e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News కుదుపు...“చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే చిత్తము చెడురా ఒరే ఒరే!

కుదుపు…“చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే చిత్తము చెడురా ఒరే ఒరే!

“చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే చిత్తము చెడురా ఒరే ఒరే!
చిత్తము నందున చిన్మయ రూపుని జూచుచునుండుట సరే సరే!!
ఒక్కపొద్దులని ఎండుతు ఉంటే ఒనరు చెడుదువురా ఒరే ఒరే!
ఏకమైన యావైభవమూర్తిని జూచుచునుండుట సరే సరే!!”
ఖంగుమంది కంఠం. మెలకువొచ్చింది. కోడికూతకు బదులు, తత్వగీతి వినడం అలవడింది. ఎనిమిది పదులు దాటిన మనిషి. ఆరడుగుల మానవుడు. ఆ స్వరానికి చుట్టుపక్కల కుటుంబాలన్నీ లేవక తప్పదు. రుతుమార్పు వల్ల ఉదయవేళల్లో మార్పు కనపడుతది. అతని పాట మాత్రం వేళ తప్పని అలారం. చిన్నప్పటి నుండి అతని స్వరం వింటూ పెరిగినవాణ్ని. సర్వకాల సర్వావస్థల్లో ఆ స్వరం నన్ను జాగృత పరిచింది. అతని పట్ల మమకారం.. నాతోపాటే పెరిగింది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. అతనితో మాట్లాడాలని అనిపించేది. అతడు పనిమంతుడు. ఏదైనా నేర్చుకోవా లని అనిపించేది.

అతని మాటల్లో, చేతల్లో, పనుల్లో తెలియని ఏదో హుందాతనం కనిపించేది. అదేమిటో తెలుసుకోవాలని అనిపించేది. ఎవర్నీ నొప్పించేవాడు కాదు. అందర్నీ గౌరవించేవాడు. నా వయసు వారు అతని పాటల్ని, పద్యాల్ని తప్ప మాటలు విన్న జాడలు లేవు. వయసులో ఉన్నప్పుడు అందరితో కలివిడిగా ఉండేవాడని చెబుతారు. ఇప్పటికీ తన ఈడు వాళ్లతో మాట్లాడతాడు. అలాంటి వాళ్లలో మా బాపు ఒకడు.
వయసుడిగిన స్థితిలో దారిన పోయే వారిని పిలిచి హితబోధ చేస్తుంటాడు బాపు. ప్రస్తుతం తను చేసేదేమీ లేనట్లు, చేయాల్సిందంతా చేసినట్లు, కూర్చుని తినడమే పని అయినట్లు బాపు వ్యవహారం ఉంటది. అనుభవాలతో తల పండినట్లు, నెరిసిన తన తలను చూపి నమ్మిస్తుంటడు. రాత – గీత, బొట్టు – బోనం, మంచి – చెడు, పూజ – గీజ లాంటి వాటి గురించి సుదీర్ఘంగా ప్రవచిస్తుంటడు. అంత చెప్పినా బాపులో ఆకర్షణ కనిపించదు. అతడు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంటడు. అదే అతని వైపు నన్ను నడిపించింది. ఒకరోజు ఉండబట్టలేక..

- Advertisement -

“బాపూ! కనకాచారి ఇంటికెళ్దాం”.
“ఆ ఔసుల భక్తుడి దగ్గరికా.. ఎందుకో?”.
“పొద్దున అతని పద్యం విన్నప్పటి నుండి
కలవాలనిపిస్తుంది”.
“చిన్నప్పటి నుండి వింటనే ఉన్నవు కదా! ఇప్పుడు కొత్తగ ఏం కనిపించింది?”.
“చిన్నప్పటినుండి అతడంటే ఇష్టం. ఇప్పుడతనితో మాట్లాడాలని ఉంది”.
“నువ్వు అడిగేదేంది? వాడు చెప్పేదేంది?”.
“అట్లా తీసేయకు బాపు.. అతని గొంతునుండి ప్రాచీన ధార జాలువారుతుంది”.
“జారడమా.. బోర్లబొక్కల పడటమా! వాణ్ని భరించలేక మొదటి పెళ్లాం వెళ్లిపోయింది”.
“నాకు తెలిసినప్పటి నుండి ఒకామెతోనే ఉన్నడు కదా!”.
“నీకేం తెలుసు.. మొన్నటి పొలగానివి. వీని పిస్స భరించలేక పోయింది”.
“అది పిస్స కాదు బాపు.. సనాతన తాత్విక స్పృహ. అది పాటగా, పద్యంగా ఆ గొంతు నుండి జాలువారుతంది. అతని పనితనం, కళగా మారి కనువిందు చేస్తంది”.
“ఏందిరో.. వాని తరపున వకాల్తా పట్టినట్లున్నవు. ఇగ నువ్వు కొత్తగా అడిగేదేమున్నది? వాడు చెప్పేదేమున్నది?”.
“చదివి పొందిన జ్ఞానంకన్నా, అనుభవజ్ఞానం గొప్పది. అది ఆయన దగ్గరుంది”.
“ఇప్పుడు వాని దగ్గర పని నేర్చుకొని, గొప్పోనివవుతవా?”.
“బాపూ! మీరు చెప్పే వాళ్లేకాని, చేసేవాళ్లు కాదు. నా మాటలు మీకు అర్థం కావు”.
“చెప్పి చేయించుకోవడమే గొప్పరా! సదువెక్కువై నువ్వు చెడిపోయినవ్‌”.
“ఏ పనీ చేయకుండానే ఎట్లా చెడిపోయిన! ఆ మాట నువ్వు ఎట్లంటవ్‌”.
“నీ కర్మ అట్లనే ఉంది. అది నాకు తెలుసు”.

