e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News ఉద్వేగ వికాసంపై ప్రభావం చూపే హార్మోన్‌?

ఉద్వేగ వికాసంపై ప్రభావం చూపే హార్మోన్‌?

ఎఫ్‌) నైతిక వికాసం:
ఈ దశలో నైతిక విలువలు వృద్ధి చెంది నైతిక భావనలు క్రమంగా సాధారణీకరించబడతాయి.
తప్పు, ఒప్పులను సంఘటన/సందర్భం ఆధారంగా నిర్ణయిస్తారు.
ఆత్మ భావన ఏర్పడటంవల్ల పిల్లలు తప్పు చేసినప్పుడు సిగ్గు, తప్పు చేశామనే భావన ఏర్పడుతుంది.
ఈ దశ చివరికి ఇంటి దగ్గర, బడిలో చిన్న చిన్న నేరాలు, దొంగతనాలు మానుకుంటారు.
ఎఫ్‌) భాషా వికాసం: ఈ దశలో భాషాభివృద్ధికి ముఖ్యంగా 4 ఆధారాలు ఉంటాయి. అవి..
1) తల్లిదండ్రులు
2) రేడియో, టీవీ వంటి ప్రసార సాధనాలు
3) చదవడం 4) పాఠశాల
అవసరానికి తగినట్టుగా మాట్లాడటం అలవాటు చేసుకుంటారు.
సొంత గొప్పలు, బడాయిలు చెప్పుకోవడం, ఇతరులను వెక్కిరించడం, ఇతరులను విమర్శించడం వంటివి ఈ దశలో చేస్తారు.

5) యవ్వనారంభ దశ (ప్యూబర్టీ)
Puberty అనే ఆంగ్ల పదం Pubertas అనే లాటిన్‌ పదం నుంచి ఉద్భవించింది.
దీని అర్థం ఏజ్‌ ఆఫ్‌ మ్యాన్‌హుడ్‌ (పురుషత్వపు వయస్సు/మగాడు కావడం)
వ్యక్తి అలైంగిక నుంచి లైంగిక జీవిగా మారే దశ.
లైంగిక భాగాలు పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ.
ఇది శారీరక, మనోవైజ్ఞానిక మార్పులతో కూడినది.
రూల్‌ ప్రకారం లైంగిక వ్యవస్థలో పరిపక్వత సంబంధించి పునరుత్పత్తి సామర్థ్యం పొందుతారు.

యవ్వనారంభ దశ లక్షణాలు
ఉత్తర బాల్యదశలోని చివరి సంవత్సరాలు, కౌమార దశలో ప్రారంభ సంవత్సరాలను కలుపుకోవడం వల్ల ఈ దశను అతివ్యాప్త (ఓవర్‌ ల్యాపింగ్‌) దశ అంటారు.
ఈ దశ కాలం చిన్నదైనప్పటికీ తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు జరుగుతాయి.
ఈ దశలో 3 అంతస్థులు ఉంటాయి. అవి..
ఎ) పూర్వ యవ్వనారంభ దశ: గౌణ లైంగిక లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది.
పునరుత్పాదక వ్యవస్థ పూర్తిగా పరిపక్వత చెందదు.
బి) యవ్వనారంభ దశ: లైంగిక పరిపక్వత వల్ల ఆడపిల్లల్లో రుతుస్రావం, మగపిల్లల్లో రాత్రివేళల్లో వీర్యస్కలనం ప్రారంభమవుతాయి.
గౌణ లైంగిక లక్షణాలు ఇంకా అభివృద్ధి చెందే దశలోనే ఉంటాయి.
సి) ఉత్తర యవ్వనారంభ దశ: లైంగిక భాగాలు పరిపక్వత చెంది, గౌణ లైంగిక లక్షణాలు బాగా అభివృద్ధి చెంది పనిచేయడం ప్రారంభిస్తాయి.
ఇది బాల్యదశను కౌమారదశతో కలిపే దశ.
వ్యక్తి జీవితంలో అతివేగవంతమైన పెరుగుదల, శిశువు జనన పూర్వ దశలో, యవ్వనారంభ దశలో జరుగుతుంది.
ఈ దశ అందరిలో ఒకే వయస్సులో ప్రారంభం కాదు. దీనిలో వైయక్తిక భేదాలుంటాయి.
పిల్లల పెరుగుదలలో భాగంగా అన్ని దశల్లో కంటే ఎక్కువ దుఃఖాన్ని అనుభవించే దశ.
ఈ దశలో నడక తీరు మారి, సిగ్గు, బిడియం వస్తాయి. ఈ దశలో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ దశలో నిద్రలేమి, రక్తహీనత మొదలైన లక్షణాలు కనిస్తాయి.

