శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Oct 18, 2020 , 01:05:12

‘జిందగీ’ని గెలిచారు

‘జిందగీ’ని గెలిచారు

  • శిక్షణ తీసుకున్న  19 మందికీ నీట్‌లో అర్హత
  • పేద విద్యార్థుల కోసం ఒడిశా విద్యావేత్త కృషి

భువనేశ్వర్‌: వైద్యుడు కావాలన్న తన చిరకాల స్వప్నాన్ని ఆకలి, పేదరికం చిదిమేశాయి. డాక్టర్‌ కాలేకపోయినప్పటికీ, కఠోర దీక్షతో కష్టపడి ఉన్నత చదువులు చదివి విద్యావేత్తగా గుర్తింపు పొందారు అజయ్‌ బహదూర్‌ సింగ్‌. అయితే, తనలా వైద్యుడు కావాలనుకున్న ఏ పేద విద్యార్థి కలలు కూడా కల్లలు కాకూడదని ఆయన కోరుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా పేద విద్యార్థుల కోసం ఒడిశాలో ‘జిందగీ ఫౌండేషన్‌' పేరిట ఓ ఎన్జీవోను స్థాపించాడు. ‘జిందగీ ప్రోగ్రామ్‌' పేరిట ఏటా పరిమిత సంఖ్యలో పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణను ఇవ్వడం ప్రారంభించాడు. ఆయన గురి తప్పలేదు. శుక్రవారం విడుదలైన నీట్‌ ఫలితాల్లో జిందగీ కోచింగ్‌ సెంటర్‌ నుంచి పరీక్ష రాసిన 19 మంది విద్యార్థులూ అర్హత సాధించారు. తన ఆకాంక్షలను విద్యార్థులు వాస్తవ రూపంలోకి తీసుకొస్తున్నారని అజయ్‌ పేర్కొన్నారు.