e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News ఖాజీపురం.. అక్షరధామం

ఖాజీపురం.. అక్షరధామం

ఖమ్మం జిల్లా మధిర మండలం ఖాజీపురం గ్రామం చిన్న పల్లెటూరు. ఇక్కడ కేవలం 500 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. 5వ తరగతి వరకు అక్కడే చదుకోవాలి. ఉన్నత చదువులకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే.. అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయోజకులను చేయాలని తపనతో మధిర, ఖమ్మం, హైదరాబాద్‌, విజయవాడ, వరంగల్‌ తదితర నగరాలు, పట్టణాలకు పంపించి చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ, ప్రైవేట్‌ కొలువులు సాధించారు. అమ్మానాన్నల ఆశయానికి బాసటగా నిలిచారు.

అందరూ విద్యావంతులే..
ఈ గ్రామంలో ఆది నుంచి చైతన్యం ఎక్కువే.. ప్రతిఇంట్లో మహిళలు, యువకులు, వృద్ధులు ఇలా అందరూ విద్యావంతులు కావడం విశేషం. అంతేకాదు, ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇక్కడివారికి మొదటి నుంచి విద్యపై ఆసక్తి ఉండేది. ఉద్యోగ సాధనలో పోటీపడి ఉత్తమ స్థాయిలో నిలిచారు. ఈ గ్రామంలో వైద్యులు, ఇంజినీర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇలా వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు చాలామందే ఉన్నారు. అక్షరాస్యులుగా ఎదిగి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

- Advertisement -

దేశ, విదేశాల్లోనూ ఉద్యోగాలు..
గ్రామంలో మొత్తం 234 కుటుంబాలుంటాయి. 47 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, పోలీసుశాఖ 40 మంది, టెలికాంలో నలుగురు, పోస్టల్‌శాఖలో నలుగురు, కేటీపీఎస్‌లో 25 మంది, పశుసంవర్థకశాఖలో 13 మంది, పంచాయతీరాజ్‌శాఖలో 8 మంది, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఆరుగురు, ఇతర ఉద్యోగులు 60 మందికిపైగా ఉంటారు. కువైట్‌, అమెరికా, ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ రంగంలో 25 మందికిపైగా పనిచేస్తున్నారు. 20 కుటుంబాలకు చెందిన భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వైద్యులు, ఇంజినీర్లు అనేకమంది ఉద్యోగ విరమణ చేసినవారు ఉన్నారు. గ్రామంలో వందకుపైగా విద్యార్థిని, విద్యార్థులు బీటెక్‌, ఎంఎస్సీ, గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

అభివృద్ధిలో భాగస్వామ్యం
పల్లె అభివృద్ధిలో గ్రామస్తులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. యువత, మహిళలు, ఉద్యోగులతోపాటు ఉద్యోగ విరమణ చేసినవారు సైతం గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. షాదీఖానా భవన నిర్మాణం, పంచాయతీ కార్యాలయం, రహదారులు పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ఖాజీపురం గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. ప్రతి ఇంట్లో విద్యావంతులు ఉన్నారు. ఆ పల్లెలో నిరక్షరాస్యతను పారదోలి అక్షర పరిమళాలను వెదజల్లారు.

ఆది నుంచి చైతన్యం ఎక్కువే
గ్రామంలో మొదటి నుంచి చైతన్యం ఎక్కువే. నైజాం, రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఆ గ్రామస్తులు పాల్గొన్నారు. ఆదాయం తక్కువే అయినా తమ పిల్లలను వివిధ ప్రాంతాలకు పంపించి విద్యాబుద్ధులు నేర్పించారు. వారు చదువుకొని గ్రామంలో ఇతరులను కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. అక్కడివారికి సామాజిక స్పృహ ఎక్కువ ఉండడం.. ఆసక్తితో చదువుకొని పలు రంగాల్లో ఉద్యోగాలు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మా ఇంట్లో ఇద్దరూ ఉద్యోగులే
ఖాజీపురం గ్రామంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా. మా గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్‌ ఉన్నారు. నేను 1 నుంచి 5వ తరగతి వరకు మా గ్రామంలోనే చదువుకున్నా. 5 కి.మీ. నడుచుకుంటూ మధిర వెళ్లి 10వ తరగతి వరకు పూర్తి చేశాను. ఇంటర్‌, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్నాను. బీఈడీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ముస్లిం మైనార్టీ కళాశాలలో పూర్తి చేశాను. మా నాన్న చనిపోవడంతో అమ్మ కూలి పనులు చేసుకుంటూ చదివించింది. 1992లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాను. ప్రస్తుతం మాటూరుపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. నా భార్య కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలే. ఆమె ఇదే గ్రామంలోనే చదువుకున్నది.

  • షేక్‌ ఇబ్రహీం, ప్రధానోపాధ్యాయుడు

అన్ని ప్రభుత్వ శాఖల్లో మా గ్రామస్తులు

ఖాజీపురంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉన్నారు. నేను ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌గా పనిచేసి ఉద్యోగ విమరణ పొందాను. అమ్మానాన్న ప్రోత్సాహంతో కష్టపడి చదివి అటవీశాఖలో గార్డుగా విధుల్లో చేరాను. డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌గా ఎదిగాను. 2006లో ఉద్యోగ విరమణ పొందాను. ఖాజీపురంలోనే ఇల్లు కట్టుకొని విశ్రాంతి తీసుకుంటున్నాను. మా తమ్ముడు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగవిరమణ పొందారు. పెన్షన్‌లో కొంత గ్రామాభివృద్ధి, షాదీఖానా నిర్మాణానికి నా వంతు సహకారం అందించాను.
– షేక్‌ అల్లాభక్షు, రిటైర్డు డిప్యూటీ ఫారెస్టు ఆఫీసర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana