శనివారం 16 జనవరి 2021
National - Dec 17, 2020 , 13:45:40

చర్చ నుంచి తప్పించుకునేందుకు పార్లమెంట్‌ సమావేశాల రద్దు : శివసేన

చర్చ నుంచి తప్పించుకునేందుకు పార్లమెంట్‌ సమావేశాల రద్దు : శివసేన

ముంబై : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను నిర్వహించకూడదని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై శివసేన తీవ్ర విమర్శలు చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన, దేశ ఆర్థిక పరిస్థితి, చైనాతో సరిహద్దు వివాదం వంటి తదితర అంశాలపై చర్చను తప్పించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుందని ఆరోపించింది. ప్రతిపక్షాలకు ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకుండా సమావేశాలు రద్దు చేశారంటూ శివసేన తన మౌత్‌పీస్‌ సామ్నా తన సంపాదకీయంలో విమర్శించింది. ఇది ఏ ప్రజాస్వామ్య అభ్యాసం ? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల నుంచి స్వరాలు బలంగా ఉంటేనే దేశం సజీవంగా ఉంటుందని పేర్కొంది. పార్లమెంట్‌లో ప్రజాస్వామ్య సంప్రదాయాలు దేశానికి స్ఫూర్తినిస్తాయని, ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంప్రదాయాలను తప్పక పాటించాలని సూచించింది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్‌ శీతాకాలు సమావేశాలు జరుగవని, బడ్జెట్‌ సమావేశాలను 2021 జనవరిలో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల కేంద్రం తెలిపిన విషయం విధితమే. ‘కరోనా మహమ్మారి ఎన్నికలనే ఆపలేదని, ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశం.. కానీ పార్లమెంట్‌ నాలుగు రోజుల శీతాకాల సమావేశాలను అనుమతించం’ అనడంపై విమర్శలు గుప్పించింది.

అమెరికా ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించిందని, ఇది సూపర్ పవర్ ప్రజాస్వామ్యం అని పేర్కొంది. కొవిడ్‌ కారణంగా మహారాష్ట్ర శాసనసభ సమావేశాల రెండు రోజులే నిర్వహించడంపై బీజేపీ రాష్ట్ర యూనిట్‌ చేసిన విమర్శలను సైతం ప్రస్తావించింది. ప్రజాస్వామ్యంపై ఆ పార్టీ అభిప్రాయాలు ‘దాని సౌలభ్యం ప్రకారం’ మారుతాయని విమర్శించింది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్‌ పర్యటనను సైతం ప్రస్తావించింది. దేవాలయాలను తిరిగి తెరవాలని బీజేపీ (మహారాష్ట్ర) నేతలు అనేక సార్లు వీధుల్లోకి వచ్చారని.. కానీ ప్రజాస్వామ్యం అత్యున్నత ఆలయాన్ని తెరవకపోవడంపై వైఖరిని చెప్పాలని డిమాండ్‌ చేసింది. కరోనాకు భయపడి పార్లమెంట్‌కు లాక్‌ వేస్తే.. ఈ నిబంధన దాని ఒక్కదానికే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించింది. సరిహద్దులో మోహరించిన జవాన్లు కూడా కొవిడ్-19 కారణంగా స్వస్థలాలకు తిరిగి రావాలా? అనే దానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసింది. కరోనాతో లోక్‌సభ ‘లాక్‌’ చేయాల్సి వస్తే కొత్త పార్లమెంట్‌ భవనం ఎందుకు నిర్మిస్తున్నారని, ఎందుకు రూ.900 కోట్లు ఖర్చు చేస్తున్నారని, తాళం వేసేందుకేనా? అంటూ ప్రశ్నించింది.