మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 22, 2020 , 12:24:12

నేడు వరల్డ్‌ వాటర్‌ డే

నేడు వరల్డ్‌ వాటర్‌ డే

పర్యావరణ ప్రగతి అనే అంశంపై సమావేశం జరిగింది.  బ్రెజిల్‌లోని రియో డి జనీరియో వేదికగా 1992 సంవత్సరంలో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రపంచ జల దినోత్సవం పాటించాలన్న ఆలోచన రూపుదిద్దుకుంది. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం లివింగ్‌ ఆన్‌ వన్‌ బిహైండ్‌ నినాదాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి శుభ్రమైన నీటిని 2030 నాటికి అందివ్వాలని ఐరాసా లక్ష్యంగా పెట్టుకుంది. భూగోళంపై 75శాతం నీటి వనరులతో ఉంటుంది. దీని కారణంగా అంతరిక్షం నుంచి భూమి నీలిరంగులో కనిపిస్తుంది. భూమిపై ఉన్న నీటిలో 97శాతం ఉప్పునీరు సముద్రంలో ఉండగా మిగితాది చెరువులు, నదుల్లో ఉంటుంది. నీటి వనరుల్లో మనం తాగడానికి ఉపయోగించుకునేది ఒక్కశాతం మాత్రమే. ఈ వనరులే భూమిపై నివాసం ఉంటున్న 700 కోట్ల మంది దాహాన్ని, ఇతర అవసరాలను తీరుస్తుంది. ప్రపంచ నాగరికతలు అన్నినీటి చుట్టే సాగాయి. సింధూ నాగరికత, ఈజిప్టు నాగరికత, మెసపటోనియా నాగరికత అలా ఏ నాగరికత చూసినా మనిషి మనుగడ అనాది నుంచి నీటి చుట్టూనే తిరుగుతుంది. నీరు లేనిదే మనిషికి, ఇతర జంతుజాలానికి మనుగడ లేదన్నది సత్యం.

  దివంగత మాజీ రాష్ట్రపతి అబ్ధుల్‌కలాం ఒక సందర్భంలో నీటి వనరుల గురించి ఉపన్యసిస్తూ మనం ఈ విధంగానే నీటిని కలుషితం చేస్తూ పోతే 2050 నాటికి తాగడానికి కూడా నీటి కొరత ఏర్పడుతుందని తెలిపారు. జనం స్నానాలు చేయడం పూర్తిగా బంద్‌ చేసి శరీరానికి రసాయనాలు పూసుకుంటారు. కెమికల్‌ స్నానాలు చేస్తారు. సరిహద్దులో కాపలా ఉండాల్సిన సైనికులు నీటివనరులకు కాపలా ఉంటారు. తల స్నానం చేయడానికి నీరు సరిపోక ప్రజలు బోడగుండుతో జీవిస్తారు. స్త్రీ పురుషులు అందరూ రోజు తలను నున్నగా గొరుక్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. భారతీయులకు నీటి విలువ తెలుసుకాబట్టే నీటిని గంగమ్మగా, తలపై గంగమ్మను నిలుపుకున్నాడు కాబట్టి శివుడిని గంగాధరుడని పూజిస్తుంటాం. నీరు పారబోయాల్సింది కాదని, నెత్తిన పెట్టుకోని పూచించాలని శివయ్య మానవాలికి సందేశం ఇచ్చాడు.  

ప్రస్తుతం ఉన్న వాతావరణ, సహజవనరులపై ఉన్న ఒత్తిడిలో జలం, జలవనరుల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. తెలంగాణ ప్రభుత్వం తమ భౌగోళిక ప్రాంతంలో కురిసే వానతో వచ్చే నీటిని, ఆయకట్టు ద్వారా వచ్చే రీజనరేషన్‌ జలాలను ఒడిసి పట్టి, సంరక్షించి, లక్షల ఎకరాల మాగాణి చేసేందుకు వాడుకోవాలనే ఉద్దేశంతో భారీ ప్రాజెక్టులు, చిన్న నీటి వనరులతో పాటు వాగులు, వంకలపై చెక్‌డ్యాంలు నిర్మించాలని తలపెట్టింది. నీళ్లుంటేనే ప్రగతి, వాటితోనే ఆర్థికాభివృద్ధి. దీని ప్రాముఖ్యతను గుర్తించిన సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. అందులో భాగంగానే కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు.

భారీ ప్రాజెక్టులతోపాటు వాగుల్లో నీళ్లు అందుబాటులో ఉన్నచోట చెక్‌డ్యాంలు నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ చెక్‌డ్యాంలను నిర్మించవచ్చో అని అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే ఆధారంగా పెద్దపెద్ద వాగులపై చెక్‌డ్యామ్‌లను నిర్మించ వచ్చని గుర్తించి సర్వే సారాంశాన్ని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా ఇప్పటికే నాలుగు విడుతల్లో చెరువులను పునరుద్ధరించడంతో నీటి సామర్థ్యం భారీగా పెరగడంతోపాటు భూగర్భజలాలు గణనీయంగా వృద్ధి చెందాయి.  రాష్ట్రవ్యాప్తంగా 1200 చెక్‌ డ్యాంలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 650, వచ్చే సంవత్సరం మరో 550 చెక్‌ డ్యాంలను నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచింది.logo