగుబాటుకు లోనవుతున్నారని బ్రిటన్‌లో జరిగిన ఓ పరిశోధన చెబుతున్నది. దాంతో కుంగుబాటు బాధితులు, సమాజం తమను వెలివేసిందనే (సోషల్‌ రిజెక్షన్‌) భావనలోకి జారిపోతున్నారు.

అపార్థాలు పెరుగుతున్నాయి
ఎదుటి వ్యక్తి మనకు నిజంగా ఎంత గౌరవం ఇస్తున్నాడు? అతను ఎంత గౌరవం ఇవ్వాలని మనం భావిస్తున్నాం? ఆ రెండు అంశాల మధ్య ఎంతో కొంత తేడా ఉండటం సహజం. ఈ తేడాను ‘లింకింగ్‌ గ్యాప్‌’ అంటారు. తరచూ కలుసుకుంటూ ఉంటే, ఈ అగాథం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే లేనిపోని అపార్థాలకు దారితీస్తుంది. కొవిడ్‌ సమయంలో ఇదే జరుగుతున్నదని నిపుణుల విశ్లేషణ.

ప్రత్యామ్నాయాలవైపు..
స్నేహితులు దూరం కావడం మనసును తొలిచే సమస్య. తద్వారా ఏర్పడిన ఒంటరితనాన్ని భర్తీ చేసుకునేందుకు చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. వాటిలో కొన్ని ఉపశమనం కలిగించినా, లేనిపోని సమస్యలుగా మారే ప్రమాదమూ లేకపోలేదు.

పెంపుడు జంతువులతో ..
మనసారా మాట్లాడటానికి మనుషులు కరువైన వేళ మూగ జంతువులతో స్నేహం చేస్తున్నారు. పెంపుడు పిల్లులు, కుక్కల సంఖ్య ఏకంగా ఏడు శాతం పెరిగినట్టు ఎల్‌.ఇ.కె కన్సల్టింగ్‌ అనే సంస్థ చెబుతున్నది. పెంపుడు జీవుల ఆహారం తదితర అవసరాల మీద ఖర్చుకూడా అసాధారణంగా పెరిగినట్టు ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గన్‌ స్టాన్లే వెల్లడించింది. పెంపుడు జీవులకు సంబంధించిన చాలా యాప్స్‌ వాడకంలో నూటికి నూరు శాతం పెరుగుదల కనిపించింది. అంతేకాదు, మూగజీవాల్ని దత్తత తీసుకుంటామంటూ ముందుకు వచ్చేవారి సంఖ్యకూడా పెరిగినట్టు నిర్ధారించింది ‘షెల్టర్‌ యానిమల్స్‌ కౌంట్‌’ అనే వెబ్‌సైట్‌. ఈ మార్పు తాత్కాలికం కాకపోవచ్చు.

పక్కవారిని పలకరిస్తేనేం!
‘నీ పొరుగువాడిని ప్రేమించమ’నే బైబిల్‌ సూక్తిని ఎప్పుడో మర్చిపోయాం. అపార్టుమెంట్‌లో వందల కుటుంబాలు ఉంటున్నా, ఒకరికొకరు అపరిచితుల్లా మిగిలిపోతున్నాం. వారితో అనుబంధాన్ని బలపరుచుకునేందుకు కొవిడ్‌ను మించిన సమయం లేదంటున్నారు సామాజికవేత్తలు.

కెరీర్‌పై మరింత దృష్టి..
కొవిడ్‌ వల్ల భవిష్యత్తు గురించిన బెంగ పెరిగిపోయింది. హఠాత్తుగా అనారోగ్యం వస్తే లక్షలు ఖర్చవుతాయనే భయం మొదలైంది. కొలువులకు హామీ ఉండటం లేదు. దాంతో త్వరగా బ్యాంకు బ్యాలెన్స్‌ పెంచుకోవాలనే తపన మొదలైంది. స్నేహితులతో కాలక్షేపం కంటే పనిలోనే సేదతీరే ప్రయత్నం జరుగుతున్నది. ‘అమెరికన్‌ పర్‌స్పెక్టివ్స్‌’ అనే సంస్థ జరిపిన సర్వేలో చాలామంది.. వరుసబెట్టి ఆరుగురు స్నేహితుల పేర్లుకూడా చెప్పలేకపోయారట. ఇందుకు కెరీరే ముఖ్య దోషి అని, కొవిడ్‌ కూడా అందుకు సాయపడిందనీ చెబుతున్నదీ సంస్థ.

ఆన్‌లైన్‌ తోడు
కలిసి పనులు చేసుకోవడం స్నేహానికి ఆలంబన. దీన్నే ‘షేర్డ్‌ యాక్టివిటీ’ అంటారు. ఇప్పుడు, ఆ అవసరం ఉండటం లేదు. డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలన్నా, మొబైల్‌ కొనుక్కోవాలన్నా, బట్టలు షాపింగ్‌ చేయాలన్నా నేస్తాలను వెంట తీసుకువెళ్లాల్సిన పని లేదని తేల్చింది కొవిడ్‌. మనలో బద్ధకాన్ని బుజ్జిగిస్తూనే చిన్న క్లిక్‌తో ఏ వస్తువునైనా అందించే ఆన్‌లైన్‌ను బాగా అలవాటు చేసింది. ఇకనుంచి మన దేశంలో ఏడాదికి 21 శాతం పాటు ఈ-కామర్స్‌ రంగం వృద్ధి చెందుతుందని ‘గ్లోబల్‌ పేమెంట్స్‌ నివేదిక’ లెక్క తేల్చింది. రాబోయే కాలంలో ‘వర్చువల్‌ హెడ్‌సెట్లు’ రాజ్యమేలబోతున్నాయి. అంటే, ఫంక్షన్లకి కూడా వెళ్లాల్సిన పనిలేదు. ప్రపంచమే మన కంటిముందుకు వచ్చేస్తుంది. బంధాలుకూడా దృశ్యాలుగా మారబోతున్నాయి.

మరేం చేసేది?
జీవం లేని వైరస్‌కు భయపడి సాటి మనిషికి దూరంగా ఉండలేం. ఉండి సుఖపడనూ లేం. స్నేహం విలువను త్వరగా గుర్తిస్తే దాన్ని నిలుపుకొనేందుకు సవాలక్ష మార్గాలు కనిపిస్తాయి. పాత స్నేహాలను వికసింపజేసేందుకు, కొత్త స్నేహాలు పరిమళించేందుకు నిపుణులు ఎన్నో సూచనలు ఇస్తున్నారు.

వీడియో కాలింగ్‌
కొన్నేండ్ల క్రితం అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో వీడియో కాలింగ్‌ గురించి ఓ సర్వే జరిగింది. ఇందులో పాల్గొన్నవారిలో 96% మంది వీడియోకాల్స్‌ వల్ల దూరపు బంధాలు బలపడినట్టు చెప్పారు. కాబట్టి, మొహమాటాలను పక్కనపెట్టి స్క్రీన్‌ ఆన్‌ చేసుకోమంటున్నారు.

కొత్త స్నేహాలు పెంచుకుంటే
ఒకే తరహా అలవాట్లు ఉన్నవారు త్వరగా మైత్రిలోకి ఇమిడిపోతారని చాలా సర్వేలు తేల్చాయి. కొవిడ్‌ సమయంలో అమెరికన్లు ఓ పాత మిత్రుడిని కోల్పోయినా, ఆ స్థానంలో ఓ కొత్త మిత్రుడిని పొందగలిగారట. అందుకు కారణం… ఒకే రకమైన అభిరుచులు ఉన్నవారితో స్నేహం బలపరుచుకోవడమే.

పాత మిత్రులను పలకరిస్తే : ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూప్‌లద్వారా చిన్ననాటి మిత్రులను పలుకరించే అవకాశం లభిస్తున్నది. సామాజిక మాధ్యమాలద్వారా తమ పాత మిత్రులు కలుస్తున్నారంటూ ఏకంగా 89 శాతం మంది ఓ సర్వేలో అంగీకరించారు. ఈ ఏకాంతపు కాలంలో వారికి మరింత చేరువయ్యే అవకాశం ఉంది. గడిచిన కాలపు కబుర్లను, విడిపోయాక జరిగిన సంగతులను పంచుకుంటే పాత స్నేహం పదింతలవుతుంది.

