లక్నో: మానసిక స్థితి సరిగా లేని మహిళను, మహిళా పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ( Woman dragged on road by UP cops) ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆమె పట్ల ఇలా వ్యవహరించడంపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మానసిక స్థితి సరిగా లేని ఒక మహిళ, ఆమె భర్త మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భర్తపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి ఆమె వెళ్లింది. అయితే అక్కడ ఉన్న గోడ ఎక్కేందుకు ప్రయత్నించింది.
కాగా, గమనించిన ఇద్దరు మహిళా పోలీసులు ఆ మహిళ వద్దకు వెళ్లారు. ఆమెను అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఈ సందర్భంగా ఆ మహిళ రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ మహిళా కానిస్టేబుళ్లు ఆమె రెండు చేతులు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. అక్కడున్న కొందరు దీనిని రికార్డ్ చేయడంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.