ఇక వాదించడం ఇష్టంలేక ఇంటి నుండి బయటపడ్డ. కొద్దోగొప్పో అన్ని ఊర్లు మారినయ్‌. మా ఊరు మాత్రం మారలేదు. అవే మొండి గోడలు. వాటినుండి నడిచి మేరోల్ల వాడకు చేరిన. అక్కడి నుండి కొద్ది దూరంలోనే వడ్లకమ్మరోల్ల ఇండ్లు. అవి దాటగానే కనకాచారి ఇల్లు. కావాలని, ఊరు చూడాలని, సమయం గడవాలని చుట్టూ తిరిగి ఆ ఇంటికి చేరిన. నిజానికైతే మా ఇంటి నుండి ఆ ఇల్లు చాలా దగ్గర. అందుకే అతని పద్యాలు, పాటలు చెవుల్లో గింగురుమంటయ్‌. మనసులో ముద్రపడతయ్‌. ఇంటిలో పెద్ద మార్పేం లేదు. పాత ఇంటికి సున్నం వేయించినట్లుంది. ఇంటి కిటికీలకు ఒకతను బ్రష్‌తో రంగులు వేస్తున్నడు. ముగ్గు బుట్టలాంటి తల వెండికొండను తలపిస్తున్నది. పరిణతి చెందిన చేయి చకచకా పని చేస్తున్నది.
‘ఎవరీ పెద్దాయన.. యువకుడిలా పని చేస్తున్నడు. మంచి పనిమంతుడిలా కనిపిస్తున్నడు’ అనుకుంటూ, ఇంట్లోకి తొంగి చూసిన.
ఎవరూ కనిపించలేదు.
‘రాకూడని సమయంలో వచ్చిననా?’ అనే అనుమానం పీడించింది. గొంతు సవరించుకొని..
“ఎవరూ లేరా ఇంట్లో?” అని పిలిచిన.
“ఎవరు కావాలి మీకు?”.. ఇంట్లో నుండి వినిపించింది.
“తాతను కలవాలె”.
“కాల్రెక్కలు కడుక్కొని, లోపలికి రా”..
లోపలికి వెళ్లిన. కట్టెకుర్చీలో కూర్చుని ఉన్నడు. చేనేత బట్టతో కుట్టిన తెల్లటి బనీను వేసుకున్నడు. మల్లెపువ్వు లాంటి ధోతి కట్టుకున్నడు. తెల్లని శరీరఛాయతో ఆ బట్టలు పెనవేసుకున్నయ్‌. ముఖంలోని ప్రశాంతత, శరీరాకృతి అతని పట్ల గౌరవాన్ని పెంచుతున్నయ్‌.

“ఎవల కొడుకువు?”.. కంఠం ఖంగుమంది.
“పంతులు కొడుకును”.
“నువ్వానోయ్‌! దగ్గరికి రా, కూచో”.. అంటూ మంచం చూపెట్టిండు.
“ఆరోగ్యం బాగుందా?”.. సంభాషణ ఎట్లా మొదలు పెట్టాలో తెలియక అడిగిన.
“కాడు రమ్మంటంది. ఊరు పొమ్మంటంది”
“అట్ల ఎందుకంటరు? మీరు నాలుగు కాలాలు బతకాలి. అప్పుడే నాలుగో తరం పిల్లలు పద్యాలు, పాటలు నేర్చుకుంటరు”.
“పాటల మీద, పద్యాల మీద మీ నాయనకు లేని ఆసక్తి నీకు ఏన్నుంచి వచ్చిందయ్యా?”.
“నాకైతే మీ పాట, పద్యం నుండే వచ్చింది”.
“విన్నోల్లందరు నీ తీరుగ మనసు వడుతలేరు”.
“అత్తిపత్తిలాగా అన్ని ఆకులూ ముడుచుకోవు”.
“నీకు తెలియకుండానే విచ్చుకుంటున్నవ్‌”.
“నేను చెడిపోతున్ననని బాపు అంటున్నడు”.
“పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు
హృదయ సంపుటములు చదవవలయు..