సాంకేతిక సాయం
‘షేర్‌ చాట్‌’ సంస్థ సర్వేలో 87 శాతం మంది కొవిడ్‌ సమయంలో స్నేహాలను నిలుపుకొనేందుకు డిజిటల్‌ మాధ్యమాలే దిక్కు అయ్యాయని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న పాత యాప్స్‌తోపాటుగా కొన్ని కొత్త సాధనాలూ ఉపయోగపడటం విశేషం. స్నేహితులతో కానీ, ఒకే అభిరుచి ఉన్నవారితో కానీ సరదాగా మాట్లాడుకునే అవకాశం కల్పించే, క్లబ్‌హౌస్‌ యాప్‌ మన దేశంలో నెలరోజుల్లోనే యాభై లక్షల డౌన్‌లోడ్‌లను సొంతం చేసుకుంది. సహోద్యోగులతో ఎప్పటికప్పుడు మాట్లాడుకునే అవకాశం కల్పించే స్లాక్‌, తాత్కాలిక సందేశాలు పంపించే స్నాప్‌చాట్‌, స్నేహితులంతా ఒకేసారి వీడియోకాల్‌లో కలుసుకోగలిగే హౌస్‌పార్టీ.. అన్నీ అనుబంధాలకు వారధిగా నిలిచేవే.

ఆ పదిమందినీ వదులుకోవద్దు
రాబిన్‌ డన్బర్‌ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్‌. ఆయన సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషికీ ఓ అయిదుగురు ఆప్తమిత్రులు ఉండటం మంచిది. కష్టసుఖాల్లో వాళ్లు పక్కన ఉంటే బాగుంటుందని అనుకునే స్నేహమది. ఈ అయిదుగురినీ వారంలో ఒకసారైనా కలుస్తూ ఉంటేనే ఆ స్నేహం నిలుస్తుందని అంటారు రాబిన్‌. అదనంగా, మరో అయిదుగురు మిత్రులుకూడా ఉండాలట. వీరితో అంత దగ్గరితనం లేకపోయినా, వాళ్లు లేకపోతే మన లోకం కాస్త చిన్నబోయినట్టుగా ఉంటుందట. వాళ్లను కనీసం నెలకు ఓసారైనా కలవాలని అంటారు రాబిన్‌.

ఇవీ తూకపురాళ్లు
‘స్నేహానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు ఏమిటి?’ అనేది తేల్చేందుకు మనస్తత్వ నిపుణులు చాలా ప్రయత్నించారు. వారి ప్రకారం ఈ మౌలిక లక్షణాలు స్నేహాన్ని సూచిస్తాయి.

ముఖ పరిచయాన్ని స్నేహంగా భావించలేం. అప్పుడప్పుడూ కలుసుకోవడం, అభిప్రాయాలు కలబోసుకోవడం జరగాలి.
ఎదుటివ్యక్తిని మనం స్నేహితుడిగా పరిగణిస్తే సరిపోదు. ఇద్దరి మధ్యా ఆ చనువు ఉండాలి.
స్నేహంలో బంధంతోపాటు స్వేచ్ఛకూడా ఉంటుంది. ఒక పని చెయ్యమని బలవంత పెట్టనూలేం, చేయవద్దని అడ్డుకోనూలేం. నైతికంగానే కాదు, న్యాయపరంగా కూడా స్నేహితులమధ్య బరువు బాధ్యతలు ఉండవు. వ్యక్తిగత విచక్షణకే ఇక్కడ ప్రాధాన్యం.
ఇద్దరు మనుషుల మధ్య స్థాయీబేధాలు ఉండవచ్చు, పేదాగొప్పల తారతమ్యం ఉండవచ్చు. కానీ వాళ్లు స్నేహితులు అయినప్పుడు ఒకరిమీద ఒకరికి సమానమైన అధికారం ఉంటుంది.
ఒకరినొకరు పట్టించుకోవడం (మూచ్యువల్‌ కేరింగ్‌) స్నేహం లక్షణం. చెప్పకుండానే కష్టాన్ని అర్థం చేసుకోవడం, చూడగానే మనసును గ్రహించడం స్పష్టంగా కనిపిస్తాయి.
స్నేహంలో కలిసి పనిచేయడం కనిపిస్తుంది. సరదాగా సినిమాకి వెళ్లినా, ఏదన్నా లక్ష్యం కోసం పోరాడినా చెట్టాపట్టాలేసుకుని తిరిగే తీరు కనిపిస్తుంది.

