సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 02:16:53

అతివా.. అందుకో

అతివా.. అందుకో
  • మహిళా దినోత్సవం నాడు స్ఫూర్తిదాయక మహిళలకు
  • సోషల్‌మీడియా ఖాతాలిచ్చేస్తా
  • అలాంటి నారీమణుల కథనాలు పంపండి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, మార్చి 3: సమాజానికి స్ఫూర్తినిచ్చే మహిళలకు తన సోషల్‌మీడియా ఖాతాలను అప్పగిస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘మనకు ఏ మహిళ జీవితం, పని స్ఫూర్తినిస్తున్నదో ఆమెకు ఈ మహిళా దినోత్సవాన (ఈ నెల 8వ తేదీ) సోషల్‌మీడియా ఖాతాలను ఇచ్చేస్తా. ఇది లక్షలమందిలో ప్రేరణ కలిగించేందుకు వారికి తోడ్పడుతుంది. మీరు అలాంటి మహిళా? లేదా అలాంటి స్ఫూర్తిదాయక మహిళలు మీకు తెలుసా? స్ఫూర్తినిచ్చే అతివల కథనాలను షేర్‌ చేయండి’ అంటూ మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘ఈ ఆదివారం.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ ఖాతాల నుంచి వైదొలగాలని భావిస్తున్నా’ అని మోదీ సోమవారం చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 


ఆటలొద్దు.. కరోనా వైరస్‌పై దృష్టిపెట్టండి: రాహుల్‌గాంధీ

దేశంలో మరో రెండు కరోనా కేసులు నమోదుకావడంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ‘దేశం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటుండగా.. ప్రధాని మోదీ సోషల్‌మీడియా ఖాతాలతో పరిహాసమాడుతూ దేశ సమయాన్ని వృథా చేయడం ఆపాలి. దేశంలోని ప్రతి పౌరుడు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేలా సిద్ధంచేయడంపై దృష్టిపెట్టండి’ అని ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో సూచిస్తూ సింగపూర్‌ ప్రధాని లీ హెచ్‌సీన్‌ లూంగ్‌ ఆ దేశ ప్రజలకు చేసిన వీడియో సందేశాన్ని సైతం రాహుల్‌ ట్విట్‌ చేస్తూ.. ‘ఇక్కడ ఇది ఎలా జరిగింది’ అని పేర్కొన్నారు. ‘ప్రతి దేశంలో అక్కడి నాయకులను పరీక్షించే కొన్ని సందర్భాలు వస్తాయి. అసలైన నాయకుడు.. దేశాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ భారీ సంక్షోభాన్ని సృష్టిస్తున్న వైరస్‌ను అరికట్టడంపై దృష్టిపెడతారు’ అని ట్వీట్‌చేశారు. 

ప్రశంసనీయం.. కాదు జిమ్మిక్కు!

స్ఫూర్తిదాయక మహిళలకు తన సోషల్‌ మీడియా ఖాతాలను ఇచ్చేస్తానన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటనపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొందరు మహిళా కార్యకర్తలు ప్రశంసించగా, మరికొందరు ఇది జిమ్మిక్కు అని వ్యాఖ్యానించారు. స్ఫూర్తి దాయక మహిళలకు సోషల్‌ మీడియా ఖాతాలను అప్పగించడానికి బదులు వారికి నిజమైన సాధికారత కల్పించడంపై మోదీ దృష్టి పెట్టాలని సూచించారు. 


logo