మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 09:06:35

తల్లీకుమారుడికి కరోనా పాజిటివ్‌

తల్లీకుమారుడికి కరోనా పాజిటివ్‌

నోయిడా : ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్‌ నోయిడాలో నివాసముంటున్న తల్లీకుమారుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 37 ఏళ్ల వ్యక్తి మార్చి 9న డెన్మార్క్‌ నుంచి ఢిల్లీకి వచ్చాడు. అప్పుడు బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఆ వ్యక్తి తల్లి(62)కి మొదట కరోనా లక్షణాలు ఉండడంతో మార్చి 19న ఆస్పత్రికి వెళ్లి ఇద్దరూ టెస్ట్‌ చేయించుకున్నారు. ఫలితాల్లో వారిద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇద్దరూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ కుటుంబానికి చెందిన మరో ఇద్దరు స్వీయ నియంత్రణలో ఉన్నారు. నోయిడాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. 

భారతదేశం వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 396కు చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే 64 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 74, కేరళలో 64, ఢిల్లీలో 30, రాజస్థాన్‌లో 28, తెలంగాణలో 27, ఉత్తరప్రదేశ్‌లో 27, కర్ణాటకలో 26, గుజరాత్‌లో 18, మధ్యప్రదేశ్‌లో 6, ఆంధ్రప్రదేశ్‌లో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 6 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ కట్టడికి పలు రాష్ర్టాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అన్ని రైళ్లతో పాటు అంతర్‌ రాష్ట్ర బస్సులను నిలిపివేశారు. అన్ని రాష్ర్టాల్లో ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. 


logo