 1. కౌమార దశ (టీనేజ్‌)
  ఈ దశ కాలం 13/14-18 సంవత్సరాలు
  కౌమార దశను ఆంగ్లంలో అడోల్‌సెన్స్‌ అని అంటారు.
  అడోల్‌సెన్స్‌ అనే ఆంగ్ల పదం అడోల్‌సేర్‌ అనే లాటిన్‌ పదం నుంచి ఉద్భవించింది.
  లాటిన్‌ బాషలో అడోల్‌సేర్‌ అంటే ‘టు గ్రో ఇన్‌టు మెచ్యూరిటీ (పరిపక్వత చెందడం/పరిపక్వదశకు రావడం)’.
  ఈ దశలోని వారినే అడోల్‌సెంట్‌ అంటారు.
  ఈ దశను 1) టీనేజ్‌ దశ 2) సందిగ్ధ దశ 3) ఒత్తిడి, ఒడుకుల దశ 4) పునరుత్పత్తి దశ 5) యవ్వనావిర్భావ దశ 6) సమస్యలతో కూడిన దశ 7) కిశోర ప్రాయదశ 8) ఆత్మహత్యలు చేసుకునే దశ 9) జీవితంలో అత్యంత కీలకమైన దశ 10) గుర్తింపు కోరుకునే దశ 11) పగటి కలలు కనే దశ 12) భిన్న లింగ వర్గీయుల పట్ల ఆకర్షణ దశ అంటారు.

నిర్వచనాలు
కౌమార దశ ‘ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ’- స్టాన్లీ హాల్‌
వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సాంఘిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటూ అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశ- కోహ్లన్‌
యవ్వనం సంకుచిత భావన, కౌమారం సమగ్రమైన భావన
ఎ) శారీరక వికాసం
15 ఏండ్ల వయస్సులో వయోజన దశలోని ఎత్తులో 90 శాతం కలిగి ఉంటారు.
బాలికల్లో రుతుస్రావం, అండోత్పత్తి, బాలురలో ఇంద్రియ స్కలనం, శుక్ర కణోత్పత్తి ప్రారంభమవుతుంది.
బాలికల్లో గొంతు తియ్యగా, కీచుగా ఉంటుంది.
బాలురలో గొంతు బొంగురుగా, దృఢంగా ఉంటుంది.
గౌణ లైంగిక లక్షణాలు (ఛాతీమీద, చంకల కింద, జననేంద్రియాల వద్ద వెంట్రుకలు, మీసాలు, గడ్డం రావడం) అభివృద్ధి చెందుతాయి.

సమస్యలు
తమ శరీరంలో వచ్చే మార్పులను ఇతరులతో పోల్చుకుని వాటిలో హెచ్చుతగ్గులను చూసి ఆత్మన్యూనతకు లోనవుతారు.
బాలికల్లో రుతుస్రావం, బాలురలో వీర్యస్కలనం జరగడంవల్ల ఆందోళన చెందుతారు.
ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి రావడంవల్ల ఆందోళన చెందుతారు.

బి) మానసిక వికాసం
మానసిక వికాసం/ప్రజ్ఞా వికాసం పతాకస్థాయికి చేరుకుంటుంది.
విరోధ స్వభావాన్ని కలిగి ఉంటారు.
విశ్రాంత సమయాన్ని ఒంటరిగా గడుపుతారు.
పగటి కలలు కంటూ ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు.
లైంగిక విషయాలపై కుతూహలం చూపుతారు.
భిన్న లింగ వ్యక్తులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారు.
మానసిక వికాసం 18 సంవత్సరాల వరకు జరిగి ఆ తర్వాత ఆగిపోతుందని మనోవిజ్ఞాన శాస్త్రేవత్తల అభిప్రాయం.
వయస్సు పెరుగుతూ ఉంటే మానసిక వికాసం వేగం తగ్గుతూ వస్తుంది.
సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, అమూర్త వివేచనం, ఏకాగ్రత, గ్రహింపు వంటి మానసిక ప్రక్రియలు బాగా పెంపొందుతాయి.

సమస్యలు
వాస్తవాలను విస్మరించి పగటి కలలు కంటూ ఊహా లోకంలో విహరిస్తారు.
విద్యావ్యవస్థలో పోటీతత్వం వల్ల ఒత్తిడికి లోనవుతారు.
కో ఎడ్యుకేషన్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంకుచిత ధోరణుల వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతారు.

సి) ఉద్వేగ వికాసం
ఈ దశలో ఉద్వేగాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. అస్థిరతతో ఉంటారు.
ప్రేమ, కోపం, త్యాగం అనేవి విపరీతంగా ప్రదర్శిస్తారు.
ఎవరైనా విమర్శించినా, అపహాస్యం చేసినా తట్టుకోలేరు.
నాయక, నాయకిల ఆరాధన భావన/వ్యక్తి పూజ/హీరో వర్షిప్‌ కలిగి ఉంటారు.
వీరిలో చిత్తం (మూడ్‌) ఎక్కువగా మారిపోతూ ఉంటుంది.
అభిమాన తారలను, క్రీడాకారులను ఆరాధించి, అనుకరిస్తారు.
జీవితం పట్ల భయాన్ని కలిగి ఉంటారు.
ఈ దశలో వారు అటు చిన్నపిల్లలుగా, ఇటు వయోజనులుగా ఉండటంవల్ల ఒత్తడికి గురవుతారు. కాబట్టి ఇది సందిగ్ధ కాల దశ.
ఈ దశ చివరికి ఉద్వేగ పరిపక్వతను పొందుతారు.

సమస్యలు
ఈ దశలో ఉద్వేగాలు ఒకే రీతిలో ఉండక, తరుచూ పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి.
డి) సాంఘిక వికాసం
సాంఘిక వికాసం అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది.
సమాజంలో ఎక్కువ గుర్తింపును కోరుకుంటారు.
స్నేహబంధాన్ని విమర్శించే తల్లిదండ్రులను ఎదురిస్తారు.
ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వంటి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
తమను తాము తాదాత్మీకరణం (ఐడెంటిఫికేషన్‌) చేసుకుంటారు.
జీవిత విధానం (లైఫ్‌ ైస్టెల్‌) ఏర్పడే దశ.

సమస్యలు
సమాజంలోని సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, సాంఘిక నియమాలను విమర్శిస్తూ హద్దుమీరుతారు.
ఇ) నైతిక వికాసం
నైతిక వికాసం అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది.
తమ ప్రవర్తనను వారికి వారే నియంత్రించుకుంటారు.
తమ సొంత అంతరాత్మను ఏర్పర్చుకుంటారు.

సమస్యలు
5 సంవత్సరాల్లోపు పిల్లలు అబద్ధాలు ఆడటం తప్పు అని భావిస్తే కౌమార దశలోని పిల్లలు కొన్ని సందర్భాల్లో అబద్ధం అవసరం అనుకుంటారు.
పెద్దలు బోధించిన నీతి నియమాలను అతిక్రమిస్తారు.
ఎఫ్‌) భాషా వికాసం
భాషా నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి.
ఈ దశ పూర్తయ్యే సరికి 40,000 పైన పదాలను తెలుసుకుంటారు.
ఎదుటి వారి మాటల్లో, నిందాస్తుతుల్లో వ్యంగ్యాన్ని అర్థం చేసుకుంటారు.
కవితలు, వ్యాసాలు, కథలు రాస్తారు.

సమస్యలు
వీరు కూడా వ్యంగ్యంగా మాట్లాడుతారు.
7) వయోజన దశ (అడల్ట్‌హుడ్‌)
ఈ దశ కాలం 18-40 సంవత్సరాలు.
పగటి కలలు మాని వాస్తవికతకు ప్రాధాన్యం ఇచ్చే దశ.
ఆరోగ్య విషయమై వ్యాకులత చెందే దశ.
స్మృతి సామర్థ్యం తగ్గే దశ.
పరిపూర్ణ పరిపక్వ దశ.
శారీరక, మానసిక పెరుగుదల నిలిచిపోయే దశ.
అనుభవాలు విస్తృతపరచుకొనే దశ.
సామర్థ్యాలన్నింటిలో పరిపూర్ణత ఏర్పడే దశ.
జీవితంలో స్థిపరడే దశ.
ఉద్వేగపరంగా, జీవనపరంగా, మధ్యవయస్సులో అసంతృప్తికి, ఒత్తిడికి గురవుతారు. దీనినే ఎరిక్‌, క్లింగర్‌, వాయిడ్‌ అన్నారు.
మధ్య వయస్సులో వారు జీవిత చరమాంకం అయిన వృద్ధాప్యంలోనివారు ఏకాంతాన్ని అభిలషిస్తారు- నార్మంట్‌ విన్సెంట్‌ పీలే

