e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News తెరకు అతుక్కుపోతే!

తెరకు అతుక్కుపోతే!


స్క్రీన్‌ టైమ్‌.. కొత్తగా వినిపిస్తున్న పదమే అయినా, ఈ పాటికి ఇది మన జీవితాల్లో సింహభాగాన్నే ఆక్రమించింది. మొబైల్‌, టీవీ, కంప్యూటర్‌ ఇలా ఏదైనా స్క్రీన్‌కి అంకితమయ్యే కాలాన్ని స్క్రీన్‌ టైమ్‌ అంటారు. దీని వల్ల రకరకాల మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. తాజాగా ఎక్కువ స్క్రీన్‌ టైమ్‌ గడిపే కుర్రకారులో ‘అతిగా తినే’ సమస్య ఏర్పడుతున్నట్టు గమనించారు. సాంకేతికంగా ఈ సమస్యని బింగీ ఈటింగ్‌ అంటారు. మొబైల్‌ స్క్రీన్‌కు అతుక్కుపోతున్నవారిలో.. ఆహార పరిమితులు దాటేందుకు 62 శాతం అవకాశం ఉందట. అలాగే టీవీలకు అతుక్కుపోయే యువతలో 39 శాతం మంది ఈ సమస్యకి లోనయ్యే ప్రమాదం ఉందని తేలింది. బింగీ ఈటింగ్‌ ఊబకాయానికి దారితీస్తుంది. దాంతో పాటు ఇతర మానసిక సమస్యలూ తలెత్తుతున్నాయి. ఆహారం మీద అదుపు లేకపోవడం వల్ల పశ్చాత్తాపం, ఎవరన్నా చూస్తారేమో అన్న భయం, నిరంతరం ఆహారం గురించి ఆందోళన లాంటి ఇబ్బందులకు గురవుతున్నారట. దీనికి పరిష్కారం తేలికే! స్క్రీన్‌ టైమ్‌ నిదానంగా గ్రీన్‌ టైమ్‌ (ప్రకృతితో గడిపే సమయం) మార్చుకోవడమే అని సూచిస్తున్నారు పరిశోధకులు.

వీగన్‌ మాయ


వీగన్‌ డైట్‌ పూర్తిగా వృక్ష సంబంధమైన ఆహారం మీద ఆధారపడే అలవాటు. పశువుల నుంచి వచ్చే పాల పదార్థాలను సైతం వీరు తిరస్కరిస్తారు. ఈ అలవాటుని ప్రోత్సహించేలా ఓ పరిశోధన వెలుగు చూసింది. ‘అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ’ ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం వీగన్‌ డైట్‌ తీసుకునేవారిలో ‘ఇషెమిక్‌ స్ట్రోక్‌’ అనే తరహా పక్షవాతం వచ్చే ప్రమాదం పదిశాతం వరకూ తగ్గిందట. మెదడుకు జరిగే రక్తసరఫరాలో అడ్డంకి ఏర్పడటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. 90 శాతం పక్షవాతాలకి ఈ ఇషెమిక్‌ స్ట్రోకే కారణం. అలాగని ఒక్కసారిగా వీగన్‌ డైట్‌కి మారిపోదామనుకుంటే మాత్రం ఇబ్బందే. మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలనూ వీగన్‌ డైట్‌ ద్వారానే అందుకోవాలంటే, నిపుణుల సలహా అవసరం. లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

చిటికెడు పసుపుతో


వంటింట్లో ఏ పదార్థం నిండుకున్నా ఫర్వాలేదు కానీ, పసుపు లేకపోతే మన ప్రాణాలు విలవిల్లాడిపోతాయి. దాంతో మన అనుబంధం అలాంటిది మరి! కూరకి రుచి రావడం దగ్గర నుంచి పూజలో పసుపు గణపతి వరకు పసుపు లేనిదే మనకు పని జరగదు. దెబ్బ తగిలినా, కొత్త బట్టలు వేసుకోవాలన్నా పసుపుతోనే పని. పసుపులోని ఔషధ గుణాల వల్లే, సంప్రదాయంలో దానికి అంత ప్రాధాన్యం. ఆ ఘనతకు సాక్ష్యంగా రకరకాల పరిశోధనలూ వినిపిస్తూ ఉంటాయి. తాజాగా కాలేయం పనితీరుని క్రమంగా బలహీనపరిచే ‘క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌’ నియంత్రణలో పసుపు చాలా ఉపయోగపడుతుందని డాక్టర్‌ సౌరభ్‌ అరోరా వెల్లడిస్తున్నారు. పసుపు నుంచి రూపొందించిన ఔషధాలతో కాలేయం వాపుని తగ్గించడమే కాకుండా, వ్యాధికారక క్రిములనుకూడా నాశనం చేయవచ్చని చెబుతున్నారు. ఈ తరహా ఔషధాలు అందుబాటులోకి వస్తే కోట్ల మందికి ఉపశమనం లభిస్తుంది. అందరి బతుకులూ పసుపు ‘పచ్చగా’ ఉంటాయి.

బీపీ తగ్గాలా.. బ్లాక్‌ టీ తాగండి!


టీ, కాఫీ, మద్యం..ఈ మూడింటి గురించి పరిశోధన సాగని రోజు ఉండదేమో. టీలో ఉండే థియామిన్‌ వల్ల మంచిచెడుల గురించి నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. అందులోని ఔషధ గుణాలు పూర్తిగా అందాలంటే, టీలో పాలు కలపకూడదనే వాదన ప్రచారంలో ఉంది. తాజాగా, బ్లాక్‌ టీ వల్ల మరో లాభం కూడా ఉందంటున్నారు క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు. వీరి నివేదిక ప్రకారం.. బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ లో ‘కెటషిన్స్‌’ అనే పదార్థాలు ఉంటాయట. ఇవి రక్తనాళాలకి ఉపశమనం కలిగిస్తాయట. దానివల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఎప్పటిలాగే ‘మోతాదులో తాగండి’ అనే షరతును మాత్రం పేర్కొంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెరకు అతుక్కుపోతే!

ట్రెండింగ్‌

Advertisement