శనివారం 11 జూలై 2020
National - Jun 17, 2020 , 10:08:15

వ్యూహాలకు అడ్డా ‘గాల్వాన్‌'

వ్యూహాలకు అడ్డా ‘గాల్వాన్‌'

తూర్పు లఢక్‌లో  ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాలకు చెందిన సైనిక అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలో.. గాల్వాన్‌ లోయలో భారత జవాన్లపై చైనా దళాలు దాడి చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో గాల్వాన్‌ లోయపై పట్టుకోసం చైనా ఎందుకు అంత ఉత్సుకత చూపుతున్నదన్న చర్చలు ఊపందుకున్నాయి. 

1962లో నిప్పు రాజేసింది

1962లో భారత్‌-చైనా మధ్య యుద్ధం జరిగింది. దీనికి బీజం వేసింది జీ219 రోడ్డు నిర్మాణం. తమ దేశంలోని జిన్‌జియాంగ్‌ నుంచి టిబెట్‌కు చైనా 179 కిలోమీటర్ల పొడువుతో ఈ రోడ్డు నిర్మించింది. అయితే, ఈ మార్గం భారత్‌లోని అక్సాయి చిన్‌ ప్రాంతం గుండా పోతున్నది. భారత్‌ సమ్మతి తీసుకోకుండానే చైనా ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. ఆ తర్వాత రోడ్డు మార్గం ఉన్న ప్రాంతమంతా తమదేనని ప్రకటించింది. యుద్దం ముగిసిన తర్వాత మరికొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించింది. 

చెక్‌ పెడుతున్న గాల్వాన్‌ లోయ

ఎత్తైన భూభాగాలు, పర్వత ప్రాంతాలను అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకున్న చైనా.. ఎల్‌ఏసీ గుండా పటిష్ఠ నిఘాను ఏర్పాటు చేసింది. అయితే, పశ్చిమ వైపునకు వెళ్తున్న క్రమంలో గాల్వాన్‌ నది పరీవాహక ప్రాంతాల్లో ఎల్‌ఏసీ అతి తక్కువ ఎత్తులో ఉంటున్నది. ఇక్కడే గాల్వాన్‌ లోయ ఉన్నది. ఎత్తు తక్కువగా ఉన్న ఈ లోయ గుండా భారత బలగాలు సులభంగా అక్సాయి చిన్‌ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఇది చైనాకు కునుకు లేకుండా చేస్తున్నది. దీంతో తూర్పు లఢక్‌లోని గాల్వాన్‌ లోయ ప్రాంతంపై తన పట్టును నిలుపుకోవాలని చైనా ప్రయత్నిస్తున్నది. గాల్వాన్‌ సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో తన దళాలను మోహరించేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఈ ప్రాంతాలపై చైనా దళాలు దాడులకు పాల్పడితే, ప్రతిచర్యలు జరిపేందుకు అవసరమైన సైనిక బలగాలు, ఆయుధాలు మన వద్ద తగినన్ని లేవనే చెప్పాలి. 


logo