e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News చెరువులో చేపలిలాచిందులేస్తున్నయ్‌

చెరువులో చేపలిలాచిందులేస్తున్నయ్‌

ప్రశ్న…

ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. సరైన సమాధానం ఉన్నప్పుడు, ప్రశ్నతో పాటు జవాబు కూడా సార్థకమవుతుంది. చాలాసార్లు ప్రశ్నలు సమాచారం తెలుసుకోవాలన్నఉద్దేశంతో కాకుండా, సమస్యను సృష్టించే దృష్టితోనే మొదలవుతాయి. అందువల్ల విషయం ప్రశ్న కాదు, దృక్పథం. తెలంగాణ కావాలన్నప్పుడు, వచ్చిన తర్వాత కూడా ప్రశ్నలే ప్రశ్నలు! తెలంగాణ ఇస్తే, లేదా వస్తే ఏమొస్తది? అన్న ప్రశ్న దగ్గర మొదలుపెట్టి తెలంగాణ వచ్చినాక ఏమొచ్చింది? అన్న ప్రశ్నదాకా..ఉద్యోగాలు ఏవీ? అన్న ప్రశ్న నుంచి చేపలు, గొర్రెలు ఇస్తే సరిపోతుందా? అన్న ప్రశ్నదాకా… చెరువుల బాగుతో ఏం జరిగింది? అన్న ప్రశ్నతో పాటు, చేపలు పెంచితే ఏం ఒరిగింది? అన్న ప్రశ్నదాకా… అన్నీ ప్రశ్నలే! మరి ఈ ప్రశ్నలకు జవాబులు లేవా? తెలంగాణ తెచ్చుకున్నాక, చెరువులు బాగుచేసుకున్నాక, చేపలు పెంచుతున్నాక ఏం జరిగిందీ చెప్పలేమా?ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ వ్యాసం. తెలంగాణలో ఐదేండ్ల నీలి విప్లవంపై తెలంగాణ ప్రేమికుడు మంగళపల్లి విశ్వేశ్వర్‌ బెంగళూరు నుంచి రాసిన విశ్లేషణాత్మక వ్యాసం… నమస్తే తెలంగాణ పాఠకులకు ప్రత్యేకం!

- Advertisement -

తెలంగాణలో ఐదేండ్లలో నీలివిప్లవం ముఖచిత్రం
తెలంగాణను సాధించుకున్న తర్వాత సాకారమైన గొప్పమార్పుల్లో ఒకటి నీలి విప్లవం. లక్షలాది మంది మత్స్యకారుల జీవితాల్లో, వారి కుటుంబాల్లో వెలుగులను నింపింది ఈ విప్లవం. ఈ కాలంలో కులవృత్తులు ఏమిటి అంటూ సందేహాలు వ్యక్తం చేసే వారే ఆశ్చర్యపోయేలా తెలంగాణ మత్స్యరంగం మహత్తర అభివృద్ధిని సాధించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల రైతులు మాత్రమే లాభపడటం లేదు.. మత్స్యకారులకు అవి కొత్తజీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. 2016-21 మధ్య కాలంలో దాదాపు 14,000 జలాశయాలు కొత్తగా ఉనికిలోకి వచ్చాయి. వీటితో చేపల పెంపకానికి అద్భుతమైన వనరులు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. మరోవైపు, ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో మత్స్యరంగంపై మధ్య దళారీల పట్టు గణనీయంగా సడలి.. ఆ ఆదాయం అంతా మత్స్యకారులకే లభిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీర్ఘదృష్టితో రచించి, అమలు చేస్తున్న ప్రణాళిలు తెలంగాణను బంగారుమయం చేస్తున్నాయి. దానికి ఒక ఉదాహరణ.. ఈ మహత్తర నీలి విప్లవం.

నాలుగేండ్ల కిందట..

తెలంగాణ ప్రభుత్వం 6 జూన్‌ 2017న జారీ చేసినజీవో-ఆర్టీ నెంబర్‌ 91 ప్రకారం రాష్ట్రంలో మత్స్యరంగం పరిస్థితి ఇదీ..74 భారీ, మధ్యస్థాయి, చిన్న జలాశయాలు (రిజర్వాయర్లు) ఉన్నాయి.

వీటి మొత్తం నీటి విస్తీర్ణం 1.776 లక్షల హెక్టార్లు.