అర్థమైందా? మీ బాపు అన్నడనో, నేను చెప్పిన అనో నమ్మకు. పోతులూరి వీరబ్రహ్మం గారిని చదువు. అర్థం చేసుకో. ఆలోచించు. ఆచరించు. ఇక నీకు వేదన ఉండదు”.
“బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిండట కదా! అందులో ఏమున్నయ్‌”.
“అందులో లేనివి లేవు. ఇవ్వాళ అందర్నీ జడిపిస్తున్న కరోనా గురించి కూడా రాసిండు. ప్రళయకాలం వస్తుందనీ, ఆ కాలాన తాను వీరభోగ వసంతరాయలుగా అవతరించి, ధర్మాన్ని నిలబెడతాననీ, పూర్వకాలపు ప్రశాంతతను స్థాపిస్తాననీ చెప్పిండు”.
“గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్‌.. అన్నట్లు, వసంతరాయలు ఆ కాలాన్ని వెనుకకు రప్పిస్తాడా?”.
“నీకు చెప్పడం కష్టం. నారాయణా.. నారాయణా!” అంటూ నాలుగుసార్లు పిలిచిండు.
“మామను పిలుస్తున్నరా? ఎక్కడున్నడు నేను పిలుచుకొస్త”.
అని చెప్పి, బయటకొచ్చి చూసిన. కిటికీలకు రంగులు వేసేది అతనే. ఏమాత్రం పోల్చుకోలేక పోయిన. మనిషి ఎంత మారిండు!
“నమస్తే మామ. తాత పిలుస్తున్నడు”.
“ఎప్పుడచ్చినవ్‌. మంచిగ చదువుతున్నవా.. మావోని తీర్ల తిరుగుతున్నవా?”.
“మీ వోనికేంది పట్నంల మంచిగ పని చేసుకొని బతుకుతున్నడు”.
“మీద మెరుగులు, లోపల పురుగులు అన్నట్లుంది వాని బతుకు”.
“సిల్వర్‌ ఫిలిగ్రీ బాగనే చేస్తున్నడు. ఈయన చేసిన వస్తువులు దుబాయ్‌ దాంక పోతున్నయ్‌”.
“పని దొరికితె మంచిగనే ఉంటది. కానీ, గిరాకులు లేకుంటయినయ్‌. ధనవంతులే కొనగలిగిన వస్తువులవి. చాలా ఖరీదు చేస్తయ్‌. నవాబ్‌ ఖాన్‌దాన్‌ ముచ్చట లెక్క ఉంటది ఆ పని. ఆ గిరాకీ కూడా! మా దగ్గర వస్తువు తయారు చేయించి, మార్కెట్లో అంతకు రెట్టింపు ధరకు దుకాణదారు అమ్ముతడు. సిల్వర్‌ ఫిలిగ్రీ వస్తువులకు ధర ఎక్కువ. కళాత్మకంగా, ఆకట్టుకునేలా, వాతావరణాన్ని హుందాగా తీర్చిదిద్దేవిగా అవి ఉంటయ్‌. అదొక షాన్‌. కంసాలి జీవితం మాత్రం పరేషాన్‌”.
“ఇవాల్నో, రేపో జీవునం పోతది అన్నట్లు మాట్లాడతవేంది మామ”.
“బంగారం పనోళ్ల బతుకులే అట్లున్నయ్‌. ఒకప్పుడు సొంత నగలు ఉంటెనే పెట్టుకునేటోళ్లు. ఆ తరువాత ఒకరి నగలు ఒకరు అరువు తెచ్చుకుని పెండ్లిల్లు, పేరంటాలు ఎల్లదీసిండ్రు. ఇప్పుడేమో రోల్డ్‌ గోల్డ్‌ నగలు వచ్చినయ్‌. తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నయ్‌. కొత్త కొత్త డిజైన్లతోటి వస్తున్నయ్‌. వాటికి అందరూ ఎగబడ్డరు. అసలు కంటే నకిలీయే ముద్దు అన్నట్లుంది. మా బతుకు బస్టాండయింది. ఈ ఊర్లె రోల్డ్‌ గోల్డ్‌ నడవదు కనుక ఇట్లా తెల్లగ బతుకుతున్నం”.
“ఈ మధ్య దొంగ బంగారం కేసుల్ల కూడా మీ వోళ్లు కనబడుతున్నరు”.
“పట్నంల జరిగే దొంగ బంగారం కేసుల గురించి, వాటిల్ల చిక్కుకున్న వాళ్ల గురించి పత్రికలు చెబుతయ్‌. అవి ఎంతవరకు నిజమో తెల్వది. పల్లెల్లో జరిగేవి మాత్రం విచిత్రంగా ఉంటయ్‌. అవి మాకు పరీక్ష పెడుతయ్‌. కొన్ని సందర్భాల్లో మేం లాభపడే అవకాశాలు కూడా వస్తాయ్‌. కానీ, దొంగ బంగారం జోలికే పోము. అది వృత్తి ధర్మానికి విరుద్ధం. ఈ ఆకలి రోజుల్లో నిజాయితీగా ఉండటం అనేది నిప్పును చేత పట్టడమే అన్నట్లుంది”.

