e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ఉద్యమాల వందనాలు..

ఉద్యమాల వందనాలు..


తెలంగాణ సినిమా కవులు
అతని పాటలు ఉద్యమాలకు వందనాలర్పిస్తాయి. అందులో పదునైన ధిక్కార స్వరాలు వినిపిస్తాయి. ఆయన భావాల్లో నిర్మలమైన గ్రామీణ జీవితాలు, పల్లె సంస్కృతీ సంప్రదాయాలు కనిపిస్తాయి. ఆయన రాసిన స్ఫూర్తిదాయక గీతాలు.. జనంలో చైతన్యాన్ని రగిలిస్తాయి. ఆయనే.. ప్రజాకవి యశ్‌ పాల్‌.

అభ్యుదయ గీత రచయితగా, జానపద గేయ కవిగా పేరెన్నికగన్న యశ్‌ పాల్‌ది ఖమ్మం జిల్లా. తల్లిదండ్రులు వీరస్వామి, సుక్కమ్మ. 1971 సెప్టెంబర్‌ 25న జన్మించిన యశ్‌ పాల్‌, ఖమ్మంలోని పోచారంలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. మహబూబాబాద్‌లో డిగ్రీ చేసి, తెలుగు యూనివర్సిటీ నుంచి ఎంసీజే, ఉస్మానియా నుంచి ఎంఏ పట్టాలు పొందారు. ఆయనకు చిన్నప్పటి నుంచే పోరాట గీతాలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే కమ్యూనిస్టు ఉద్యమంలో, అరుణోదయ సాంస్కృతిక విభాగంలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తూ ఎన్నో ఉద్యమగీతాలు రాశారు. ఐదొందలకు పైగా ప్రైవేటుగీతాలు వెలువరించారు. రెండువేలకు పైగా జానపద గేయాలు సేకరించారు.
చదువుల తిప్పలు..
2000లో వచ్చిన ‘ఛలో అసెంబ్లీ’ సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టారు యశ్‌ పాల్‌. ఇందులో ‘సిరిగల్లా భారతదేశం తమ్ముడా! తాకట్టు పెట్టబడ్డదీ తమ్ముడా!’ అంటూ మొదటిపాటతోనే సంచలనాన్ని రేకెత్తించారు. ‘చదువుకున్న తమ్ములంతా భవిష్యత్తు కానరాక బందిపోటు దొంగల్లాగ దారిదోపిడి చేస్తున్నారు’ అంటూ దేశంలో ముసురుకున్న నిరుద్యోగపు చీకట్లను కండ్లకు కట్టినట్లు వివరించారు. యువత ఉపాధి లేక, ఏం చేయాలో అర్థం కాక బందిపోట్లుగా మారారనీ, తమ జీవితాల్ని కోల్పోతున్నారనీ ఈ పాటలో ఆవేదన చెందారు. ఇదే సినిమాలో ‘పొద్దు పొద్దున లేసి పొద్దున్నాలేసి మా కంటిపాపల్లారా!’ అనే పాటలో బడిబాట పడుతున్న పసిపిల్లల ఉజ్వల భవిష్యత్తును చూపించారు. పెద్ద పెద్ద చదువులంటూ చిన్నారులను ఒత్తిళ్లకు గురి చేస్తున్న తీరును వివరించారు. చీకట్లో వెలుగుతున్న చిరుదీపాలుగా పసిపాపల్ని భావిస్తూ, భావితరానికి తేజస్సునిచ్చే వెలుగు దివ్వెలుగా వారిని తీర్చిదిద్దాలనే సందేశాన్ని ఇస్తుందీ పాట.
త్యాగాల గుర్తులు..