4,324 మత్య్సశాఖ ఆధీనంలో ఉన్న చెరువులు

వీటి నీటి విస్తీర్ణం 2.622 లక్షల హెక్టార్లు

రాష్ట్రంలో మత్స్యకారుల సామాజికవర్గం జనాభా 27.14 లక్షలు
వీరిలో వృత్తిని కొనసాగిస్తున్నవారు 3.26 లక్షలు
చేపల పెంపకానికి (ఫిష్‌ కల్చర్‌కు) వీలుగా గ్రామపంచాయతీల వద్ద 19,476 చెరువులున్నాయి. వీటి నీటి విస్తీర్ణం 1.554 లక్షల హెక్టార్లు.
ఈ జలాశయాలు, చెరువుల నుంచి 2016-17లో రాష్ట్రంలో దాదాపు1.93 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం మత్స్సరంగంలో చేపల ఉత్పత్తి పెంచి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచటానికి, రాష్ట్రంలో వినియోగంలో ఉన్న మాంసాహారాల్లో చేపలను కూడా ఒక ముఖ్యమైన ఆహారంగా మలచటానికి వీలుగా రాష్ట్రప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. 2016-17 నుంచి 2020-21 మధ్యకాలంలో మత్స్యరంగంలో వచ్చిన కీలక మార్పులు..

ప్రభుత్వ చర్యలు
తెలంగాణ అవతరణ తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై, మిషన్‌ కాకతీయ వంటి పథకాల ద్వారా నీటినిల్వపై రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిరంతర శ్రద్ధ వల్ల నీటి విస్తీర్ణం స్థిరీకరించబడింది. రిజర్వాయర్లు, చెరువుల వంటి జలాశయాల్లో నీరు ఎంతకాలంపాటు అందుబాటులో ఉంటుందనే దానిని నీటి విస్తీర్ణం స్థిరీకరణ నిర్ణయిస్తుంది. చేపల ఉత్పత్తిలో ఇది అత్యంత కీలకమైన అంశం.

చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసే పథకాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ) ఆధ్వర్యంలోని రెండేండ్ల కాలవ్యవధి ఉన్న నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌ఎఫ్‌డీపీ) కూడా దీనికి తోడయ్యింది. జలాశయాల నీటి విస్తీర్ణం ఆధారంగా ఉచిత చేపపిల్లల పంపిణీ జరిగింది.
భారీ జలాశయాల్లో 80-100 మిల్లీమీటర్ల చేపపిల్లలు
చిన్న జలాశయాల్లో 30-40 మిల్లీమీటర్ల చేపపిల్లలు

తెలంగాణ మత్స్యరంగం-పంపిణీ , సరఫరా ….
తెలంగాణలో మత్స్యరంగం పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే పంపిణీ, సరఫరా ఎలా ఉందో
తెలుసుకోవాలి. వివిధ దశల్లో ఉత్పత్తి అయ్యే విలువ (సంపద) ఈ విధంగా ఉంది..

50% నిల్వ-ఉత్పత్తి
17,684 జలాశయాలు మత్స్యకార సామాజికవర్గం (బెస్త, ముదిరాజ్‌) చేతుల్లో..
30% సేకరణ-మార్కెట్‌ వరకు..మత్స్యకార సామాజికవర్గం కొంత, ఇతరుల చేతుల్లో కొంత రీటైల్‌ మార్కెట్లకు/ఇతర రాష్ర్టాలకు ఎగుమతి

20% రీటైల్‌ అమ్మకాలు
చేపల్ని శుభ్రపరచటం, అమ్మటం మత్స్యకార సామాజికవర్గం (బెస్త/ముదిరాజ్‌) చేతుల్లో అత్యధికభాగం.. ఇప్పుడు ఈ మూడు దశలను పరిశీలిద్దాం ….

నిల్వ-ఉత్పత్తి
రాష్ట్రంలో మత్స్యరంగం ఉత్పత్తి చేస్తున్న సంపదలో దీనిదే ప్రధాన వాటా. 50 శాతం సంపద పుట్టేది ఇక్కడి నుంచే. ఎంపిక చేసిన జలాశయాలకు రాష్ట్రప్రభుత్వం చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది ఈ దశలోనే. ఈ దశ పూర్తిగా మత్స్యకార సామాజికవర్గం, దాని ఉపకులాల చేతుల్లోనే ఉంది.

