గురువారం 03 డిసెంబర్ 2020
National - Aug 20, 2020 , 17:33:06

త్రిపురలో రూ.కోటి విలువైన యాబా టాబ్లెట్లు, బ్రౌన్‌ షుగర్‌ స్వాధీనం

త్రిపురలో రూ.కోటి విలువైన యాబా టాబ్లెట్లు, బ్రౌన్‌ షుగర్‌ స్వాధీనం

అగర్తాలా : నగరంలో రెండు వేర్వేరు ఆపరేషన్లలో త్రిపుర పోలీసులు రూ.కోటి విలువైన యాబా టాబ్లెట్లు, బ్రౌన్ షుగర్, నగదు, మొబైల్ ఫోన్‌లను గురువారం స్వాధీనం చేసుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

స్థానిక పోలీసులు, రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక విభాగం, ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్తంగా బుధవారం రాత్రి జాక్సన్ గేట్ ప్రాంతానికి సమీపంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీలు జరపగా అతడి వద్ద నుంచి ప్యాకెట్లలో సీల్‌ చేసిన యాబా మాత్రలు, బ్రౌన్‌ షుగర్‌ దొరికినట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకొని ఇక్కడి శాంతిపార వద్ద ఉన్న అతడి ఇంటిపై దాడిచేసి మరిన్ని నిషేధిత వస్తువులు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

52,000 యాబా టాబ్లెట్లు (మెథాంఫేటమిన్, కెఫిన్ మిశ్రమం), బ్రౌన్ షుగర్, రూ. 13.86 లక్షల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు మాదక వ్యతిరేక విభాగం పోలీసు సూపరింటెండెంట్ ఆర్ సరస్వతి తెలిపారు. ఈ మాదకద్రవాల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. 

మరో ప్రత్యేక ఆపరేషన్‌లో పోలీసులు బుధవారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అమ్తాలి ప్రాంతంలో వారి వద్ద నుంచి రూ.27 లక్షల విలువైన 154 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అంపాలి పోలీస్ స్టేషన్ ఆఫీసర్-సిద్దార్థ శంకర్ మాట్లాడుతూ సెపాహిజాలా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు మీదుగా ఇద్దరు వ్యక్తులు మొబైల్ ఫోన్‌లను బంగ్లాదేశ్‌కు అక్రమంగా రవాణా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం మేరకు దాడులు చేసినట్లు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.