మంగళవారం 02 మార్చి 2021
National - Jan 17, 2021 , 17:49:31

.. ఆ ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుకుంటాం : సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

.. ఆ ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుకుంటాం : సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఆక్రమించిన మరాఠ మాట్లాడే ప్రాంతాలను తిరిగి తమ రాష్ట్రంలో కలుపుకుంటామని అన్నారు. ఇదే అమరులకు తామిచ్చే  నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ‘కర్ణాటక ఆక్రమించిన మహారాష్ట్ర భాషా, సంస్కృతితో ముడిపడి ఉన్న ప్రాంతాలను వెనక్కు తెస్తాం. సరిహద్దు వివాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఇదే తామిచ్చే నిజమైన నివాళి. ఇందుకోసం ఐక్యంగా కట్టుబడి పనిచేస్తాం. అమరుల గౌరవార్థం ఇదే వారికి మా వాగ్దానం’ అని సీఎం కార్యాలయం ట్విట్టర్‌లో పేర్కొంది.  

ఇది వివాద నేపథ్యం..

గతంలో ముంబై ప్రెసిడెన్సీలోని బెల్గామ్‌తోపాటు ఇతర ప్రాంతాలు ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్నాయి. భాషా ప్రాతిపదికన వీటిని మహారాష్ట్రంలో కలపాలని దశాబ్దాలుగా డిమాండ్‌ వినిపిస్తున్నది. బెల్గామ్‌తోపాటు పలు ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ప్రాంతీయ సంస్థ) 1956లో పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఈ పోరాటంలో జనవరి 17న పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీరి త్యాగానికి గుర్తుగా యేటా జనవరి 17ను మహారాష్ట్ర ప్రభుత్వం అమరుల దినోత్సవంగా నిర్వహిస్తున్నది.

కర్ణాటక- మహారాష్ట్ర మధ్య ఏండ్లుగా సరిహద్దు వివాదం నడుస్తున్నది.  బెల్గామ్‌తోపాటు పలు సరిహద్దు ప్రాంతాలపై సుప్రీం కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సరిహద్దు వివాద కేసు సంబంధ విషయాలను పర్యవేక్షించేందుకు మంత్రులు ఏక్‌నాథ్‌ షిండే, ఛాగన్‌ భుజ్‌బల్‌ను సీఎం ఉద్దవ్‌ ఠాక్రే గతేడాది కో- కోఆర్డినేటర్లుగా నియమించిన విషయం తెలిసిందే.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo