e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రిని ఎక్కడ ఏర్పాటు చేశారు?

అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రిని ఎక్కడ ఏర్పాటు చేశారు?

 1. క్వాడ్‌ సమూహంలో కింది వాటిలో లేని దేశం? (డి)
  ఎ) భారత్‌ బి) జపాన్‌
  సి) ఆస్ట్రేలియా డి) రష్యా
  వివరణ: భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలతో ఏర్పాటైన కూటమే క్వాడ్‌. కూటమిలోని దేశాల ప్రభుత్వాధినేతల సమావేశం మార్చి 2021లో నిర్వహించారు. క్వాడ్‌కు సంబంధించి ఇదే తొలి వర్చువల్‌ సమావేశం. సవాళ్లు ఏ రూపంలో వచ్చినా కలిసికట్టుగా ఎదుర్కోవాలన్న సానుకూల దార్శనికతతో ముందుకు సాగాలని నాలుగు దేశాలు నిర్ణయించాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ఎలాంటి అవరోధాలు ఉండరాదని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి భద్రత కొనసాగాలని నాలుగు దేశాలు కోరాయి. 5జీ సాంకేతికత, కృత్రిమమేధ, సైబర్‌ స్పేస్‌లలో ప్రమాణాల నిర్ధారణకు కార్యాచరణ బృందాలు ఏర్పాటు చేశారు.
 2. ప్రతిపాదన (ఏ): 2022 ఆగస్ట్‌ 15 నాటికి భారత్‌ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తవుతుంది (బి)
  కారణం: మార్చి 12, 1930న మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం పేరుతో పాదయాత్ర చేపట్టారు
  ఎ) ఏ, ఆర్‌ సరైనవే. ఏను ఆర్‌ సరిగ్గా
  వివరిస్తుంది
  బి) ఏ, ఆర్‌ సరైనవే. ఏకు ఆర్‌ సరికాదు
  సి) ఏ సరైనది, ఆర్‌ సరికాదు
  డి) ఏ తప్పు, ఆర్‌ సరైనది
  వివరణ: వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15 నాటికి భారత్‌ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా భారత్‌ 75 వారాల పాటు ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ పేరుతో వేడుకలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో మహాత్మాగాంధీ చేపట్టిన దండి ఉప్పు సత్యాగ్రహం తరహాలోనే మార్చి 12న పాదయాత్ర ద్వారా ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సబర్మతి ఆశ్రమం నుంచి 81 మంది దండి సముద్ర తీరానికి యాత్రగా బయలుదేరారు. 25 రోజుల్లో వీరు తమ గమ్యాన్ని చేరుకుంటారు. ఈ మొత్తం దూరం 386 కిలోమీటర్లు.
 3. దేశంలో అతిపెద్ద కిడ్నీ వైద్యశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? (సి)
  ఎ) కోల్‌కతా బి) అహ్మదాబాద్‌
  సి) ఢిల్లీ డి) భోపాల్‌
  వివరణ: దేశంలో అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రిని సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ ఏర్పాటు చేసింది. ఏకకాలంలో 101 మందికి డయాలసిస్‌ చేసేందుకు ఇందులో వీలుంటుంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులతో పాటు, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఆస్పత్రి నిర్వహణ వ్యయాన్ని సమకూర్చుకుంటారు.
 4. వింటర్‌ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (శీతాకాల క్రీడా శిక్షణా సంస్థ)ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? (బి)
  ఎ) సిమ్లా బి) గుల్‌మార్గ్‌
  సి) జైపూర్‌ డి) డార్జిలింగ్‌
  వివరణ: శీతాకాల క్రీడా శిక్షణా సంస్థను జమ్ము కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు క్రీడా యువజన వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌రిజిజు ప్రకటించారు. కశ్మీర్‌లోని యువతకు వేర్వేరు క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు రెండో ఖేలో ఇండియా వింటర్‌ గేమ్స్‌ను కూడా ఇక్కడే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐస్‌ స్కేటింగ్‌, ఐస్‌ హాకీ, స్కై మౌంటెనీరింగ్‌ తదితరాలు ప్రాచుర్యం పొందిన శీతాకాల క్రీడలు.
