గురువారం 02 జూలై 2020
National - Jun 23, 2020 , 12:12:23

డెక్సామిథాసోన్ వాడకానికి ‌WHO అనుమ‌తి

డెక్సామిథాసోన్ వాడకానికి ‌WHO అనుమ‌తి

జెనీవా: ప‌్రపంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. క‌రోనా రోగులపాలిట సంజీవనిగా భావిస్తున్న స్టెరాయిడ్ డెక్సామిథాసోన్ వినియోగానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు డెక్సామిథాసోన్‌ ఉత్పత్తిని పెంచాలని సూచించింది. కరోనా వైరస్ తీవ్రంగా ప్ర‌భావం చూపిన‌ రోగులకు ఈ ఔషధాన్ని వాడటంవల్ల మరణాల సంఖ్య తగ్గుతుందని WHO తెలిపింది. 

జెనీవాలో జరిగిన ఒక వర్చువల్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన‌ ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గాబ్రియోస్.. బ్రిటిష్‌ ట్రయల్స్‌లో డెక్సామిథాసోన్‌ మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు నిరూపితమైంద‌న్నారు. అందుకే ఆ ఔష‌ధానికి డిమాండ్ బాగా పెరిగింద‌ని, అందువ‌ల్ల డెక్సామిథాసోన్‌ ఉత్పత్తిని వేగవంతం చేయాల‌ని ఆయన సూచించారు. గత వారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ బృందం నేతృత్వంలోని పరిశోధకులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రెండు వేల మంది రోగులకు డెక్సామిథాసోన్ ఇచ్చారు. ఇది మరణాల సంఖ్యను 35 శాతం తగ్గించింది. 

డెక్సామిథాసోన్‌పై పరిశోధనలు ఇంకా ప్రాథ‌మిక దశలోనే ఉన్నా ఈ ఔషధానికి కరోనా వైర‌స్ తీవ్రంగా ప్ర‌భావం చూపిన రోగుల ప్రాణాలను రక్షించే సామర్థ్యం ఉంద‌ని నిరూపిత‌మైంద‌ని, అందుకే ఈ ఔషధం వాడకానికి అనుమతిస్తున్నామ‌ని టెడ్రోస్‌ వెల్లడించారు. డెక్సామిథాసోన్ ఔషధ ఉత్పత్తిని పెంచడం, ప్రపంచవ్యాప్తంగా దీని అవసరమున్న దేశాలకు సమానంగా పంపిణీ చేయడం, ఎక్కువ అవసరమైన చోట ప్ర‌త్యేక దృష్టి సారించడం ఇప్పుడు మ‌న ముందున్న స‌వాళ్ల‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు.

డెక్సామిథాసోన్ 60 ఏండ్లుగా మార్కెట్లో ఉంది. ప్రస్తుతం కరోనాతో తీవ్రమైన అనారోగ్యానికి గురైన రోగులకు మాత్రమే డెక్సామిథాసోన్ వాడాలని WHO తెలిపింది. తేలికపాటి కరోనా లక్షణాలున్న రోగులకు, క‌రోనా నివార‌ణ‌కు ఎలాంటి ఆధారం లేదని, పైగా ఈ ఔష‌ధాన్ని అతిగా వాడితే దుష్ప్ర‌భావాలు క‌లిగించే అవ‌కాశం కూడా ఉందని టెడ్రోస్ హెచ్చరించారు. 


logo