అంతల్నే..
“ఇద్దరు ఇటే ఉన్నరు. అంతగనం ఏం ముచ్చట వెడుతున్నరు”.. అనుకుంట తాత బైటికొచ్చిండు.
“మన కులం నియ్యతి గురించి అల్లునికి చెబుతున్న బాపూ”.
“ఇలకు దిగెడు వేళ కులమెవ్వరికి లేదు
మొదలు శూద్రుడుగను పుట్టునందు
శ్రుతులు చదివి వెనుక శూద్రుండే విప్రుడౌ
కాళికాంబ! హంస! కాళికాంబ..
కులము నియ్యతి, మనిషి నియ్యతి అని వేరువేరు ఉండది. నియ్యతి తోటే బర్కతి. అట్లనే అందరికి సమానంగ హక్కులు, బాధ్యతలు ఉంటయ్‌. వాటిని పాటిస్తే అందరూ గొప్పోళ్లే అయితరు”.. అంటూ, నన్ను కూడా భోజనానికి పిలిచిండు.
“తాతా, నేను మా ఇంటికి పోత” అన్నా.
“తినే యాళ్లకు వచ్చినవ్‌. రాకరాక వచ్చినవ్‌. తినకుండా పోతవా. మా ఇంట్ల తింటె కులం చెడవు తీయ్‌!” అంటూ నారాయణ మామ ఒప్పించిండు.
అందరం కాళ్లు చేతులు కడుక్కుని ఈత చాపలపై కూర్చున్నం. ప్రతీ చాపముందు విస్తరి, మంచినీళ్ల గ్లాసు ఉంది. అమ్మ వేడి వేడి అన్నం వడ్డించింది. అది పొగలు కక్కుతున్నది. చింతకాయ పచ్చడి, నెయ్యి వేసింది. అన్నం తింటూ ఉండగానే దొప్పనిండా మేక మాంసం తెచ్చిపెట్టింది. గిన్నెనిండా చింతపులుసు చారు పోసి పెట్టింది. ఆహారం అమృతంలా ఉంది. పదేళ్ల అమ్మాయి వచ్చి గ్లాసులో నీళ్లు నింపి వెళ్లింది.
“ఎవరీ అమ్మాయి?” అని అడిగిన.
“నా మనవరాలు” అని చెప్పిండు తాత.
“జగదీశ్‌ బిడ్డనా?”.
“అవును. వాడు, నీ కంటే ఎన్నేండ్లు పెద్ద?”.
“దాదాపు పదేండ్లయినా తేడా ఉంటది”.
“చదువు అయిపోయిందా? ఏం చేస్తున్నవ్‌?”.
“ఏముంది. తినుడు, తిరుగుడే అయితంది”.
“మావోడూ గంతే, పేరుకే పట్నంల ఉన్నడు. జువెల్లరీస్‌ చేయవట్టి పనులు తక్కువైనయ్‌. పనులు దొరికినా కూలి తక్కువ పడుతంది. కూటికే సరిపోతలేదు. పిల్లనేం సాదుతడని నేనే తీసుకొచ్చిన. ఈ ఊర్లెనే సర్కార్‌ బడిల శెరీక్‌ చేసిన. అక్కడ కొడుకు, కోడలు ఉంటరు. బంగారం పని ఎంత మంచిగ చేసినా కస్టమర్లు మెచ్చరు. పైగా ఆ పని చేసేవాళ్లు చాలామంది ఉన్నరు. అందుకే సిల్వర్‌ ఫిలిగ్రీ పని నేర్చుకున్నడు. అదే చేస్తున్నడు”.
“అసలు సిల్వర్‌ ఫిలిగ్రీ అంటే ఏంది? ఆ పని చేయాలనే ఆలోచన ఎట్ల కలిగింది?”.
“అది చెప్పాలంటే చరిత్ర చెప్పాల్సుంటది”.
“చెప్పండి తాత”.

