శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 16:59:48

కరోనా ఫ్రీ రాజాజీనగర్‌!

కరోనా ఫ్రీ రాజాజీనగర్‌!

తిరువనంతపురం :  కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నగరం నడిబొడ్డున రద్దీగా ఉండే రాజాజీనగర్‌ వాసులు కరోనాపై పోరాడుతున్నారు. స్థానికులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు, ఆరోగ్య కార్యకర్తలు, నగర కార్పొరేషన్‌ సమర్థవంతమైన జోక్యంతో వైరస్‌ను దూరంగా ఉంచగలిగారు. ఇక్కడున్న 1200 నివాసాల్లో ఏ ఒక్కరినీ కూడా సోమవారం వరకు పాజిటివ్‌గా పరీక్షించ లేదు. రాజాజీనగర్‌ వాసులు తమ ప్రాంతంలోకి బయటి వ్యక్తులు రాకుండా నిషేధం విధించారు. ఈ ప్రాంతం పరిధిలోకి వచ్చేందుకు ఏడు మార్గాలుండగా అన్నింటినీ మూసివేసి, అక్కడ నిషేధంపై పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా టంపనూర్‌ వార్డు కౌన్సిలర్‌ ఎంవీ జయలక్ష్మి మాట్లాడుతూ వైరస్‌ ముప్పు గురించి స్థానికులకు నచ్చచెప్పడం మొదట్లో చాలా కష్టమైందని చెప్పారు. సోషల్‌ డిస్టెన్స్‌ తదితర విషయాలపై అవగాహన కల్పిస్తే వ్యతిరేక స్వరాలు వినిపించాయన్నారు.

అయితే స్థానిక యువకులు ఐక్యం కావడంతో పరిస్థితులు మారిపోయాయని, వారంతా ప్రజలకు వైరస్‌ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు ఇచ్చారన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్‌కు చెందిన ఆశ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు నిత్యం కాలనీని సందర్శిస్తారని, పరిణామాలపై అప్రమత్తం చేస్తారని చెప్పారు. ‘సామాజిక దూరం, ఇతర భద్రతా చర్యలను అతిక్రమించే వారికి హెచ్చరికలు చేస్తామని, అలాగే స్థానికుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు స్పందిస్తానని’ జయలక్ష్మి తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల మద్దతు అన్ని కుటుంబాలకు కార్పొరేషన్‌ మాస్క్‌లు పంపిణీ చేసింది. సుమారు 11.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండే రాజాజీనగర్‌లో 3500 మంది ఓటర్లు ఉన్నారు.

కొవిడ్‌-19 వ్యతిరేకంగా పని చేస్తున్న యువజట్టులోని సభ్యుడు ఏజీ శరత్‌ తెలిపిన మాట్లాడుతూ ‘అందరు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ ధరించడం ఇప్పుడు అలవాటుగా మారిందని చెప్పారు. ముఖ్యంగా పెద్దలను ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సలహా ఇచ్చామని తెలిపారు. చాలా కుటుంబాలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తారని, కానీ వారంతా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. ఇప్పటి వరకు 10 మంది వ్యక్తులు ఇతర ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా క్వారంటైన్‌కు వెళ్లారని తెలిపారు. వీరిలో కొందరు చేపల విక్రయదారులు కుమరిచంత మార్కెట్‌కు వెళ్లారని పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 13,274 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, 7611 యాక్టివ్‌ కేసులున్నాయి. 5,616 మంది కోలుకోగా, 43 మంది వైరస్‌తో మృతి చెందారు.logo