e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News ఎల్లలు దాటిన అల్లికలు

ఎల్లలు దాటిన అల్లికలు

వారంతా సామాన్య గిరిజన మహిళలు. ఒకప్పుడు పొలం పనులొక్కటే జీవనాధారం. ఇప్పుడు అల్లికలతో జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. తమ చేతులు చేసే అద్భుతాలతో నుదుటి రాతలు మార్చుకుంటున్నారు.మారుమూల తండాలో మొదలైన  ప్రస్థానం ఎల్లలు దాటి అంతర్జాతీయ వేదికలపైనా ‘ఔరా!’ అనిపించుకున్నది. ఒక్కరిగా మొదలైన ప్రయాణం ఇప్పుడు వందలమందితో కొనసాగుతున్నది.చీరెలు, బ్లౌజులు, కుషన్‌ కవర్స్‌, హ్యాండ్‌ బ్యాగుల్‌, సెల్‌ఫోన్‌ పౌచ్‌లు, శాలువాలు..తమ అల్లికల కళ ప్రదర్శించడానికి కాదేదీ అనర్హం అంటున్నారు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మతండా గిరిజన మహిళలు. ఆ విజయగాథ ..

ఎల్లలు దాటిన అల్లికలు

అది 1990.. ఎల్లమ్మతండాలో అంగన్‌వాడీ కేంద్రం తనిఖీ కోసం భట్‌ అనే ఐసీడీఎస్‌ అధికారి వచ్చారు. అంగన్‌వాడీ సహాయ కురాలు కేతావత్‌ లక్ష్మీబాయి చేతుల్లో ఉన్న వస్త్రంపై ఆయన దృష్టి పడింది. ఆ అల్లికల తీరు చూసి ఆశ్చర్యపోయారు. ఆమెలోని కళకు పట్టం కట్టాలని భావించారు. విషయాన్ని క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా దృష్టికి తీసుకెళ్లారు. కొద్దిరోజుల్లోనే లక్ష్మీబాయికి కౌన్సిల్‌ నుంచి పిలుపొచ్చింది. అల్లికలపై ఆమెకు శిక్షణ ఇవ్వడమూ జరిగిపోయింది. వారిచ్చే డిజైన్లను కుదురుగా అల్లుతూ నిష్ణాతురాలైంది. నెలకు రూ.250 ఉపకార వేతనం అందుకుంటూ తన ప్రతిభకు పదునుపెట్టుకుంది. లక్ష్మీబాయి స్ఫూర్తితో అదే తండాకు చెందిన అంగూరీ, అనసూయ, జ్యోతి, సుజాతలు సైతం క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు.  వీరంతా, అల్లికనే ప్రధాన వృత్తిగా మలుచుకొని కొత్త జీవితం మొదలుపెట్టారు.

గిరిజన సొబగులు

ఈ గిరిజన మహిళలు 2010లో సాదాసీదా వస్ర్తాలకు గిరిజన సంప్రదాయ సొబగులు అద్దుతూ కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. గిరిజన దుస్తులతో పాటు హ్యాండ్‌బ్యాగ్‌లు, బ్లౌజ్‌లు, కుషన్‌ కవర్లు, చీరలపై అల్లికలు కుమ్మరించి వాటి రూపురేఖలే మార్చేశారు. తొలిసారిగా, వీటిని ముంబయి ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించింది లక్ష్మీబాయి. సందర్శకులు ఫిదా అయ్యారు. చీర అంచునున్న మల్లికల మాలికలను చూసి అద్భుతమన్నారు. హ్యాండ్‌బ్యాగ్‌పై కొలువుదీరిన సీతాకోకచిలుకల డిజైన్‌లకు ఆశ్చర్యపోయారు. చూసిందే తడవుగా కొనేశారు. ఆ కళకు జేజేలు పలుకుతూ కాసుల వర్షం కురిపించారు. ఎగ్జిబిషన్‌ ముగిసేనాటికి లక్ష్మీబాయి గల్లా పెట్టెలో యాభై వేల రూపాయలు జమయ్యాయి. ఆమె గుండెల్లో కోట్ల విలువజేసే ఆత్మస్థయిర్యం గూడు కట్టుకుంది. ఆ తర్వాత అంగూరీ, అనసూయ, జ్యోతి, సుజాతలూ ఆమెతో కలిసి నడిచారు.

కలిసి సాగుతూ..

‘కలిసి ఉంటే కలదు విజయం’ అని నిరూపిస్తున్నారు ఎల్లమ్మతండా అతివలు. ఈ గిరిజన మహిళల కళాత్మక చేవ్రాలుకు ఖండాంతర ఖ్యాతి లభించింది. అందరూ కలిసి గ్రామంలోని ఇతర మహిళలకు అల్లికల్లో మెలకువలు నేర్పారు. వారికీ ఉపాధి కల్పిస్తూ ప్రస్థానాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. తమ వ్యాపారంతో దాదాపు 250 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. చేసే పనిని బట్టి వారానికోసారి డబ్బులు చెల్లిస్తున్నారు. వీరి స్ఫూర్తితో ఎల్లమ్మతండా పరిసర గ్రామాల మహిళలు సైతం అల్లికలపై దృష్టి సారించారు. తండా సమీపంలోని బోడకొండ, కొర్రంగుట్ట తండా, గుత్తితండా, లోయపల్లి గ్రామాల మహిళలకూ ఈ ఐదుగురు అవసరమైన శిక్షణ అందించారు. పొద్దంతా పొలం పనులు చేసుకునే మహిళలు సాయంత్రాలు, తీరిక వేళల్లో అల్లికలు చేస్తూ కుటుంబానికి మరింత ఆసరాగా నిలుస్తున్నారు. నెలకు మూడువేల నుంచి నాలుగువేల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ గ్రామాల మహిళలు తమ పనిలో మరింత రాణించడానికి వీలుగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 75 కుట్టు యంత్రాలను అందజేశారు అధికారులు.