“పంచముఖ బ్రహ్మ ఐదు ముఖాల నుంచి ఐదుగురు కుమారులు బయటకు వచ్చిండ్రు. మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ అనేవి వారి పేర్లు. వారే విశ్వబ్రాహ్మణుల్లోని ఆయా వంశాలకు మూలకర్తలు. సానగ, సనాతన, అహభూనస, ప్రత్నస, సువర్ణస అనేవారు విశ్వబ్రాహ్మణుల గోత్ర పురుషులు. వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని పట్టుకున్నరు. మను సంతతి వాళ్లు కమ్మరం, మయ-వడ్రంగం, త్వష్ట-కంచరం, శిల్పి-శిల్పం, విశ్వజ్ఞ-స్వర్ణకార పనులను పట్టుకొని అందులో నైపుణ్యాన్ని సాధించిండ్రు. ఈ ఐదు కులాల్ని కలిపి విశ్వబ్రాహ్మణులు అంటరు. మాలోనే అయ్యగార్లు ఉంటరు. పెండ్లిళ్లు, పురుళ్లు, చావులకు వాళ్లే వచ్చి పూజలు చేయిస్తరు. మేం విశ్వకర్మను పూజిస్తం. మా కులదేవత బ్రహ్మంగారు. మా కులానికి కట్టుబాట్లు ఎక్కువ. విశ్వబ్రాహ్మణులు పట్టణాలు, దుర్గాలు, యుద్ధ పరికరాలు, సింహాసనాలతోపాటు అనేక ఆభరణాలు తయారు చేసిండ్రు. బంగారు, వెండి పని చేసే మేం స్వర్ణకారులం. మాది చేతిపని. సృష్టికి ప్రతి సృష్టి చేస్తం. ప్రకృతిలోని ప్రతి అందాన్నీ అందమైన ఆభరణంగా మలుస్తం. పక్షిగూటిలో చిక్కని అల్లిక ఉంది. ‘వెండి తీగతో అలాంటి అల్లిక చేయలేమా’ అనే ఆలోచన వచ్చింది. పిట్టగూడును చూసే సిల్వర్‌ ఫిలిగ్రీ పని పురుడు వోసుకుంది. సున్నితం, కష్టం అయిన ఈ పని చేయడానికి అందరూ ముందుకు రారు. నా మనవడు సిల్వర్‌ ఫిలిగ్రీ కళాకారుడు కావడం నాకు గర్వంగా ఉంది”.. అంటూ దమ్ము తీసుకున్నడు తాత.

“మరి జగదీశ్‌ సంపాదన మంచిగున్నదా?”.
“మాది చేసుక బతికే కులం. చేతినిండా పని ఉంటే కడుపునిండా తిండి ఉంటది. ప్రతీది కొనుక్కు తినుడే. ఏ రోజుకారోజు కమ్మగా కడుపునిండా తినడం అలవాటయింది. ఊర్లో మా కుటుంబాలు ఒకటి, రెండు కంటే ఎక్కువ ఉండవు కనుక మాకు సరిపోయే పని దొరికేది. వెనకటి నుండి మా వాళ్లు సుఖంగా తిని, పిల్లల్ని పెంచిండ్రు. మద్యమాంసాలు మాకు అట్లనే అలవాటైనయ్‌. రేపటి గురించి వాళ్లు ఆలోచించలేదు. ఇప్పటోళ్లు ఆలోచిస్తున్నరు. దానికి తగ్గట్టు పని తక్కువయింది. అందుకే ఒత్తిళ్లకు గురై అప్పులపాలు అవుతున్నరు. జగదీశ్‌ పరిస్థితి కూడా అట్లనే ఉంది”.. అంటూ నిట్టూర్చిండు నారాయణ మామ.

భోజనాలు పూర్తయినంక అందరి దగ్గర సెలవు తీసుకుని బయల్దేరిన.
“రేపో, ఎల్లుండో మా జగదీశ్‌ వస్తడు. వచ్చి కలువు”.. అన్నడు మామ.
జగదీశ్‌.. తాతకు తగ్గ మనవడు. ‘మా ఊర్లో మొదటి పోస్ట్‌గ్రాడ్యుయేట్‌’ అని అందరూ ప్రశంసిస్తుండే. అతడిపై అభిమానం పెరిగింది. ఆయనను మించి చదవాలని కోరిక కలిగింది. అట్లా మా ఇద్దరి మధ్య స్నేహాన్ని మించిన బంధం ఏర్పడింది. పై చదువులకోసం నేను, ఉద్యోగం కోసం అతడు ఊరు విడిచినం. చదువులు పూర్తయి నేను, నిరుద్యోగిగా అతను ఖాళీగా ఉన్నం. పెండ్లయ్యాక వట్టిగ ఉంటే కుదరదు కనుక కులకశ్పి చేయడం మొదలుపెట్టిండు. నేనేమో ఊరికే ఉండటం ఇష్టంలేక ఊరికి వచ్చిపడిన. కరోనా దెబ్బకు అతను కూడా ఊరికి రావడం యాదృచ్ఛికం. ఇట్లయినా కలవచ్చు అనే ఆశ కలిగింది. చదువుల్లో ఎంతో ముందున్న అతనికి ఉద్యోగం దొరక్క పోవడం ఆశ్చర్యమనిపించింది. చదువులకు, ఉద్యోగాలకు మధ్య ఉన్న లంకె తెగిందనడానికి ఆయనొక ఉదాహరణ. తినబోతూ రుచి చూడడమెందుకు? అన్ని విషయాలు ఆయన్నే అడుగుదామని అనిపించింది. ఆ ఆలోచనతో మెదడు మీది బరువు దిగింది.