 5. ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్‌ ఫామ్‌ (సౌర క్షేత్రం)ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? (ఎ)
  ఎ) సింగపూర్‌ బి) ఇజ్రాయెల్‌
  సి) స్విట్జర్లాండ్‌ డి) అబుధాబి
  వివరణ: ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్‌ ఫామ్‌ను సింగపూర్‌లో ఏర్పాటు చేయనున్నారు. పునరుత్పాదక శక్తి వనరులకు ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా దీని నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. 2025 నాటికి సౌరశక్తి వినియోగాన్ని నాలుగు రెట్లు పెంచుకోవాలని ఆ దేశం లక్ష్యంగా ఎంచుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద సోలార్‌ పార్క్‌ కర్ణాటకలో ఉంది.
 6. దేశంలో ఏ రో జును వ్యాక్సినేషన్‌ డేగా నిర్వహిస్తారు? (సి)
  ఎ) మార్చి 14 బి) మార్చి 15
  సి) మార్చి 16 డి) మార్చి 17
  వివరణ: ఏటా మార్చి 16న దేశంలో వ్యాక్సినేషన్‌ రోజుగా నిర్వహిస్తారు. 1995లో ఇదే రోజున దేశంలో పెద్ద ఎత్తును పల్స్‌ పోలియోను ప్రారంభించారు. 2014లో భారత దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించారు. దేశంలో 1978లో ఎక్స్‌పాండెడ్‌ ప్రోగ్రాం ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రారంభంమైంది. 1985లో దీనినే యూనివర్సల్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రొగ్రాం అని పేరు మార్చారు. 12 రోగాలు రాకుండా ఉచితంగా వ్యాక్సిన్‌లను ఇందులో భాగంగా ఇస్తారు.
 7. ప్రతిపాదన (ఏ): డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది (ఎ)
  కారణం: మౌలిక సదుపాయాల వృద్ధికి నిధి అవసరం అని ప్రభుత్వం గుర్తించింది
  ఎ) ఏ, ఆర్‌ సరైనవే. ఏను ఆర్‌ సరిగ్గా వివరిస్తుంది
  బి) ఏ, ఆర్‌ సరైనవే. ఏకు ఆర్‌ సరికాదు
  సి) ఏ సరైనది, ఆర్‌ సరికాదు
  డి) ఏ తప్పు, ఆర్‌ సరైనది
  వివరణ: రూ.20,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక వనరులను దీని ద్వారా సేకరిస్తారు. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలు, ఉపరంగాల ఆర్థికాభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. 1948లో ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు.
 8. విదేశీ మారక నిల్వల్లో 2021 మార్చి 5 నాటికి దేశం ఎన్నో స్థానానికి చేరింది? (డి)
  ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
  వివరణ: ప్రపంచంలో విదేశీ మారక నిల్వలు (ఫారిన్‌ ఎక్సేంజ్‌ రిజర్వ్స్‌) కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ప్రస్తుతం నాలుగో స్థానానికి చేరింది. తొలి మూడు స్థానాల్లో వరుసగా చైనా, జపాన్‌, స్విట్జర్లాండ్‌ దేశాలు నిలిచాయి. మార్చి 5, 2021 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 580.3 బిలియన్లకు చేరాయి. విదేశీ కరెన్సీల్లో భారత కేంద్ర బ్యాంక్‌ వద్ద ఉన్న నగదునే విదేశీ మారక నిల్వలు అంటారు.