కీ పాయింట్స్
ఉద్వేగ వికాసం
ఉద్వేగాన్ని ఆంగ్లంలో ఎమోషన్‌ అంటారు.
ఎమోషన్‌ అనే ఆంగ్ల పదం Emovere అనే లాటిన్‌ పదం నుంచి పుట్టింది.
లాటిన్‌ భాషలో Emovere అంటే శరీరం, మనస్సు కలియబెట్టిన స్థితి.
ఉద్వేగాలకు మూలం సహజాతాలు (Insti Zcts) అని చెప్పింది- మెక్‌డోగల్‌
ప్రతి వ్యక్తిలో పుట్టుకతో వచ్చిన సహజ ప్రతిస్పందనలే సహజాతాలు
సహజాతాలకు ఉదా: ఆకలి, దప్పిక, నిద్ర, లైంగికేచ్ఛ మొదలైనవి.
ఒక వ్యక్తి సంతృప్తి చెందడం/సంతృప్తి చెందకపోవడం అనే అంశాల ఆధారంగా ఉద్వేగాలు ఏర్పడుతాయి.
కింది విధంగా సహజాతాల ఆధారంగా ఉద్వేగాలు ఏర్పడుతాయి.

సహజాతం ఉద్వేగం
1) తప్పించుకోవడం (Escpe) భయం (Fear)
2) కలహించడం (Combat) కోపం (Anger)
3) వ్యతిరేకించడం/వికర్షణ (Repulsion) జుగుప్స (Disgust)
4) కుతూహలం (Curiosity) స్వయంవ్యతిరేక అనుభూతి/విస్మయం (Wonder)
5) మాతృ, పితృ ప్రవృత్తి (Parental temperment) ప్రేమ ((Love)
6) విన్నవించడం (Appeal) ఆర్తి (Distress)
7) నిర్మాణం (Construction) సృజనశీలత (Creativity)
8) నవ్వు (Laughter) ఉత్సాహం (Amusement)
9) లైంగికవాంఛ (Sexual Desire) కామం (Sex)
10) ఆర్జించడం (Acquisition) సొంతమన్న అనుభూతి
(Feeling Ownship)
11) ఆహార అన్వేషణ (Food Seaking) ఆకలి (Appetite)
12) సామూహిక తత్వం ఐక్యం

ఉద్వేగాలను అనుకూల ఉద్వేగాలుగాను, ప్రతికూల ఉద్వేగాలుగాను విభజించింది- బింగ్‌హాం
ఉద్వేగ వికాసంపై పరిశోధనలు చేసింది- బ్రిడ్జెస్‌
బ్రిడ్జెస్‌ ప్రకారం శిశువులో మొట్టమొదటిగా కనిపించే ఉద్వేగం- ఉత్తేజం (3 నెలలకు)
అభ్యసనం పరిపక్వతలపై ఉద్వేగ వికాసం ఏర్పడుతుంది.
ఉద్వేగ వికాసంపై ప్రభావం చూపే హార్మోన్‌- అడ్రినలిన్‌
ఉద్వేగాల తీవ్రత ఎక్కువగా ఉండే దశ- శైశవ దశ
ఉద్వేగాలు అస్థిరత్వంగా గల దశ- కౌమార దశ
ఉద్వేగాలు స్థిరత్వంగా గల దశ- వయోజన దశ
ఉద్వేగాల ప్రతిస్పందనలో భిన్నత్వం ప్రారంభమయ్యే దశ- శైశవ దశ
తులనాత్మకంగా ఉద్వేగాలు మార్పు చెందే దశ- శైశవ దశ
తీవ్రమైన ఉద్వేగ తన్యతలో కూడుకున్న దశ- కౌమార దశ
వయస్సు పెరిగేకొద్దీ పిల్లల్లో పదజాలం పెరుగుతుంది. 10 సంవత్సరాల నాటికి 34,300 పదాలు ఏర్పడుతాయి.
పరిపూర్ణ పరిపక్వ దశ- వయోజన దశ
బొమ్మరిల్లు కట్టే దశ- పూర్వబాల్య దశ

శివపల్లి
టీఎస్‌& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్‌ స్టడీ సర్కిల్‌
9441022571

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉద్వేగ వికాసంపై ప్రభావం చూపే హార్మోన్‌?

ట్రెండింగ్‌

Advertisement