జగదీశ్‌ వచ్చిండని తెలిసింది. రెండు రోజుల్దాక వెళ్లడం కుదరలేదు. పల్లెటూరు కనుక కరోనా ప్రభావం తక్కువే ఉంది. పట్నం నుంచి వచ్చిన కనక పది రోజులాగి కలవాలనుకున్న. వాళ్ల ఇంట్లో రంగులపని జరుగుతున్నది. అతడు కూడా ఇటువైపు రాలేదు. అతనొచ్చి రెండు వారాలయింది. వెళ్లాలనుకుంటుండగా, తనే వచ్చిండు.
“ఏం సంగతి బామ్మర్దీ.. వచ్చి కలుసుడు లేదా?”.. వస్తూనే అరిచిండు.
“నేనే వద్దామనుకుంటున్న. నువ్వే వచ్చినవ్‌”.
“అట్లా బైటికి పోయద్దం పద”.
“సరే పద!”.

ఇద్దరం కలిసి ఊరి బయట కుంట దిక్కు పోయినం. కుంట చివర కట్ట మైసమ్మ గుడి పక్కన కూర్చున్నం. సాయంత్రమైంది. పశువులు ఊళ్లోకి పోతుంటే, మేము ఊరు బయటకు వచ్చినం. చేన్లలో పనిచేసి, పాటలు పాడుకుంటూ కూలిజనం ఊళ్లెకు పోతున్నరు. ఏ పనీలేక, మనసున పట్టక మేం ఊరి బయట కూర్చున్నం. ఎక్కడెక్కడో తిరిగిన పక్షులు గూళ్లకు చేరుకుంటున్నయ్‌. ఏం మాట్లాడుకోవాలో దిక్కుతోచక మేం దిగాలుగున్నం. అలసిన సూర్యుడు అస్తమించిండు. మా భవిష్యత్తు ఆశలు అడుగంటినయ్‌. ఊళ్లె విద్యుత్‌ బల్బులు ఒక్కసారిగా వెలిగినయ్‌. చీకట్లను పాపడానికి సిగరెట్‌ వెలిగింది.
“బావా! సిల్వర్‌ ఫిలిగ్రీలో నీది అందెవేసిన చేయి. మరెందుకు డల్‌గా ఉన్నవ్‌?”..
“అది తీగల అల్లకంలా లేదు. ఉరితాడు పేనడంలా ఉంది. బంగారం పనిని కాదని ఈ పని సంతోషంగా చేసిన. ఒకప్పుడు ఈ పని చేయడానికి మనుషులు లేరు. ఇప్పుడా పనే లేదు. నిజాం జమానా మనుషులు, మార్వాడీలు, ఖాన్‌దాన్‌ మనుషులు వాడే వస్తువులు అవి. ఈరోజుల్లో వెండి పాన్‌దాన్‌లు, ఊందాన్‌లు ఎవరు వాడుతున్నరు. ఇంటిని వెండి వస్తువులతో అలంకరిస్తే కనబడే హుందాయే వేరు. నెమలి, చార్మినార్‌, తాజ్‌మహల్‌, బొమ్మలు, దేవతావిగ్రహాలు, వీణ, బొట్టు పెట్టె, పెన్‌ స్టాండ్‌, ఇట్లా రకరకాల వస్తువులు వెండితో చేయించుకునేవారు. ఇప్పుడలాంటి ఆసక్తి తగ్గింది. ‘యూజ్‌ అండ్‌ త్రో కల్చర్‌’ వల్ల గిల్ట్‌గిఫ్ట్‌ల అమ్మకం పెరిగింది. మా ఇండ్లల్ల వెండి గణపతి, దుర్గలు ఉండేవి. ఇప్పుడవి కరువైనయ్‌. దొంగకు చీకటి తోడైనట్లు, పని లేకపోవడానికి ఈ కరోనా జత చేరింది” అంటూ సిగరెట్‌ దమ్ము లాగిండు.

