శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 18:49:23

'ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు ముందు మోదీతో భేటీని మ‌రిచిపోను'

'ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు ముందు మోదీతో భేటీని మ‌రిచిపోను'

శ్రీన‌గ‌ర్: జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌త్యేక‌హోదాకు సంబంధించిన ఆర్టిక‌ల్ 370 ర‌ద్దున‌కు ముందు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో జ‌రిగిన స‌మావేశాన్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోన‌ని నేష‌‌‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఒమ‌ర్ అబ్దుల్లా  తెలిపారు. ఆ రోజున మోదీ త‌మ‌తో చెప్పిన‌దానికి అనంత‌రం 72 గంట‌ల్లో జ‌రిగిన ప‌రిణామాలు పూర్తి భిన్నమైన‌వ‌ని ఆయ‌న చెప్పారు. తాము ఏ అంశంపై ఆందోళ‌న చెందామో చివ‌రికి అదే జ‌రిగింద‌న్నారు. 2019 ఆగ‌స్టు 5న టీవీల్లో వ‌చ్చిన వార్త‌ల‌ను తాను ఇంకా న‌మ్మ‌లేక‌పోతున్న‌ట్లు ఒమ‌ర్ అబ్దుల్లా తెలిపారు. అనంత‌రం కొన్ని గంట‌ల త‌ర్వాత అర్థ‌రాత్రి వేళ త‌న‌ను గృహ నిర్బంధం చేశార‌ని, మ‌రునాడు ప్ర‌భుత్వ అతిథి గృహానికి త‌ర‌లించార‌ని వివ‌రించారు. ఆర్టికల్ 370ని పార్లమెంటు ద్వారా ర‌ద్దు చేసిన‌ప్పుడు చెప్పిన ఉగ్ర‌వాదం, పెట్టుబ‌డులు, మాన‌వ అభివృద్ధి సూచిక వంటి కార‌ణాల‌న్నీ ప్ర‌స్తుతం స‌మ‌ర్థ‌నీయంగా లేవ‌న్నారు.  

జమ్ముక‌శ్మీర్‌ ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌లో పాల్గొని దేశ అభివృద్ధిలో భాగ‌మైంద‌ని, అయితే ఇచ్చిన వాగ్దానం మాత్రం నిల‌బ‌డ‌లేద‌ని ఒమ‌ర్ అన్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌కు ఉన్న ప్ర‌త్యేక‌హోదాను తొల‌గించిన మోదీ ప్ర‌జాద‌ర‌ణ పొందార‌ని, అయితే దేశ సార్వ‌భౌమ క‌ట్టుబాటును నిల‌బెట్ట‌క‌పోవ‌డం స‌రికాద‌ని విమ‌ర్శించారు. గ‌త ఏడాది జ‌మ్ముక‌శ్మీర్‌పై పెద్ద నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన కార‌ణాలు ఏవీ కూడా  ప్రాథమిక పరిశీలన పరీక్షలో నిలువ‌లేక‌పోయాయ‌ని అన్నారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుకు ముందు ప్ర‌ధాని మోదీతో జ‌రిగిన భేటీని ఎప్ప‌టికీ మ‌రిచిపోలేన‌న్న ఆయ‌న త‌గిన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు దీనిపై పుస్త‌కం రాస్తాన‌ని చెప్పారు.

జ‌మ్ముక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి క‌ల్పించే ఆర్టిక‌ల్ 370ని కేంద్ర ప్ర‌భుత్వం గ‌త ఏడాది ఆగ‌స్టు 5న ర‌ద్దు చేయ‌డంతోపాటు ఆ రాష్ట్రాన్ని జ‌మ్ముక‌శ్మీర్‌, ల‌ఢ‌క్ కేంద్ర‌పాలిత ప్రాంతాలుగా విభ‌జించిన సంగ‌తి తెలిసిందే. ఇది జ‌రిగి ఏడాది కావోస్తున్న నేప‌థ్యంలో ఈ మేర‌కుఒమ‌ర్ అబ్దుల్లా స్పందించారు. జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం పేరుతో సుమారు 8 నెల‌ల‌పాటు గృహ నిర్బంధంలో ఉంచిన ఆయ‌నను ఈ ఏడాది మార్చి 24న విడుద‌ల చేశారు. ఆయ‌న తండ్రి, మాజీ సీఎం ఫ‌రూక్ అ‌బ్దులాను  కూడా ఈ చ‌ట్టం కింద కొన్ని నెల‌ల‌పాటు గృహ నిర్బంధంలో ఉంచి విడుద‌ల చేశారు. జ‌మ్ముక‌శ్మీర్ తాజా మాజీ సీఎం మెహ‌బూబా ముఫ్తీ ఇంకా గృహ నిర్బంధంలో కొన‌సాగుతున్నారు.logo