డిజిటల్‌ వ్యసనం
పుష్కరకాలం కిందటే మన దేశంలోకి ఓటీటీ సేవలు ప్రవేశించాయి. కానీ, ఏండ్ల తరబడి ఆ సంస్థలు చేతులు కాల్చుకుంటూనే ఉన్నాయి. అనుకోకుండా వచ్చిన లాక్‌డౌన్‌, ఒటీటీలకు కాసులపంట పండిస్తున్నది. ఇక సోషల్‌ మీడియా గురించి చెప్పనక్కర్లేదు. మొదటి లాక్‌డౌన్‌లోనే సామాజిక మాధ్యమాల వాడకం 75 శాతం పెరిగింది. జూలై 2020 నాటికే మన డిజిటల్‌ అలవాట్లలో మార్పు వచ్చినట్టు ‘డేటా రిపోర్టల్‌’ చెబుతున్నది.

.. పెరుగుదల వచ్చినట్టు ‘డేటా రిపోర్టల్‌’ సంస్థ అంచనా. వీటితోపాటు పాడ్‌కాస్టులు, గానా లాంటి సంగీతపు యాప్స్‌ మీదకూడా గణనీయమైన సమయం కేటాయిస్తున్నట్టు తేల్చింది. కొవిడ్‌ సద్దుమణిగాక కూడా ఈ ఎదుగుదల కొంత స్థిరపడిపోతుందని మార్కెట్‌ నిపుణుల అంచనా.

..పై లక్షణాలన్నీ సులువుగానే తోస్తాయి. కానీ, ఒకో పరీక్షా దాటేకొద్దీ ఎన్నో బంధాలు సాధారణమైన పరిచయాలే అనిపిస్తాయి. లేకపోతే, ఫేస్‌ బుక్‌లో వేలమంది మిత్రులున్నవారు ఒంటరితనాన్ని ఎందుకు అనుభవిస్తారు! ఆ మాటకు వస్తే సామాజిక మాధ్యమాలలో మనకు కనిపించే జాబితాలు, కనీసం పరిచయాల స్థాయిలో అయినా ఉన్నాయా అన్నది ఆలోచించాల్సిన విషయం. అప్పుడే డిజిటల్‌ తెరల నుంచి బయటపడి, నిజమైన స్నేహాల కోసం అన్వేషణ మొదలవుతుంది.

అరిస్టాటిల్‌ ఉవాచ
గ్రీక్‌ తత్వవేత్త అరిస్టాటిల్‌ దృష్టిలో స్నేహం జీవితంలో భాగం మాత్రమే కాదు. ఓ జీవన విధానం కూడా. ఆయన స్నేహాలను మూడురకాలుగా విభజిస్తారు.

  1. అవసరం కోసం ఏర్పడేవి.
  2. సరదా కోసం సాగేవి.
  3. క్షేమం కోసం కొనసాగేవి.
    మొదటిది సాధారణంగా పెద్దవాళ్లలో కనిపిస్తుందని అంటాడు అరిస్టాటిల్‌. అవసరం తీరిపోయాక వీళ్లు విడిపోతారు. సరదాకోసం ఏర్పడే స్నేహాలు కుర్రతనంలోనే ఎక్కువ. కలుసుకునే అవకాశాలు తగ్గినకొద్దీ ఈ తరహా మైత్రికూడా వీగిపోతుందని తేల్చాడు. ఒకరినొకరు అర్థం చేసుకుని సాగే మూడో తరహా స్నేహం ఇద్దరికీ మేలు చేస్తుంది. కానీ, ఎదుటివారి సుఖం కోరుకునేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు కాబట్టి ఈ స్నేహం అరుదుగా కనిపిస్తుందని తీర్మానిస్తాడు అరిస్టాటిల్‌. గ్రీస్‌ భాషలో ‘ఫిలా’ అంటే ‘అత్యున్నతమైన ప్రేమ’ అని అర్థం. అరిస్టాటిల్‌ స్నేహాన్ని ఫిలాకు పర్యాయపదంగా భావించాడు.

ముక్తిమార్గంలోనూ స్నేహమే!
బౌద్ధంలో ‘కళ్యాణ మిత్తత’ అంటే, ‘గొప్ప స్నేహం’ అని అర్థం. బంధాలనుంచి విముక్తి సాధించడమే ధ్యేయంగా సాగే మార్గంలో స్నేహానికి విలువనివ్వడం విశేషం. అంతేకాదు ‘ఉన్నతమైన స్నేహితులు ఉన్నవారు అష్టాంగమార్గాన్ని త్వరగా తేలికగా చేరుకోగలుగుతారు’ అని బుద్ధుడే స్వయంగా చెప్పాడని అంటారు. గృహస్థులు కూడా మంచివారితో స్నేహం చేయడం వల్ల అవతలి వ్యక్తులలో ఉండే పట్టుదల, వివేకం, దాతృత్వం లాంటి లక్షణాలు అలవడతాయని వారి సాహిత్యం చెబుతున్నది. బుద్ధఘోష వంటి ప్రముఖ బౌద్ధులు సైతం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగేందుకు గొప్ప స్నేహితుల అవసరాన్ని పేర్కొన్నారు. అత్యున్నత స్థితికి చేరుకునేందుకు బుద్ధుని స్నేహితునిగా స్వీకరించాలనీ, అలా కుదరని పక్షంలో ఆయన శిష్యులను, అదీ కుదరని పక్షంలో బంధనాలను ఛేదించుకున్నవాడినీ.. అంటూ ఎవరితో మైత్రి చేస్తే మంచిదో చెబుతాడు బుద్ధఘోషుడు.

దీర్ఘాయుష్మాన్‌ భవః
స్నేహితుడు పక్కనుంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. ఎంతటి ఒత్తిడయినా కరిగిపోతుంది. తనతో నవ్వులతో, కేరింతలతో గడిపే సమయంతో డోపమైన్‌ లాంటి సానుకూల హార్మోన్లు విడుదలై మన ఆరోగ్యం మెరుగవుతుంది. విలియం చోపిక్‌ అనే పరిశోధకుడు 2.80 లక్షల మంది మీద ఓ అరుదైన పరిశోధన చేశాడు. వయసు పెరిగేకొద్దీ కుటుంబం కంటే స్నేహితుల తోడువల్లే ఎక్కువ సంతోషంగా ఉంటామని తేల్చాడు. మనలోని ధైర్యాన్ని, భయాన్ని కూడా మిత్రులు ప్రభావితం చేస్తారని ఇంగ్లండుకు చెందిన మరో పరిశోధన తేల్చింది. అంతేకాదు! స్నేహితులు పక్కనుంటే డిప్రెషన్‌ తగ్గుతుందని, గుండెపోటు వచ్చే అవకాశాలు పలచబడతాయని, ఎలాంటి తిరస్కారాన్నయినా భరించగలమని.. ఇలా సవాలక్ష లాభాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి.

కొవిడ్‌ ఓ అనుకోని అతిథి. జాగ్రత్తగా గమనించుకుని, సాగనంపేయాలి. ఆ వైరస్‌ భయంతో మన జీవితంలో మరింత ముఖ్యమైన కుటుంబం, స్నేహం, చదువు, ఆరోగ్యం లాంటివాటిని అశ్రద్ధ చేస్తే తాను వెళ్తూ వెళ్తూ బంధాలను కూడా మనకు దూరం చేసేస్తుంది. ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడానికి, అరమరికలు లేకుండా నేస్తాలను పలుకరించడానికి ఈ స్నేహితుల దినోత్సవం ఓ అనుబంధాల వారధిగా నిలువాలి.

హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana