గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 16, 2020 , 16:21:30

సంస్కృత శ్లోకాలు నేర్చుకుంటే.. మెద‌డు చురుక‌వుతుంది

సంస్కృత శ్లోకాలు నేర్చుకుంటే.. మెద‌డు చురుక‌వుతుంది

హైద‌రాబాద్‌:  కేంద్ర సంస్కృత యూనివ‌ర్సిటీల బిల్లుపై ఇవాళ రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ జ‌రిగింది. ఆ బిల్లు చ‌ర్చ స‌మ‌యంలో అనేక మంది ఎంపీలు మాట్లాడారు.  సంస్కృత బిల్లుకు బీజేపీ స‌పోర్ట్ ఇస్తోంద‌ని ఎంపీ సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి తెలిపారు.  రాజ్యాంగంలోని 343వ ఆర్టిక‌ల్‌ను ఆయ‌న చ‌దివి వినిపించారు.  సంస్కృత భాష చ‌చ్చింద‌న్న‌వారు.. చ‌నిపోయిన మేధావులే అని అన్నారు.  ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ కోసం సంస్కృత భాష‌నే ఉత్త‌మ‌మైంద‌ని నాసా త‌న నివేదిక‌లో పేర్కొన్న‌ట్లు ఎంపీ సుబ్ర‌మ‌ణియ‌న్ తెలిపారు. లండ‌న్‌లో ఉన్న ఓ వ‌ర్సిటీ త‌ప్ప‌నిస‌రిగా సంస్కృతాన్ని నేర్పుతోంద‌న్నారు.  ఇది కాంగ్రెస్ స‌భ్యులు నేర్చుకోవాల‌న్నారు.  సంస్కృత శ్లోకాల‌ను నేర్చుకుంటే.. మెద‌డు చురుక‌గా మారుతుంద‌ని ఎంపీ సుబ్ర‌మ‌ణియ‌న్ అన్నారు.  త‌మిళ‌, సంస్కృత భాష‌లో 40 శాతం ప‌దాలు ఒకే విధంగా ఉంటాయ‌న్నారు.  

కేంద్ర ప్ర‌భుత్వం సంస్కృతంతో పాటు ఇతర భాష‌ల గురించి కూడా ప‌ట్టించుకోవాల‌ని ఎంపీ జ‌య‌రామ్ ర‌మేశ్ తెలిపారు. పాణిని పేరుతో ఓ వ‌ర్సిటీని ఏర్పాటు చేయాల‌ని కోరారు.  ప‌తంజ‌లి లేదా అమ‌ర‌సింహ అనే పేరుతో మ‌రో వ‌ర్సిటీ ఏర్పాటు చేయాల‌న్నారు.  కేంద్ర వ‌ర్సిటీల‌కు మంత్రులు ఛాన్స‌ల‌ర్లుగా ఉండ‌కూడ‌ద‌న్నారు.  సంస్కృత పండితుడికే ఆ హోదా క‌ల్పించాల‌ని ఎంపీ జ‌య‌రాం తెలిపారు.  వార‌ణాసిలో ఉన్న సంస్కృత యూనివ‌ర్సిటీ ప‌రిస్థితి అద్వాన్నంగా ఉన్న‌ద‌ని ఎస్‌పీ ఎంపీ రామ్ గోపాల్ యాద‌వ్ తెలిపారు.  చ‌రిత్ర‌లో, పురాణాల్లో సంస్కృత భాష గొప్ప‌త‌నం మ‌రువ‌లేనిద‌ని ఎంపీ ప్ర‌శాంత నంద అన్నారు.  ఆ బిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు బీజేడీ ఎంపీ తెలిపారు.  

సంస్కృత భాష కొంద‌రికే వ‌చ్చు అని, ఆ భాష కోసం ప్ర‌భుత్వం ఎందుకు ఇంత ఖ‌ర్చు చేస్తుందో తెలియ‌డం లేద‌ని సీపీఐ నేత  కేకే రాజేశ్ అన్నారు. కేర‌ళ‌లోని కేంద్రీయ విద్యాల‌యాల్లో మ‌ల‌యాళం నేర్ప‌డంలేద‌న్నారు. సంస్కృతం కోసం 643 కోట్లు వెచ్చించారు, కానీ త‌మిళం కోసం 22 కోట్లు  మాత్ర‌మే ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు డీఎంకే ఎంపీ ష‌ణ్ముగం తెలిపారు.  బిల్లును వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృత బిల్లుకు ఆమోదం తెలుపుతున్న‌ట్లు ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి చెప్పారు.   


logo