బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 09, 2020 , 18:21:35

మూడు ప్రాంతాల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గిన చైనా ఆర్మీ

మూడు ప్రాంతాల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గిన చైనా ఆర్మీ

న్యూఢిల్లీ: లఢక్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి మూడు కీలక ప్రాంతాల నుంచి చైనా ఆర్మీ పూర్తిగా వెనక్కి తగ్గింది. బలగాల ఉపసంహరణలో భాగంగా గల్వాన్, హాట్ స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల నుంచి గురువారం పూర్తిగా వైదొలగినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తున్నది. జూన్ 30న ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల్లో భాగంగా గాల్వన్ నది ప్రాంతం పరిధిలోని వాస్తవాధీనరేఖకు ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర బఫర్ జోన్‌గా ఉంచాలని నిర్ణయించారు. దీంతో ఆ మేరకు ఇరు దేశాలు తమ సైన్యాన్ని వెనక్కి మళ్లిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద ఉన్న శిబిరాలను పూర్తిగాను, ఫింగర్ 4,  పాంగాంగ్ త్సో ప్రాంతాల్లోని శిబిరాలను పాక్షికంగాను చైనా తొలగించింది. పెట్రోలింగ్ పాయింట్ 15, హాట్ స్ప్రింగ్స్ సెక్టార్ నుంచి రెండు కిలోమీటర్ల మేర వెనక్కివెళ్లింది. అయితే లేక్ ఏరియాలో కొన్ని సైనిక శిబిరాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. వీటి తొలగింపుపై చైనా ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. 

చైనా-ఇండియా సరిహద్దు అంశంలో ప్రత్యేక ప్రతినిధులుగా నియమితులైన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య గత ఆదివారం టెలీఫోన్ సంభాషణతోపాటు వీడియో కాల్ ద్వారా మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు సరిహద్దుల వద్ద నుంచి వీలైనంత తొందరగా ఆర్మీని వెనక్కిమళ్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇరు దేశాల సైనిక బలగాలను వాస్తవాధీన రేఖ నుంచి మూడు కిలోమీటర్ల అవతలకు మళ్లిస్తున్నారు.

 


logo