గురువారం 04 జూన్ 2020
National - May 12, 2020 , 16:21:22

భర్తపై భార్య అపనిందలు క్రూరత్వమే అంటూ విడాకులు మంజూరు

భర్తపై భార్య అపనిందలు క్రూరత్వమే అంటూ విడాకులు మంజూరు

ముంబై: భర్తపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అతడు పనిచేసే ఆఫీసు యజమానికి లేఖ రాయడం క్రూరత్వం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. సదరు భర్తకు హిందూ వివాహ చట్టం (1955) కింద విడాకులు మంజూరు చేసింది. ఆ చట్టంలోని 13(1) సెక్షన్‌లో క్రూరత్వాన్ని విడాకులకు ఓ కారణంగా చూపడాన్ని న్యాయమూర్తులు వీఎం దేశపాండే, ఎస్ఎం మోదక్‌లతో కూడిన ధర్మాసనం ఉదహరించింది. ఆ దంపతులకు 1993 మేలో వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కలిగారు. 2006 మేలో భార్య ఉన్నట్టుండి పుట్టింటికి వెళ్లిపోవడంతో వారిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ 2008లో నాలుగురోజులు పుట్టింటికి వెళ్లివచ్చిన భార్య ఆ సమయానికి భర్త ఇంటివద్ద లేని కారణంగా ఇంటి తాళాలు బద్దలు కొట్టించింది. అంతేకాకుండా భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ అతని కంపెనీ యాజమాన్యానికి లేఖ రాసింది. కొద్దిరోజుల తర్వాత భర్త విడాకుల కోసం నాగ్‌పూర్‌లోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 2012లో ఆ కోర్టు విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించడంతో భర్త బాంబే హైకోర్టుకు వెళ్లాడు. జీవిత భాగస్వామిపై ఆరోపణలు చేసి, వాటిని రుజువు చేయలేకపోతే అది క్రూరత్వం కిందకే వస్తుందని అభిప్రాయపడ్డ కోర్టు విడాకులు మంజూరు చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం, ముఖ్యంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం క్రూరత్వమేనని, ఆ కారణంగా విడాకులు మంజూరు చేయొచ్చని చట్టం చెప్పిందని కోర్టు స్పష్టం చేసింది. 


logo