సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 03, 2020 , 19:11:29

విప్రో ఉద్యోగులు వచ్చే ఏడాదే ఆఫీస్ కు వచ్చేది...!

విప్రో ఉద్యోగులు వచ్చే ఏడాదే ఆఫీస్ కు వచ్చేది...!

బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో సంస్థ వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్, అమెరికాలో పని చేస్తున్న ఎంప్లాయీస్ అంతా 2021 జనవరి18, వరకు ఇంటి నుంచే పని చేయాలని తెలిపింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు కూడా వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కు అవకాశం ఇచ్చాయి.

టాటా స్టీల్ కూడా వైట్ కాలర్ ఉద్యోగులకు తాజాగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇచ్చింది. విప్రో కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ గడువును పొడిగించింది. లాక్ డౌన్ సమయంలో 95 శాతానికి పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేశారు. అన్-లాక్ నేపథ్యంలో ప్రస్తుతం 75 శాతం వరకు ఉద్యోగులు ఇంటి నుండి వర్క్ చేస్తున్నారు. కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కరోనా రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనల నేపథ్యంలో ఇంటి నుండి పనిని పొడిగిస్తున్నాయి.

విప్రోలో 1,85,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది భారత దేశంలో పనిచేస్తుండగా, కొంతమంది ఉద్యోగులు విదేశాల్లో ఉన్నారు. భారత్, అమెరికాలో ఉన్న ఉద్యోగులు అందరూ వచ్చే ఏడాది వరకు ఇంటి నుండి పని చేయాలని సూచించింది. కంపెనీ ఉద్యోగుల్లో ప్రతి పదిమందిలో తొమ్మిది మంది ఈ రెండు దేశాలకు చెందినవారు. ప్రస్తుతం ఏ ప్రాజెక్టులో లేని ఉద్యోగులతో సహా సపోర్టింగ్, నాన్-బిల్లబుల్ ఉద్యోగులు అందరు కూడా సంబంధిత మేనేజర్లను సంప్రదించి ఇంటి నుండి పని చేయవచ్చునని టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ తెలిపింది.

అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించి వివరాలను ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా పంపించింది. ఇతర దేశాలకు చెందిన ఉద్యోగుల పని అంశానికి సంబంధించి కూడా ఆయా దేశాల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత తమకు తొలి ప్రాధాన్యమని పేర్కొన్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.