శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 11, 2020 , 16:47:08

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. మాచర్లలో ఉద్రిక్తత

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. మాచర్లలో ఉద్రిక్తత

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. మాచర్లలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న, బొండా ఉమాతో పాటు న్యాయవాది కిశోర్‌ మాచర్లకు వచ్చారు. వీరు వచ్చారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు.. వారి వాహనాలను వెంబడించారు. చివరకు టీడీపీ నాయకుల వాహనాలను చుట్టుముట్టి కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఈ దాడుల నుంచి బొండా ఉమా, బుద్దా వెంకన్న తప్పించుకోగా, లాయర్‌ కిశోర్‌కు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. 

10 కార్లలో ఎందుకు వెళ్లారు?

ఈ ఘటనపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మాచర్లకు 10 కార్లలో బొండా ఉమా, వెంకన్న ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని మంత్రి ప్రశ్నించారు. పార్టీ గూండాలను పంపి పల్నాడులో దౌర్జన్యం చేయాలనుకున్నారా? అని అడిగారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో గెలవలేమని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు కుట్రలను, ఆయన నీచమైన ఆలోచనలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి బొత్స తెలిపారు.


logo