శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 03, 2021 , 21:57:26

వ్యవసాయ చట్టాలపై కేంద్రం మొండితనం వీడాలి

వ్యవసాయ చట్టాలపై కేంద్రం మొండితనం వీడాలి

న్యూఢిల్లీ: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం మొండితనాన్ని వీడాలని రైతు సంఘాలు ఆదివారం స్పష్టం చేశాయి. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే తమ ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. గతేడాది నవంబర్‌ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘ్రూ వద్ద రైతులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. రైతు సంఘం నేత మంజిత్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన లోహ్రీ వద్ద నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను తగుల బెడతామని చెప్పారు.

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా జనవరి 23వ తేదీని ‘కిసాన్‌ దివస్‌’గా పాటిస్తామని మంజిత్‌ సింగ్‌ వెల్లడించారు. మరో రైతు నేత ఒంకార్‌ సింగ్‌ మాట్లాడుతూ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం తన మొండితనాన్ని వీడాలని కోరారు. ఎముకలు కొరికే చలిలోనూ రైతులు నిర్వహిస్తున్న ఆందోళన పట్ల కేంద్రం ఉదాశీనత ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. రైతులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వ ఉదాసీన వైఖరి నిరాశ కలిగిస్తున్నదన్నారు. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించకపోతే మరికొంత మంది రైతులు చలిని భరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సోమవారం కేంద్ర ప్రభుత్వంతో జరిగే చర్చల్లో చట్టాలను రద్దు చేయాలన్న ఏకైక డిమాండ్‌ అమలుకు పట్టుబడతామన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo