శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 11:15:27

మంత్రిపై లైంగిక దాడి ఆరోపణలు.. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న మహిళ

మంత్రిపై లైంగిక దాడి ఆరోపణలు.. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న మహిళ

ముంబై : మహారాష్ట్ర కేబినెట్‌ మంత్రి ధనంజయ్‌ ముండేపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన మహిళ తన ఫిర్యాదును ఉపసంహరించుకుందని శుక్రవారం ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. అయితే సదరు మహిళ ముండేపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు కేసును దర్యాప్తు చేస్తున్న అధికారికి తెలిపిందని, అయితే కారణాలు మాత్రం వెల్లడించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు నోటరితో కూడిన అఫిడవిట్‌ సమర్పించాలని సదరు మహిళకు సూచించినట్లు చెప్పారు. కాగా, సదరు మహిళ ధనంజయ్‌ తనను 2006లో పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా దాడి చేసి, వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకు మహిళ ముందు వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు ఓషివారా పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. అయితే బీడ్‌ జిల్లాకు చెందిన ఎన్‌సీపీ సీనియర్‌ నేత, మంత్రి అయిన ధనంజయ్‌ ముండే ఆరోపణలను ఖండించారు. బ్లాక్‌ మెయిల్‌ చేసే ప్రయత్నమని.. అయితే, ఫిర్యాదు చేసిన మహిళ సోదరితో తనకు సంబంధం ఉందని మంత్రి అంగీకరించారు. లైంగిక దాడి ఆరోపణలపై ప్రతిపక్ష బీజేపీ ముండే రాజీనామాకు డిమాండ్‌ చేసింది. ఆరోపణలు రుజువు అయ్యేవరకు ఎలాంటి చర్యలు తీసుకోమని ఎన్‌సీపీ తోసిపుచ్చింది.

VIDEOS

logo