“ఈ అలవాటు ఎప్పుడైంది?”.
“ఇదే కాదు, చాలా అలవాటైనయ్‌. తినడం, తాగడం, అప్పులు చేయడం అనివార్యంగా వచ్చి చేరినయ్‌”.
“అదేంది బావా.. అలవాటు చేసుకుంటేనే అవి అలవాటైతయ్‌ కదా!”.
“పని చేస్తే తెలుస్తది నీకు. అలవాట్లు ఎందుకైతయో! ఒక విగ్రహం చేయాలంటే ఎంత తతంగం ఉంటదో నీకు తెలుసా? వెండి ముద్ద తీసుకొని కరిగించాలె. అప్పుడు కమ్మి వస్తది. కమ్మిని మిషిన్లో వేసి సన్నపు తీగ తీయా లె. మెరుపు తీగ, కౌర్‌ తీగ, వడి తీగ, బేల్‌ తీగ, గాట్లు.. ఇలా రకరకాల తీగలు ఉంటయ్‌. మనకు కావాల్సిన ఫ్రేమ్‌ తయారు చేసుకోవాలె. బెల్‌ తీగ తోటి డిజైన్‌ వేసుకోవాలె. ఆ డిజైన్‌లో వెండి ఫిల్‌ చేయ్యాలె. తరువాత వెండిరవ్వ తోటి అతకాలె. బర్నర్‌ తోటి హీట్‌ చెయ్యాలె. చివరగా ఆకురాయి తోటి రాకుతె ఫినిషింగ్‌ వస్తది. సున్నితమైన పని కనుక తొందరగా కాదు. ఒక వస్తువు చేయడానికి కనీసం నాలుగు రోజులు పడతది. ఒక వస్తువు చేస్తే కూలి కింద నాలుగు వేలు పడుతది. కండ్లకు ఎక్కువ శ్రమ కలుగుతది. సుత్తె, శానం తోటి కనుగుడ్లు పెకిలించాలనిపిస్తది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నొప్పి లేస్తది. అప్పుడు నడుమును పట్టెడకేసి అదిమితే హాయిగుంటది. బాధ మరవడానికి సిగరెట్‌ తాగక తప్పది. మద్యం, మాంసం ఇంటి నుండే అలవాటైంది. అలవాట్లు ఎక్కువై.. పని తక్కువ అవడం వల్ల అప్పులు
పెరిగినయ్‌”.. అంటూ నెత్తి కొట్టుకున్నడు.
“రాత్రయింది బావా. ఇంటికి పోదాం పద”.
“ఏం చేత్తవ్‌ ఇంటికి పోయి. పెండ్లాంపిల్లలున్న నాకే తొందర లేదు. నీకెందుకు తొందర. ఇంకెప్పుడు పెండ్లి చేసుకుంటవ్‌. ముసలోనివి అయినంక చేసుకుంటవా?”.
“నాకే తిండికి దిక్కులేదు. వచ్చిన దానికి ఏం పెట్టాలె?”.
“అట్లనుకుంటారోయ్‌.. ఏ వయసుకా సంబురం జరగాలె”.
“చిన్న ఉద్యోగమైనా దొరుకుతుందనే ఆశ లేదు. నీకు మాత్రం దొరికిందా! కులకశ్పి ఒకటి ఉన్నది కనుక నెట్టుకొస్తున్నవ్‌. నా సంగతే బాయిలవడ్డ పిల్లోలె ఉన్నది”.
“కులవృత్తికి సాటిలేదు గువ్వలచెన్నా. అది పాడుకోవడానికే బాగుంటది. వస్తువు తయారుచేసిన నా కంటే, వాటిని అమ్ముకునే, ఎగుమతులు చేసుకునే మధ్య దళారులకే ఎక్కువ గిట్టుబాటు అయితది. ఆ పని చేయాలంటే పెట్టుబడి ఉండాలె. అది లేదు కాబట్టె ఇంత తిప్పల. ఈ పని చేసేవాళ్లు ఇప్పుడు తగ్గిండ్రు. ఎవరు కూడా తమ పిల్లలకు కులకశ్పి నేర్పుతలేరు. సన్నపు పనిచేయడం అంటే భయపడతరు. ఇగ ఏం నేర్చుకుంటరు. నేర్పెటోళ్లు లేరు, నేర్చుకునేటోళ్లు లేరు. నాల్రోజులైతే పని మాయమైతది. పనోళ్లు మాయమవుతరు. అంతెందుకు.. నేనే ఈ పని విడిచిపెడదామని అనుకుంటున్నా. నేనేదైనా ప్రైవేటు కాలేజీలో, మా ఆవిడ ఏదైనా దుకాణంలో పని చూసుకుందామని అనుకుంటున్నం. అట్లయితెనే బతుకుతం”.
“రాత్రయింది బావా. ఇంటికి పోదాం పద”.
“సరే పోదాం. అయ్యగారి గుర్రానికి ఆకలెక్కువట”.. అంటూ లేచిండు.
ఇద్దరం ఊర్లోకి రాగానే ఎవరింటి దారి వాళ్లు పట్టినం.
ఆ రాత్రి కలత నిద్రగా మారింది. విశాలం, సుందరం అయిన దారొకటి నా ముందు పరుచుకొని ఉంది. దానిపై నడక అనివార్యమని అర్థమవుతోంది. దారిపై జగదీశ్‌ నడుస్తున్నడు. రోల్‌మాడల్‌ అనుకున్న జగదీశ్‌.. రోల్డ్‌గోల్డ్‌గా కనిపిస్తున్నడు. పెద్ద చదువులు చదివిన నిరుద్యోగిగా సోయి తప్పి నడుస్తున్నడు. కులకశ్పి నిపుణుడు కూలిబాట పట్టిండు. ప్రమాదకరమైన దారిపై నడవడమే శరణ్యమైంది. నాలుగడుగులు వేశానో లేదో ఎరుక తప్పింది. అంతా కొత్తగా, అగమ్యంగా తోస్తున్నది. దిశ – దశ తెలియని రహదారి నడక సాగుతున్నది. నాకు నేను పరాయిగా మారి పరిగెత్తుతున్న. నా లాంటి అనేక నేనులు పరిసరంగా మారడం రూపుకట్టింది..
దబ్బున తెలివైంది.