సేకరణ-మార్కెట్‌ వరకు (ఎగుమతులతో సహా)
ఈ దశలో మత్స్యకారులు పెద్ద ఎత్తున చేపలను పెంచి భారీ కొనుగోలుదారులకు సరఫరా చేస్తారు. వీళ్లు మంచినీటి చేపలకు బాగా డిమాండ్‌ ఉన్న పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాలకు, భారీస్థాయి స్థానిక మార్కెట్లకు ఈ చేపలను తరలిస్తారు. ఈ వ్యాపారం గతంలో మెజారిటీగా మత్స్యకార సామాజికవర్గానికి చెందని వారి (మధ్య దళారుల) చేతుల్లో ఉండేది. రాష్ట్రంలో మత్స్యరంగం ఉత్పత్తి చేస్తున్న సంపదలో ఈ దశ వాటా 30 శాతం. గతంలో దళారులు జలాశయాల్లో చేపపిల్లలను వదిలి.. తమకు అనుకూలంగా మత్స్యకారులతో ఏకపక్ష ఒప్పందాలు చేసుకునేవారు. తద్వారా మత్స్యకారుల నుంచి చేపలను చవకగా ఏకమొత్తంగా కొనేవారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసి జలాశయాల్లో వేయటమనే ప్రక్రియను ప్రారంభించిన తర్వాత చేపల సేకరణ ధరను నిర్ణయించే విషయంలో దళారుల పాత్ర గణనీయంగా తగ్గిపోయింది. ఆ ఆదాయం అంతా ఇప్పుడు మత్స్యకారులకు లభిస్తున్నది. అంతేగాక, మత్స్యకారులకు రాష్ట్రప్రభుత్వం ద్విచక్ర వాహనాలను, ట్రాలీలను సమకూర్చటం వల్ల వారే స్వయంగా చేపలను స్థానిక మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయించుకొని ఆదాయం గడించే అవకాశం ఏర్పడింది.

చేపపిల్లల ఉచిత పంపిణీకి అయిన వ్యయం రూ.2,246 లక్షల నుంచి రూ.5,180 లక్షలకు పెరిగింది. పెరుగుదల 131 శాతం


జలాశయాలకు చేపపిల్లల పంపిణీ
2016-17లో 3,939 జలాశయాల్లో చేప పిల్లల పెంపకం జరుగగా.. 2020-21 నాటికి అది 17,684 జలాశయాలకు విస్తరించింది. అంటే 350 శాతం పెరుగుదల నమోదైంది. తొలిరోజుల్లో స్థిరమైన నీటి విస్తీర్ణం ఉన్న భారీ జలాశయాలకే పరిమితమైన ఉచిత చేపపిల్లల పెంపకం.. తర్వాత కాలంలో నీటి విస్తీర్ణం స్థిరీకరణ పెరిగినకొద్దీ చిన్న జలాశయాల్లో కూడా ఈ ప్రక్రియ మొదలైంది.
ఉచితంగా పంపిణీ చేసిన చేపపిల్లల సంఖ్య 2,785 లక్షల నుంచి 6,687 లక్షలకు పెరిగింది. ఇది 140 శాతం వృద్ధి.
కొత్తగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావటం వల్ల కొత్త జలాశయాలు ఏర్పడటం, ఉన్న జలాశయాలు మెరుగుపడటంతో నీటి లభ్యత, నీటి విస్తీర్ణం పెరుగుతున్నది. దీనివల్ల తెలంగాణలో చేపపిల్లల పెంపకం, చేపల ఉత్పత్తి భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

చేపల ఉత్పత్తి -సంపద
2016-17 నుండి 2020-21 మధ్య ఐదేండ్ల కాలవ్యవధిలో చేపల ఉత్పత్తి 1.93,732 మెట్రిక్‌ టన్నుల నుండి 3,49,000 మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. ఇది 80 శాతం అభివృద్ధి.
ఇదే కాలవ్యవధిలో చేపల ఉత్పత్తి ద్వారా సృష్టించబడిన సంపద రూ.1,356.12 కోట్ల నుండి రూ.3,141 కోట్లకు చేరుకుంది. ఇది 132 శాతం పెరుగుదల.

గతంలో మత్స్యరంగం సృష్టించే సంపదలో అత్యధికభాగం మధ్య దళారీలే తీసుకునేవారు. కానీ, ఈ ఐదేండ్లలో ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్యరంగంపై వారి పట్టు సడలింది. ఫలితంగా ఈ రంగంలో పెరుగుతున్న సంపద మత్స్యకారుల సహకార సంఘాల సభ్యులకు (మత్య్సకార సా మాజికవర్గానికి) దక్కుతున్నది. సహకారసంఘాల ఆదాయంలో పెరుగుదల, సంఘాల సభ్యుల ఆదాయంలో పెరుగుదల దీనిని నిరూపిస్తున్నది.