‘నిర్భయ భారతం’(2013)లో ‘కొండా కొండల నడుమ కొండల్లా నడుమ’ పాటలో తండ్రీకూతుళ్ళ ప్రేమానుబంధాల్ని ఎంతో మధురంగా అభివర్ణించారు యశ్‌ పాల్‌. చనిపోయిన తల్లిని గుర్తు చేసుకుంటూ బాధపడే ఇద్దరు కూతుళ్ళను ఓదార్చే తండ్రి ప్రేమను వ్యక్తపరిచే పాట ఇది. ‘అమ్మను మించిన దైవం లేదని లోకం అంటుంది.. అమ్మా దైవం అన్నీ తానై లోకం అయ్యిండు’ అంటూ కన్న కూతుళ్ళు తమకు సర్వస్వమైన తండ్రికి కన్నీటితో నమస్కరించిన తీరు ఎంతో ఉన్నతంగా కనిపిస్తుందీ పాటలో. ‘జై లంగాణ’(2012) లో ‘వీరుల్లారా! వీరవనితల్లారా! అమ్మ రుణముకై రణములొరిగినార!’ అనే పాటలో అమరుల త్యాగాలను గుర్తు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఈ పాటలో తలచుకున్నారు. ‘తెలంగాణలో కంటి చెమ్మల్లారా! నునువెచ్చటి నెత్తురు చిమ్మినారో’ అంటూ తెలంగాణలోని కన్నీటి బతుకుల వెతలను, చిందిన నెత్తుటి ప్రవాహాలనూ ఎంతో హృద్యంగా వివరించారు. 1969 నుంచి 2014 వరకూ నేల కొరిగిన త్యాగధనుల గురించి ఈ పాట తెలుపుతుంది. ఇదే సినిమాలో ‘జై జై బోలో తెలంగాణ జైత్రయాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో’ అనే పాట ఈ నేల వీరత్వాన్ని, రణశూరత్వాన్ని వివరిస్తుంది. సమ్మక్క – సారక్క, రాణి రుద్రమ వంటి వీరవనితలకు, తుర్రేబాజ్‌ ఖాన్‌, కొమరం భీం వంటి వీరయోధులకు వందనాలు అర్పించిన వీరగేయం ఇది.
పాడిపంటల సంబురం..
‘దండకారణ్యం’(2016)లో ‘జై బోలో జనతన్‌ సర్కార్‌.. జై బోలో రే.. వ్యవసాయక్షేత్రాలెట్టి దళారులు లేని మార్కెట్లే వెలసే’ అంటూ మరో అద్భుత గీతాన్ని రాశారు యశ్‌ పాల్‌. ప్రభుత్వ సత్కార్యాల గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. ప్రజా
ప్రభుత్వ పాలనలో సస్యశ్యామలంగా తులతూగే పల్లెలను, పాడిపంటలను, జలనిధులను ఎంతో వైభవంగా కీర్తించారు. తెలంగాణ తేజోమయ వికాసాన్ని కొనియాడారు. ఉద్యమ
గీతాలు, సినీగీతాలు.. ఇలా యువతరాన్ని ఉరకలెత్తించే గేయాలనెన్నిటినో రాశారు యశ్‌ పాల్‌. ప్రపంచీకరణ మాయలో పడి అంతరించిపోతున్న పల్లె సంస్కృతిని తన పాటల్లో చూపించారు. తెలంగాణ సినీ గేయ రచయితగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వీరతెలంగాణ ఆదర్శాన్ని ప్రతిఫలింపజేసే పాటల్ని, కవితల్ని రాస్తూ ముందుకు
సాగుతున్నారు యశస్వి యశ్‌ పాల్‌.

‘జై జై బోలో తెలంగాణ జైత్రయాత్ర నడుపుతున్న జై తెలంగాణ బోలో’అనే పాట ఈ నేల వీరత్వాన్ని, రణశూర పటుత్వాన్ని వివరిస్తుంది. సమ్మక్క సారక్క, రాణి రుద్రమ వంటి వీరవనితలకు, తుర్రేబాజ్‌ ఖాన్‌, కొమరం భీం వంటి వీరయోధులకు వందనాలు అర్పించిన గేయం ఇది.

తిరునగరి శరత్‌ చంద్ర
6309873682

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉద్యమాల వందనాలు..

ట్రెండింగ్‌

Advertisement