మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 14, 2020 , 02:43:12

సంప్రదాయ వైద్యం@ భారత్‌

సంప్రదాయ వైద్యం@ భారత్‌

  • మనదేశంలో సంప్రదాయ  వైద్యవిధానాల అంతర్జాతీయ కేంద్రం
  • ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 13: భారతీయుల జీవనవిధానంలో భాగమైన సంప్రదాయ వైద్య విధానం ఆయుర్వేదానికి విశ్వవ్యాప్త ప్రాధాన్యం లభించనున్నది. భారత్‌లో ‘సంప్రదాయ వైద్య విధానాల అంతర్జాతీయ కేంద్రం’ను ఏర్పాటుచేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. 5వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనమ్‌ గెబ్రియెసుస్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.   

ప్రజావైద్యానికి ఆయుర్వేదమే ఆధారం: టెడ్రోస్‌

‘డబ్ల్యూహెచ్‌వో సంప్రదాయ వైద్య వ్యూహం 2014-23’లో ఆయుర్వేద వైద్యం కీలకభూమిక పోషించనున్నదని టెడ్రోస్‌ తెలిపారు. ‘భారత్‌లో సంప్రదాయ వైద్యవిధానాల అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు చేయనున్నామని చెప్పటానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ కేంద్రం స్థాపనతో సంప్రదాయ వైద్య విధానాల్లో పరిశోధనలు, వైద్యులకు శిక్షణ, అవగాహన పెంచేందుకు అవకాశం లభిస్తుంది. ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య విధానాలు కీలకంగా మారనున్నాయి. ప్రజా కేంద్రిత సమీకృత వైద్య కార్యక్రమాలకు సంప్రదాయ వైద్య విధానాలే ఆధారం’ అని పేర్కొన్నారు. 

భారత్‌ ఇక ప్రపంచ ఆరోగ్యకేంద్రం: మోదీ

ఇప్పటివరకూ ప్రపంచ ఔషధాల ఉత్పత్తి కేంద్రంగా ఉన్న భారతదేశం, సంప్రదాయ వైద్యవిధానాల అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటుతో ప్రపంచ ఆరోగ్యకేంద్రంగా మారనున్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వపడాల్సిన సందర్భమని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వోకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జాతీయ ప్రాధాన్యత హోదాతో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేద (ఐటీఆర్‌ఏ)ను, జైపూర్‌లో డీమ్డ్‌ యూనివర్సిటీ హోదాతో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఎన్‌ఐఏ)లను ప్రధాని ప్రారంభించారు.