సోమవారం 30 మార్చి 2020
National - Feb 21, 2020 , 02:52:31

ఒవైసీ సభలో పాక్‌ అనుకూల నినాదాలు

ఒవైసీ సభలో పాక్‌ అనుకూల నినాదాలు
  • తీవ్రంగా ఖండించిన ఎంఐఎం అధినేత

బెంగళూరు, ఫిబ్రవరి 20: కర్ణాటకలోని బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్న నిరసన సభలో ఓ యువతి ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. ‘రాజ్యాంగాన్ని పరిరక్షించండి’ అన్న పేరుతో గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదికపైకి వచ్చిన సదరు యువతి ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేయడంతో ఒవైసీ వెంటనే అప్రమత్తమై ఆమె నుంచి మైకును లాక్కున్నారు. ఆ యువతి చర్యను ఖండించిన ఆయన, తనకు లేదా తన పార్టీకి ఆమె వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తామంతా భారత్‌ వైపే ఉంటామని, శత్రు దేశమైన పాక్‌కు ఎప్పుడూ మద్దతు ఇవ్వబోమన్నారు. దేశాన్ని రక్షించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కూడా యువతి తీరును తప్పుపట్టింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఆ యువతిని అమూల్య లియోనాగా గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. 


logo