 9. భారత్‌కు చమురును ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇటీవల రెండో స్థానానికి ఎగబాకిన దేశం? (సి)
  ఎ) సౌదీ అరేబియా బి) ఇరాక్‌
  సి) అమెరికా డి) రష్యా
  వివరణ: దేశానికి చమురును ఎగుమతి చేసే దేశాల జాబితాలో ఇరాక్‌ తర్వాత రెండో స్థానానికి అమెరికా చేరింది. ఇంతవరకు ఆ స్థానంలో సౌదీ అరేబియా ఉంది. మూడో స్థానంలో ప్రస్తుతం నైజీరియా ఉంది. నాలుగో స్థానానికి సౌదీ అరేబియా చేరింది. 2006 తర్వాత ఇలా నాలుగో స్థానానికి సౌదీ అరేబియా చేరడం ఇదే మొదటి సారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా నుంచి చమురు దిగుమతులు రోజుకు 5,45,300 బ్యారెళ్లకు చేరింది.
 10. టీ-20 ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 3000 పరుగుల మైలురాయిని దాటిన తొలి క్రికెటర్‌ ఎవరు? (బి)
  ఎ) రోహిత్‌ శర్మ బి) విరాట్‌ కోహ్లీ
  సి) మార్టిన్‌ గప్టిల్‌ డి) మిలెన్‌
  వివరణ: టీ-20 అంతర్జాతీయ పోటీల్లో 3000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాట్స్‌మెన్‌ భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఇరు జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో విరాట్‌ ఈ ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్‌ గప్టిల్‌ 99 మ్యాచుల్లో 2839 పరుగులు చేశాడు. భారత జట్టు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 108 మ్యాచుల్లో 2773 పరుగులు చేశాడు.
 11. టోక్యో ఒలింపిక్స్‌కు ఆర్హత సాధించిన భారత తొలి ఫెన్సర్‌ ఎవరు? (ఎ)
  ఎ) భవాని దేవి బి) సముచిత రాయ్‌
  సి) విజ్ఞానేశ్వరి డి) సీమా
  వివరణ: 2021లో జపాన్‌లోని టోక్యోలో నిర్వహించనున్న ఒలింపిక్స్‌ పోటీలకు భారత ఫెన్సర్‌ క్రీడాకారిణి భవాని దేవి అర్హత సాధించింది. ఈ ఘనత దక్కించుకున్న భారత తొలి ఫెన్సర్‌ ఆమె. ప్రస్తుతం ఈ క్రీడలో ప్రపంచలో ఆమె 45వ ర్యాంక్‌లో ఉంది. టోక్యో ఒలింపిక్స్‌ ఈ ఏడాది జూలై 23 నుంచి ఆగస్ట్‌ 2021 వరకు నిర్వహించనున్నారు. ఇవి 2020లోనే జరగాల్సినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.
 12. మిథాలీ రాజ్‌ ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచారు? (సి)
  ఎ) ప్రపంచ మహిళా క్రికెట్లో తొలిసారిగా 10,000 పరుగులు పూర్తి చేశారు
  బి) భారత మహిళా క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా నియామకమయ్యారు
  సి) 10,000 పరుగులు మైలురాయిని దాటిన తొలి భారత మహిళా క్రికెటర్‌ ఆమె
  డి.ఏదీ కాదు
  వివరణ: అంతర్జాతీయ స్థాయిలో 10,000 పరుగులు పూర్తి చేసిన భారత మహిళా తొలి క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌. లక్నోలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా ఆమె ఈ ఘనతను సాధించారు. ప్రపంచంలో పదివేల పరుగులు మైలు రాయిని దాటిన తొలి మహిళా క్రికెటర్‌ ఇంగ్లండ్‌కు చెందిన చార్లోట్‌ ఎడ్వర్డ్స్‌. ఆ తర్వాతి స్థానం మిథాలీ రాజ్‌దే. ఆమెకు 2003లో అర్జున అవార్డ్‌, 2015లో పద్మశ్రీ లభించాయి. వన్డే క్రికెట్‌ చరిత్రలో వరుసగా ఏడు అర్ధసెంచరీలు చేసిన రికార్డ్‌ కూడా ఆమె పేరిట ఉంది.
