సోమవారం 13 జూలై 2020
National - Apr 27, 2020 , 10:27:39

కోవిడ్‌ వ్యాక్సిన్.. ఇండియా వైపే అంద‌రి చూపు !

కోవిడ్‌ వ్యాక్సిన్.. ఇండియా వైపే అంద‌రి చూపు !

హైద‌రాబాద్‌: జ‌న‌రిక్ డ్ర‌గ్స్‌, వ్యాక్సిన్లు ఉత్ప‌త్తి చేయ‌డంలో ఇండియానే నెంబ‌ర్ వ‌న్. ప్ర‌పంచంలో అత్య‌ధిక స్థాయిలో టీకాల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ది మ‌న‌మే. ప్ర‌స్తుతం కోవిడ్‌19 వ్యాధి కోసం వ్యాక్సిన్ త‌యారీ చేసేందుకు సుమారు అర‌డ‌జ‌ను కంపెనీలు కృషి చేస్తున్నాయి.  దీంట్లో సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్ర‌ధాన‌మైంది.  ప్ర‌పంచంలో అత్య‌ధిక వ్యాక్సిన్లు త‌యారు చేసేది ఈ కంపెనీయే. డోసుల ఉత్ప‌త్తి, వాటి అమ్మ‌కాల ఆధారంగా ఈ విష‌యాన్ని చెప్ప‌వ‌చ్చు.  యూనివ‌ర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫ‌ర్డ్‌తో క‌లిసి సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ వ్యాక్సిన్ త‌యారీలో నిమ‌గ్న‌మైంది.  

గ‌త గురువారం నుంచి ఆక్స్‌ఫ‌ర్డ్‌లో హ్యూమ‌న్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభం అయ్యాయి. ఒక‌వేళ అన్నీ స‌జావుగా సాగితే, సెప్టెంబ‌ర్ క‌ల్లా సుమారు ప‌ది ల‌క్ష‌ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ త‌యారీ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం వైర‌స్ ప్ర‌బ‌లుతున్న తీరు చూస్తుంటే, ప్ర‌పంచ వ్యాప్తంగా మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యాక్సిన్ డోస్‌లు అవ‌స‌రం.  అయితే సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్‌కు సుమారు 500 మిలియ‌న్ల డోస్‌లు ఉత్ప‌త్తి చేసే సామ‌ర్థ్యం ఉన్న‌ది. 

భార‌త్‌, అమెరికా కూడా క‌లిసి వ్యాక్సిన్ అభివృద్ధిపై ప‌నిచేస్తున్న‌ట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో తెలిపారు.  గ‌త మూడు ద‌శాబ్ధాల నుంచి రెండు దేశాలు వివిధ వ్యాక్సిన్ల త‌యారీలో క‌లిసి ప‌నిచేస్తున్నాయన్నారు. డెంగ్యూ, ఎంట్రిక్ డిసీజెస్‌, ఇన్‌ఫ్లూయాంజా, టీబీ లాంటి వాటికి వ్యాక్సిన్లు త‌యారు చేశారు. అయితే డెంగ్యూ వ్యాక్సిన్‌కు మాత్రం ట్ర‌య‌ల్స్ చేయాల్సి వున్న‌ది.  

53 ఏళ్ల కంపెనీ సీర‌మ్ ఇన్సటిట్యూట్ ప్ర‌తి ఏడాది 1.5 బిలియ‌న్ల వ్యాక్సిన్ డోస్‌ల‌ను త‌యారు చేస్తుంది. మ‌హారాష్ట్ర‌లోని పుణెలో ఆ కంపెనీకి రెండు ప్లాంట్లు ఉన్నాయి. వీటితో పాటు నెద‌ర్లాండ్స్‌, చెక్ రిప‌బ్లిక్‌లో చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఆ కంపెనీలో సుమారు ఏడు వేల మంది ప‌నిచేస్తున్నారు. 165 దేశాల‌కు ఈ కంపెనీ సుమారు 20 టీకాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది.  80 శాతం వ్యాక్సిన్ల‌ను ఎగుమ‌తి చేస్తున్నారు. అది కూడా త‌క్కువ ధ‌ర‌కే. 

ప్ర‌స్తుతం సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ కంపెనీ.. అమెరికాకు చెందిన కోడాజెన‌క్స్‌తో భాగ‌స్వామ్యం ఏర్ప‌ర్చుకున్న‌ది. ఇద్ద‌రూ క‌లిసి లైవ్ అట్యునేటెడ్ వాక్సిన్‌ను త‌యారు చేస్తున్నారు.  దీంతో వైర‌స్‌ను పూర్తిగా చంప‌లేక‌పోయినా.. దాని హాని‌క‌ర ల‌క్ష‌ణాల‌ను మాత్రం చంపేయ‌గ‌ల‌దు. ఏప్రిల్‌లో జంతువుల‌పై ట్ర‌య‌ల్స్ చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల సీరమ్ కంపెనీ సీఈవో తెలిపారు.  

హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ కూడా అమెరికాలోని విస్కాన్‌సిన్ మాడిస‌న్ వ‌ర్సిటీతో లింకు పెట్టుకున్న‌ది. ఫ్లూజెన్ కంపెనీతో జ‌త‌క‌లిసి సుమారు 300 మిలియ‌న్ల డోస్‌లు త‌యారు చేస్తున్నారు. జైడ‌స్ క్యాడిల్లా సంస్థ రెండు వ్యాక్సిన్ల‌పై వ‌ర్క్ చేస్తున్న‌ది.  బ‌యోలాజిక‌ల్ ఈ, ఇండియ‌న్ ఇమ్యూనోలాజిక‌ల్స్‌, మిన్‌వాక్స్ సంస్థ‌లు కూడా వ్యాక్సిన్ డెవ‌ల‌ప్ చేస్తున్నాయి.  వ్యాక్సిన్ ఉత్ప‌త్తిపై భారీ పెట్టుబ‌డులు పెట్టిన‌ భార‌తీయ ఫార్మ‌సీ కంపెనీల‌కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్ తెలిపారు. కానీ కోవిడ్‌19 నివార‌ణ‌కు ఇప్ప‌ట్లో వ్యాక్సిన్ రావ‌డం కష్ట‌మే అని కొంద‌రు సైంటిస్టులు చెబుతున్నారు.





logo