ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 09, 2020 , 15:53:30

హిందీలో మాట్లాడితేనే చెవిక‌మ్మ‌లు.. 20 గంట‌ల నిర‌స‌న‌

హిందీలో మాట్లాడితేనే చెవిక‌మ్మ‌లు.. 20 గంట‌ల నిర‌స‌న‌

ముంబై : చెవి క‌మ్మ‌లు కొందామ‌ని జ్యువెల‌రీ షాపుకు వెళ్లిన ఓ మ‌రాఠీ ర‌చ‌యిత్రికి చేదు అనుభ‌వం ఎదురైంది. హిందీ భాష‌లో మాట్లాడితేనే త‌న షాపుకు రావాల‌ని లేదంటే ఇక్క‌డ్నుంచి వెళ్లిపోవాల‌ని ఆ దుకాణం య‌జ‌మాని ర‌చ‌యిత్రిని ఆదేశించాడు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ర‌చ‌యిత్రి.. భాష‌ను కించ‌ప‌రిచాడ‌ని త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేసింది. ఒక‌ట్రెండు గంట‌లు కాదు.. ఏకంగా 20 గంట‌ల పాటు ఆ జ్యువెల‌రీ షాపు ముందు నిర‌స‌న వ్య‌క్తం చేసింది. 

మ‌హారాష్ర్ట రాజ‌ధాని ముంబై న‌గ‌రానికి చెందిన మ‌రాఠీ ర‌చ‌యిత్రి శోభ దేశ్‌పాండే.. చెవి క‌మ్మ‌లు కొందామ‌ని ఓ జ్యువెల‌రీ షాపుకెళ్లింది. అయితే ఆ దుకాణ య‌జ‌మానికి హిందీ భాష మాత్ర‌మే వ‌స్తుంది. మ‌రాఠీలో కాకుండా.. హిందీలో మాట్లాడితేనే త‌న షాపుకు రావాల‌ని, లేదంటే వెళ్లిపోవాల‌ని ఆమెను ఆదేశించాడు. ఈ క్ర‌మంలో ర‌చ‌యిత్రి తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. షాపు లైసెన్స్ చూపించాల‌ని ఆమె డిమాండ్ చేసిన‌ప్ప‌టికీ అది చూపించ‌లేదు.  మొత్తానికి పోలీసుల‌కు కాల్ చేయడంతో కొంద‌రు వ‌చ్చి య‌జ‌మానితో ఏదో మాట్లాడి వెళ్లిపోయారు. కానీ ఆమె స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో 20 గంట‌ల పాటు ర‌చ‌యిత్రి ఆ దుకాణం ఎదుట నిర‌స‌న వ్య‌క్తం చేసింది. ఆమెకు మ‌హారాష్ర్ట‌ నిర్మాణ్ సేన కార్య‌క‌ర్త‌లు మ‌ద్ద‌తుగా నిలిచారు. చివ‌ర‌కు ఆ జ్యువెల‌రీ దుకాణం య‌జ‌మాని.. ర‌చ‌యిత్రి దేశ్‌పాండేకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఆ త‌ర్వాత పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మ‌రాఠీ నేర్చుకునేంత వ‌ర‌కు జ్యువెల‌రీ షాపు తెర‌వొద్ద‌ని మ‌హారాష్ర్ట నిర్మాణ్ సేన కార్య‌క‌ర్త‌లు అత‌న్ని హెచ్చ‌రించారు.