విదేశాల్లోనూ ఆదరణ

గిరిజన మహిళలు తమ పనితీరుతో అద్భుతాలు చేస్తున్నారు. రెండు నెలలకు ఒకసారి వివిధ ఎగ్జిబిషన్లలో తమ ఉత్పత్తులతో స్టాళ్లు నెలకొల్పి ఊహించని ఆదాయం పొందుతున్నారు. అంతేకాదు వీరు తయారు చేసిన వస్ర్తాలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, శాలువాలు దుబాయ్‌, యూకే, అమెరికా, ఇరాన్‌లాంటి దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో వివిధ రాష్ర్టాలు, దేశాల్లో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నామని చెబుతారు లక్ష్మీబాయి. ‘ప్రతి ఎగ్జిబిషన్‌లో ఖర్చులు పోను దాదాపు రెండు లక్షల ఆదాయం వస్తున్నది. అందరం సమంగా పంచుకుంటాం. మా ప్రతిభకు ఇంతటి గుర్తింపు వస్తుందని ఊహించలేదు. ప్రభుత్వ చొరవ, అధికారుల సహకారం, మా ఆడపడుచుల పట్టుదలతోనే ఇదంతా సాధ్యమైంద’ని చెప్పుకొచ్చింది లక్ష్మీబాయి. ‘డిజైన్లకు అవసరమయ్యే మెటీరియల్‌ హైదరాబాద్‌, దేవరకొండ నుంచి తీసుకొస్తున్నం. మంగళగిరి వస్ర్త్తాలతో హ్యాండ్‌ బ్యాగ్‌లు తయారు చేయించి విక్రయిస్తున్నాం. తద్వారా కూడా  లాభాలు పొందుతున్నాం. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మా బతుకులు బాగుపడ్డయ్‌’ అంటున్నది సభావత్‌ అనసూయ.

ఎల్లలు దాటిన అల్లికలు

కాలానుగుణంగా..

ఒకప్పుడు చీరలు, డ్రెస్‌ మెటీరియల్‌పై అల్లికలకే పరిమితమైన ఈ ఆడబిడ్డలు కాలానుగుణంగా కొత్త ఉత్పత్తులను తీర్చిదిద్దుతున్నారు. వీరి సెల్‌ఫోన్‌ పౌచ్‌లు, హ్యాండ్‌ పర్స్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ‘అవును. ఢిల్లీతో పాటు ఇతర రాష్ర్టాల్లో గిరాకీ బాగుంది. వీటి తయారీకి దాదాపు నూటయాభై రూపాయలైతయ్‌. మార్కెట్‌లో రూ.200 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నం’ అని చెప్పుకొచ్చింది సభావత్‌ సుజాత. రోజురోజుకు మార్కెట్లోకి  కొత్తకొత్త డిజైన్లు వస్తున్న దృష్ట్యా నిఫ్ట్‌ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందని గిరిజన మహిళలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాదు, తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఓ వేదికను కల్పించాలని కోరుతున్నారు.

లాభాలు సమానంగా..

అల్లికల్లోనే వెండి, రాగితోనూ హ్యాండ్‌మేడ్‌ ఆభరణాలు తయారుచేస్తున్నారు వీరు. తండాల్లో పలువురు మహిళలు నగల తయారీలో ఆరితేరారు. మార్కెట్‌లో వీటికి మంచి డిమాండ్‌ ఉంది. ఏటా ఎగ్జిబిషన్‌లో విక్రయించి  లాభాలను పొందుతున్నారు. ఆ మొత్తాన్ని సమానంగా పంచుకుంటున్నారు.

ప్రభుత్వ సహకారం

నీడిల్‌ వర్క్‌ ద్వారా మా తండాలోని మహిళలెందరికో ఉపాధి దొరికింది. వస్ర్తాలపై బొమ్మలు వేయడంలో ఎవరికి వారే సాటి. ఖాళీ సమయాల్లో పని చేస్తూనే నాలుగు వేల వరకు సంపాదిస్తున్నారు. తెలంగాణ వచ్చాక మా కష్టానికి చక్కటి ప్రోత్సాహం తోడైంది. దీంతో ప్రతి ఇంట్లో ఒకరిద్దరు ఈ కళనే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

కేతావత్‌ లక్ష్మీబాయి

యు.రాఘవేందర్‌,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎల్లలు దాటిన అల్లికలు

ట్రెండింగ్‌

Advertisement