సగటు ఉత్పత్తి
సగటున ఒక చేపపిల్ల నుంచి వస్తున్న ఉత్పత్తి తగ్గుతున్నది. ఐదేండ్లలో 25 శాతం తగ్గుదల నమోదైంది. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటంటే.. చేపపిల్లల పెంపకం తొలిరోజుల్లో తగినన్ని జలాశయాలు లేవు కాబట్టి.. అప్పటికి ఉన్న భారీ జలాశయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టే వాళ్లు. వాటిల్లో 100 మిల్లీమీటర్ల సైజున్న చేపపిల్లలను పెంచేవాళ్లు. ఈ సైజు కారణంగా చేపపిల్లల ఎదుగుదల వేగంగా ఉండేది. సాపేక్షికంగా వాటి మరణరేటు తక్కువగా ఉండేది. తర్వాతిరోజుల్లో చేప పిల్లల పెంపకానికి అనేక జలాశయాలు (వీటిలో అత్యధికం చిన్నవి) అందుబాటులోకి రావటంతో వీటిలో 30-40 మిల్లీమీటర్ల సైజున్న చేపపిల్లలను పెంచక తప్పని పరిస్థితి వచ్చింది. ఈ చేపపిల్లల మరణరేటు సాపేక్షికంగా ఎక్కువ. ఎక్కువ బరువు పెరగటానికి వీటికి పట్టే సమయం కూడా ఎక్కువ. ఏ రకమైన చేపపిల్లల్లోనైనా ఉత్పత్తి సహజ ప్రక్రియ ఒకటే కాబట్టి.. సగటు ఉత్పత్తి తగ్గటం అనేది అనివార్యం. ఇది అసాధారణమైనదీ కాదు.. ఊహించని విషయమూ కాదు.

రీటైల్‌ అమ్మకాలు
స్థానిక మార్కెట్లలో చేపల అమ్మకం జరిగేది ఈ దశలోనే. అంటే.. జలాశయాల్లో ఉత్పత్తి అయిన చేపలు ఈ దశలో వినియోగదారుల చెంతకు చేరుతాయి. ఈ దశ దాదాపుగా మత్స్యకార సామాజికవర్గం సభ్యుల చేతుల్లోనే ఉంది. చేపలను శుభ్రం చేయటం, అమ్మటం వారే నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మత్స్యరంగం మొత్తం విలువలో ఈ దశ నుంచి 20 శాతం విలువ ఉత్పత్తి అవుతుంది.

ప్రభుత్వం చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసి జలాశయాల్లో వేయటం ప్రారంభించాక చేపల సేకరణ, ధరను నిర్ణయించే విషయంలో దళారుల పాత్ర గణనీయంగా తగ్గిపోయింది. ఆ ఆదాయం అంతా ఇప్పుడు మత్స్యకారులకు లభిస్తున్నది.

2016-17 నుండి 2020-21 వరకు ఐదేండ్ల సమయంలో మత్స్యకారుల సహకార సంఘాలు 4,002 నుండి 4,604కు పెరిగాయి. ఇది 15 శాతం వృద్ధి. సభ్యుల సంఖ్య 2.85 లక్షల నుంచి 3.09 లక్షలకు పెరిగింది. ఇది 8 శాతం వృద్ధి. చేపల పెంపకానికి వీలుకల్పించే చిన్న జలాశయాల సంఖ్య పెరుగటం వల్ల సహకారంఘాల సంఖ్య పెరిగింది. సంఘాల్లో సభ్యత్వం కోసం డిమాండ్‌ పెరుగుతున్నది. ప్రస్తుతం 35,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

చేపల ఉత్పత్తి పెరుగుతుండటంతో సహకార సంఘాల ఆదాయం పెరుగుతున్నది. ఐదేండ్లలో ఇది సగటున రూ.33.88 లక్షల నుండి రూ.68.22 లక్షలకు పెరిగింది (105 శాతం వృద్ధి). వ్యక్తిగతస్థాయిలో సభ్యుల సగటు ఆదాయం కూడా రూ.47,453 నుండి రూ.1,03,433కు పెరిగింది.

చెరువుల వద్ద చేపలను సగటున రూ.70-95కు కిలో చొప్పున విక్రయిస్తున్న ధర ఆధారంగా లెక్కిస్తే.. మత్స్యకార సామాజికవర్గానికి గత ఐదేండ్లలో చేపల ఉత్పత్తి ద్వారా ఒనగూరిన మొత్తం సంపద రూ.11,606.6 కోట్లు. ఇది కూడా ఉజ్జాయింపుగా వేసిన అంచనా మాత్రమే.

నిర్ధారణలు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో మత్స్యరంగం గణనీయంగా అభివృద్ధి చెందింది.
నీటి విస్తీర్ణం స్థిరీకరణ, ఉచిత చేపపిల్లల పెంపకం అనే రెండు కీలక చర్యల ద్వారా ఇది సాధ్యపడింది.
మత్స్యరంగంలో సరఫరా, పంపిణీ ప్రక్రియపై గతంలో మధ్య దళారీలకు ఉన్న పట్టు సడలింది. దీనివల్ల సరఫరా, పంపిణీ రంగాల్లో సృష్టించబడే సంపద ఇప్పుడు అధికభాగం మత్స్యకార సామాజిక వర్గానికి లభిస్తున్నది.
మత్స్యకార సహకార సంఘాల, సభ్యుల ఆదాయం గణనీయంగా పెరిగింది.

-మంగళపల్లి విశ్వేశ్వర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement