శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Nov 06, 2020 , 07:00:06

క‌ట్టూర్‌లో అతిపెద్ద ఏనుగుల పున‌రావాస కేంద్రం

క‌ట్టూర్‌లో అతిపెద్ద ఏనుగుల పున‌రావాస కేంద్రం

తిరువ‌నంత‌పురం: కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంతపురం స‌మీపంలోని క‌ట్టూరులో ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఏనుగుల పున‌రావాస, సంర‌క్ష‌ణ‌ కేంద్రం ఏర్పాటుకానుంది. దీన్ని రూ.108 కోట్ల భారీ వ్య‌యంతో నిర్మిస్తున్నారు. తొలివిడుత‌లో భాగంగా ఈ సంరక్షణ, నివారణ కేంద్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అందుబాటులోకి రానుంది. ఇప్ప‌టికే అక్క‌డ 16 ఏనుగులు ఉండ‌గా, మ‌రో 50 ఏనుగుల‌ను సంర‌క్షించ‌నున్నారు. 

ప్రాజెక్టులో భాగంగా ఏనుగుల‌కు అడ‌విలోనే ఉన్నామ‌నే భావ‌న క‌ల్పించేలా అన్ని విధాల సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్నారు. దీనికోసం భారీ సంఖ్య‌లో గుహ‌లు, చెక్‌డ్యాంలు, రిజ‌ర్వాయ‌ర్లు నిర్మించ‌నున్నారు. అదేవిధంగా ఈ కేంద్రంలో ఏనుగుల మ్యూజియాన్ని, సూప‌ర్ స్పెషాలిటీ వ‌స‌తుల‌తో ప‌శువైద్యశాల‌ను ఏర్పాటు ‌చేయ‌నున్నారు. మావ‌టీల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌డంతోపాటు, విద్యార్థులు, ప్ర‌కృతి ప్రేమికుల‌కు ఓ రిసెర్చ్ సెంట‌ర్‌గా దీన్ని రూపొందిస్తామ‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ ప్రాజెక్టు పూర్త‌యిన త‌ర్వాత స్థానికుల‌కు ఉపాధి అవ‌కాశాలు మెరుగువ‌తాయ‌ని, ప్రతిరోజు సుమారు 250 మందికి ప‌నిదొరుకుతుంద‌ని చెప్పారు. మొత్తంగా తిరువ‌నంత‌పురం జిల్లాలో గొప్ప ప‌ర్యాట‌క కేంద్రంగా మార‌నుంద‌ని చెప్పారు.