ఆదివారం 24 జనవరి 2021
National - Jan 12, 2021 , 09:49:47

క‌రోనా టీకాకు 'జ‌డ్ ప్ల‌స్' కేట‌గిరీ భ‌ద్ర‌త‌

క‌రోనా టీకాకు 'జ‌డ్ ప్ల‌స్' కేట‌గిరీ భ‌ద్ర‌త‌

హైద‌రాబాద్ : ప‌్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికించిన క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు టీకా అందుబాటులోకి వ‌చ్చింది. ఏడాది కాలం పాటు అంద‌రినీ ముప్పుతిప్ప‌లు పెట్టిన‌ క‌రోనాను తుద‌ముట్టించేందుకు టీకా అందుబాటులోకి రావడంతో దాన్ని ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌తో పాటు ప్ర‌జ‌లంద‌రిపై ఉంది. సీరం రూపొందించిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లు కరోనాను ఎదుర్కోవడంలో సమర్థంగా పనిచేస్తాయని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ రెండు టీకాల‌ను దేశ వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. 

జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కొవిడ్ వ్యాక్సిన్‌ను బంగారంలా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ టీకా బంగారం కంటే విలువైన‌ది. ఈ క్ర‌మంలో టీకా స‌ర‌ఫ‌రా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. మంగ‌ళ‌వారం ఉద‌యం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకాను మూడు ట్ర‌క్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు త‌ర‌లించారు. అయితే ఈ టీకాను త‌ర‌లింపున‌కు జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను కేటాయించారు. విమానాశ్రయం నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గౌహతి, లక్నో, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు తరలించనున్నారు. 

దొంగ‌త‌నం జ‌ర‌గ‌కుండా..

కొవిడ్ వ్యాక్సిన్ దొంగ‌త‌నం జ‌ర‌గ‌కుండా ఆ టీకాను త‌ర‌లిస్తున్న లాజిస్టిక్స్‌, ట్రాన్స్‌పోర్టు సంస్థ‌లు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఆ వాహ‌నాలు ఎక్క‌డ వెళ్తున్నాయ‌నే అంశాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు జీపీఎస్ ద్వారా తెలుసుకునే విధంగా సాంకేతిక‌త‌ను ఉప‌యోగించారు. ఆ ట్ర‌క్కులు ఓపెన్ కాకుండా ఉండేలా రూపొందించారు. ఆన్‌లైన్ విధానంలో రిమోట్ ద్వారా తెరిచే విధంగా  చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇంఛార్జిల ఫింగ‌ర్ ప్రింట్‌తోనే ఈ ట్ర‌క్కులు ఓపెన్ అయ్యేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. క‌రోనా టీకా నిల్వ‌, వ్యాక్సిన్ వేసే ప్రాంతాల్లో ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 

ఎవ‌రెవ‌రికి జ‌డ్ ప్ల‌స్‌ కేట‌గిరీ భ‌ద్ర‌త‌

ప్ర‌స్తుతం దేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, నితిన్ గ‌డ్క‌రీ, యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, మాజీ సీఎం మాయావ‌తి, అజిత్ దోవ‌ల్‌, గులాం న‌బీ ఆజాద్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌కు జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరి భ‌ద్ర‌త కేటాయించారు. 

భారత్‌లో వీఐపీలు, వీవీఐపీల కోసం వివిధ రకాల భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. నాయకులకు వారి ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సమాచారాన్ని తీసుకుని భద్రత కల్పిస్తారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) విభాగం నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఏ నాయకులకు ఏ భద్రత కల్పించాలో కేంద్ర హోంశాఖ నిర్ణయిస్తుంది.  

జెడ్ ప్లస్ కేటగిరీ: ఈ కేటగిరీలో 36 మంది అధికారులు వీవీఐపీలకు నిరంతరం రక్షణ ఇస్తారు. వీరిలో 10 మందికి పైగా ఎన్‌ఎస్‌జీ అధికారులే ఉంటారు. 


logo