బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 12:33:56

భర్తను చంపేసి.. కరోనాతో చనిపోయాడని నమ్మించిన భార్య

భర్తను చంపేసి.. కరోనాతో చనిపోయాడని నమ్మించిన భార్య

న్యూఢిల్లీ : ఓ భార్య దుర్మార్గపు చర్యకు పాల్పడింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి.. కరోనాతో చనిపోయాడని నమ్మించింది. కానీ పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి చంపారని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని అశోక్‌ విహార్‌లో మే 1వ తేదీ రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

అశోక్‌ విహార్‌కు చెందిన శరత్‌ దాస్‌(46), అనిత(30) దంపతులు. ఓ చిన్న దుకాణాన్ని శరత్‌ నిర్వహిస్తున్నాడు. అయితే అనితకు సంజయ్‌ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం శరత్‌కు తెలిసి పలుమార్లు భార్యను మందలించాడు. శరత్‌, అనిత మధ్య గొడవలు కూడా జరిగాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్తను అంతమొందించాలని అనిత నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో మే 1వ తేదీ రాత్రి తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న శరత్‌ ముఖంపై దిండు పెట్టి, గొంతు నులిమి చంపేశారు. మే 2వ తేదీ తెల్లవారుజామున తన భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాడని తమ పొరుగింటి వారికి అనిత చెప్పింది. కరోనా వైరస్‌తో తన భర్త చనిపోయాడని నమ్మించింది. 

మొత్తానికి విషయం పోలీసులకు తెలియడంతో.. వారు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. శరత్‌కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఆరోగ్యంగా ఉన్నట్లు విచారణలో తేలింది. అనిత కూడా సరైన సమాధానాలు చెప్పకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. శరత్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా గొంతు నులిమి చంపినట్లు తేలింది. అప్పుడు అనిత చేసిన నేరాన్ని ఒప్పుకుంది. తన ప్రియుడు సంజయ్‌తో కలిసి శరత్‌ను హత్య చేసినట్లు నిందితురాలు అంగీకరించింది. అనిత మాటలు విన్న స్థానికులు, పోలీసులు షాక్‌కు గురయ్యారు. logo