ఆదివారం 29 మార్చి 2020
National - Mar 09, 2020 , 17:21:03

రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన వైసీపీ

 రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన వైసీపీ

అమరావతి: దేశవ్యాప్తంగా వచ్చే ఏప్రిల్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి.   రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ  ఎన్నికలు జరిగే రాజ్యసభ స్థానాలు అన్ని అధికార పార్టీల ఖాతాల్లోనే పడనున్నాయి.  ఏపీలో ఎన్నికలు జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలను అధికార  వైసీపీ కైవసం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది.  

ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లతో పాటు అయోధ్య రామిరెడ్డిల పేర్లను వైసీపీ ఎంపిక చేసింది. ఇక నాలుగో సీటు పారిశ్రామిక వేత్త పరిమల్‌ నత్వానికి వైసీపీ కేటాయించింది. మండలి రద్దు కాబోతున్న నేపథ్యంలో ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపుతోంది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ మేరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డికి   ఒక సీటు కేటాయించారు. 

13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలకు తుది గడువు విధించారు.  మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 17 రాష్ట్రాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. 


logo