బంగారం పనోళ్ల బతుకులే అట్లున్నయ్‌. ఒకప్పుడు సొంత నగలు ఉంటెనే పెట్టుకునేటోళ్లు. ఆ తరువాత ఒకరి నగలు ఒకరు అరువు తెచ్చుకుని పెండ్లిల్లు, పేరంటాలు ఎల్లదీసిండ్రు. ఇప్పుడేమో రోల్డ్‌ గోల్డ్‌ నగలు వచ్చినయ్‌. తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నయ్‌. కొత్త కొత్త డిజైన్లతోటి వస్తున్నయ్‌. వాటికి అందరూ ఎగబడ్డరు.

ప్రకృతిలోని ప్రతి అందాన్నీ అందమైన ఆభరణంగా మలుస్తం. పక్షిగూటిలో చిక్కని అల్లిక ఉంది. ‘వెండి తీగతో అలాంటి అల్లిక చేయలేమా’ అనే ఆలోచన వచ్చింది. పిట్టగూడును చూసే సిల్వర్‌ ఫిలిగ్రీ పని పురుడు వోసుకుంది. సున్నితం, కష్టం అయిన ఈ పని చేయడానికి అందరూ ముందుకు రారు. నా మనవడు సిల్వర్‌ ఫిలిగ్రీ కళాకారుడు కావడం నాకు గర్వంగా ఉంది

డా.బి.వి.ఎన్‌. స్వామి
డా.బి.వి.ఎన్‌. స్వామి స్వస్థలం కరీంనగర్‌. ఎం.ఎ. ఎంఫిల్‌ చేశారు. ఉత్తర తెలంగాణ కథా సాహిత్యం – పరిశీలన (1970 నుండి 2000 వరకు) అంశంపై సిద్ధాంత వ్యాసం సమర్పించి డాక్టరేట్‌ పొందారు. ప్రస్తుతం కరీంనగర్‌లోని కార్ఖానాగడ్డ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్నారు. కథా విమర్శ, కథా పరిశోధన, కథా కార్య శాలను ప్రవృత్తిగా ఎంచుకొన్నారు. రెండు దశాబ్దాలుగా కథా రచనలో ఉన్నారు. ఇప్పటివరకూ వందకు పైగా కథలు రాశారు. రెండు కథా సంపుటాలు, మూడు విమర్శా సంపుటాలు, రెండు పరిశోధనా సంపుటాలను వెలువరించారు. నెల పొడుపు, జీవనం, చావు ప్యాకేజీ, మానవహారి, కుంఠనం, రూపాయి నవ్వింది కథలు బహుళ ప్రజాదరణ పొందాయి. సరికొత్త ప్రయోగంతో ‘కశప’ (కథా శతక పద్యం)ను కథా సాహిత్యంలో నిలిచిపోయేదిగా మలిచారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున జిల్లా స్థాయి ఉత్తమ రచయిత అవార్డు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్య పురస్కారం అందుకొన్నారు.

  • బి.వి.ఎన్‌.స్వామి
    9247817732
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement