సోమవారం 13 జూలై 2020
National - Jun 26, 2020 , 16:18:04

30 ఏళ్లుగా ఆడ.. పరీక్షిస్తే మగ

30 ఏళ్లుగా ఆడ.. పరీక్షిస్తే మగ

కోల్‌కతా : ఆమె ఆడ కాదు.. మ‌గ‌.. ఇది నిజ‌మే! ఆమెకు అన్ని స్ర్తీ ల‌క్ష‌ణాలే ఉన్నాయి. గ‌త 30 సంవ‌త్స‌రాల నుంచి.. ఆమె ఎటువంటి స‌మ‌స్య‌లు లేకుండా సాధార‌ణ జీవితాన్ని గ‌డిపింది. ఇటీవ‌లే ఆ మ‌హిళ‌కు క‌డుపులో తీవ్ర‌మైన నొప్పి రావ‌డంతో.. వైద్యుల‌ను సంప్ర‌దించింది. ఆ త‌ర్వాత ఆమె వృషణ క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న‌ట్లు డాక్ట‌ర్లు గుర్తించారు. 22 వేల మందిలో ఒక‌రికి ఇలాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మవుతాయ‌ని వైద్యులు తెలిపారు. 

బెంగాల్ లోని బీర్భంకు చెందిన ఓ మ‌హిళ‌కు ఇప్పుడు 30 ఏండ్లు. ఆమెకు తొమ్మిదేండ్ల క్రితం వివాహ‌మైంది. కొద్ది రోజుల క్రితం మ‌హిళ‌కు పొత్తి క‌డుపు కింది భాగంలో తీవ్ర‌మైన నొప్పి రావ‌డంతో.. కోల్ క‌తాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్స‌ర్ ఆస్ప‌త్రికి వెళ్లింది. అక్క‌డ ఆమెకు వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. వృషణ క్యాన్స‌ర్ గా గుర్తించారు. దీంతో డాక్ట‌ర్లు షాక్ అయ్యారు. ఆమె ఆడ కాదు.. మ‌గ అని గుర్తించారు. 

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ ద‌త్తా మాట్లాడుతూ.. ఆమె పుట్టుక‌తోనే ఆడ‌బిడ్డ‌గా జ‌న్మించింది. ఆమె స్వ‌రం కూడా మ‌హిళ గొంతే. వ‌క్షోజాలు అభివృద్ధి చెందాయి. సాధార‌ణ బాహ్య జ‌న‌నేంద్రియాలు కూడా స్ర్తీవే. కానీ ఆమె క‌డుపులో గ‌ర్భాశ‌యం, అండాశ‌యాల అభివృద్ధి మాత్రం జ‌ర‌గ‌డం లేదు. ఇవి పుట్టుక‌తోనే లేవు. ఇక రుతుస్రావం కూడా రావ‌డం లేదు ఆమెకు. 

ఆమె పొత్తి క‌డుపు కింది భాగంలో నొప్పి వ‌స్తుంద‌ని ఆస్ప‌త్రికి వ‌చ్చిన‌ప్ప‌డు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాము. బాధితురాలి శ‌రీరంలో వృష‌ణాలు గుర్తించాము. ఆ వృష‌ణాలు అభివృద్ధి చెంద‌లేదు. దాంతో టెస్టోస్టీరాన్ హార్మోన్ కూడా ఉత్ప‌త్తి కాలేదు. ఆమెలో అభివృద్ధి చెందిన ప్రొజెస్టీరాన్, ఇత‌ర హార్మోన్ల వ‌ల్ల ఆడ రూపం వ‌చ్చింద‌న్నారు. వృషణ క్యాన్స‌ర్ కార‌ణంగా నొప్పి వ‌చ్చిన‌ట్లు నిర్ధారించాము అని డాక్ట‌ర్ ద‌త్తా తెలిపారు. ప్ర‌స్తుతం ఆమె కీమోథెర‌పీ చేయించుకుంటుంది. ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. 

బాధిత మ‌హిళ‌కు పెళ్లి అయిన‌ప్ప‌టి నుంచి సంతానం కోసం ప్ర‌య‌త్నించారు. కానీ విఫ‌ల‌మ‌య్యారు. ఇప్పుడు భార్యాభ‌ర్త‌లిద్ద‌రికి కౌన్సెలింగ్ ఇస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. 

ఈ ప‌రిణామాల త‌ర్వాత‌.. బాధితురాలి సోద‌రి(28) కూడా అవ‌స‌ర‌మైన ప‌రీక్ష‌లు చేయించుకుంది. ఆమెలో కూడా ఆండ్రోజెన్ ఇన్సెన్సిటీవిటీ సిండ్రోమ్ ఉన్న‌ట్లు గుర్తించారు. ఇది జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌. మ‌గ‌వాడు కానీ స్ర్తీ యొక్క అన్ని శారీర‌క ల‌క్ష‌ణాలు క‌లిగి ఉంటార‌ని డాక్ట‌ర్లు చెప్పారు.  బాధితురాలి ఇద్ద‌రు అత్త‌మామ‌లు(అమ్మ త‌రపు) కూడా ఇదే స‌మ‌స్య‌ను క‌లిగి ఉన్న‌ట్లు వైద్యులు క‌నుగొన్నారు. 


logo