 13. ప్రైవేట్‌ రంగంలోని ఉద్యోగాల్లో స్థానికులకు 75% రిజర్వేషన్‌ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్రం/రాష్ర్టాలు కింది వాటిలో ఏవి? (డి)
  ఎ) ఆంధ్రప్రదేశ్‌ బి) హర్యానా
  సి) జార్ఖండ్‌ డి) పైవన్నీ
  వివరణ: రూ.30,000 వరకు వేతనాలు ఉండే ప్రైవేట్‌ ఉద్యోగాల్లో స్థానికులకు 75% రిజర్వేషన్‌ కల్పిస్తూ జార్ఖండ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఆ తర్వాత హర్యానా ప్రభుత్వం కూడా తమ విధానంగా తీసుకొచ్చింది. ఆ రాష్ట్రంలో రూ 50,000 కంటే తక్కువ వేతనాలు ఉండే ఉద్యోగాలకు మాత్రమే ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుంది. తాజాగా జార్ఖండ్‌ రాష్ట్రం కూడా ఈ తరహా నిర్ణయం తీసుకుంది.
 14. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కింది వారిలో గెలుచుకుంది ఎవరు? (ఎ)
  ఎ) నిఖిలేశ్వర్‌ బి) కేదారేశ్వర్‌
  సి) రాజీవ్‌ దామోదర్‌ డి) ఎవరూ కాదు
  వివరణ: నిఖిలేశ్వర్‌గా ప్రసిద్ధుడైన కుంభం యాదవరెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా వీరల్లికి…. చెందిన వారు. ఆరుగురు దిగంబర కవుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. విప్లవ రచయితల సంఘానికి వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. ఇంగ్లిష్‌, హిందీ భాషల్లోనూ ఆయన కవితలను రాశారు. దేశ వ్యాప్తంగా 20 భాషల్లోని కవితా సంకలనాలు, చిరు కథలు, స్మృతి కావ్యాలు, నవలలను కేంద్ర సాహిత్య అకాడమీ ఎంపిక చేయగా అందులో నిఖిలేశ్వర్‌ కూడా ఉన్నారు. అలాగే సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని మానస ఎండ్లూరి, బాల సాహిత్య పురస్కారాన్ని కన్నెగంటి అనసూయలు గెలుచుకున్నారు.
 15. పీసీఏ నుంచి ఇటీవల బయటపడ్డ బ్యాంక్‌ ఏది? (సి)
  ఎ) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
  బి) ఇండియన్‌ బ్యాంక్‌
  సి) ఐడీబీఐ డి) యాక్సిస్‌ బ్యాంక్‌
  వివరణ: సత్వర దిద్దుబాటు చర్యల నిబంధనల నుంచి ఐడీబీఐ బ్యాంక్‌ను ఆర్‌బీఐ బయటకు తీసుకొచ్చింది. సత్వర దిద్దుబాటు చర్యనే ఇంగ్లిష్‌లో ప్రాంప్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌ (పీసీఏ)గా వ్యవహరిస్తారు. ఆర్‌బీఐ రూపొందించిన ఫ్రేమ్‌వర్క్‌లో ఇది భాగం. ఆర్థికంగా బలహీనంగా ఉన్న బ్యాంక్‌లను ఈ చట్రంలోకి ఆర్‌బీఐ చేరుస్తుంది. నిరర్ధక ఆస్తుల నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకుంటారు. పీసీఏను ఆర్‌బీఐ 2002లో రూపొందించింది. 2017 మే నెలలో ఐడీబీఐ బ్యాంక్‌ను ఈ జాబితాలో చేర్చారు. మూలధన నిష్పత్తి నిబంధనలు పాటించకోవడంతో పాటు నికర ఎన్‌పీఏలు 2017 మార్చి త్రైమాసికంలో 13 శాతానికి పెరిగాయి. ఆస్తుల రాబడి లేకపోవడం ఇందుకు కారణం. పరిస్థితి తాజాగా మెరుగుపడడంతో ఈ బ్యాంక్‌ను పీసీఏ నుంచి బయటకు తీసుకొచ్చారు.

వి.రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ , వ్యోమా.నెట్‌
9849212411

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అతిపెద్ద కిడ్నీ ఆస్పత్రిని ఎక్కడ ఏర్పాటు చేశారు?

ట్రెండింగ్‌

Advertisement