శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 06, 2020 , 19:42:25

ఎమ్మెల్యేగా పోటీచేయకుండానే.. ఐదుసార్లు ముఖ్యమంత్రి

ఎమ్మెల్యేగా పోటీచేయకుండానే.. ఐదుసార్లు ముఖ్యమంత్రి

పాట్నా : మన దేశంలోని అత్యధిక జనాభా కలిగిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, ఉద్ధవ్ ఠాక్రేలకు ఒక విషయం ఉమ్మడిగా ఉంది. వీరంతా ఆయా రాష్ట్రాల శాసనమండలి సభ్యులు. బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వీరిలో ఎవరూ విధానసభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. విధానసభ ఎన్నికలలో ఇప్పటివరకు పోటీ చేయని వారిలో నితీష్ కుమార్ ఒక్కరే ఉన్నారు. అది కూడా 35 సంవత్సరాలుగా శాసనసభకు పోటీ చేయకుండానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు లోక్‌సభ ఎన్నికలలో గెలిచారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఎప్పుడూ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే, థాకరే, యోగి ఆదిత్యనాథ్‌ ఇద్దరూ మొదటిసారి ముఖ్యమంత్రి కావడం విశేషం. ఇలాఉండగా, రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ వరుసగా నాలుగో ఎన్నికల విజయాన్ని కోరుకుంటున్నారు. నితీష్ కుమార్ ఇప్పటివరకు బిహార్ ముఖ్యమంత్రిగా ఐదుసార్లు - 2000, 2005, 2010, 2015 లో రెండుసార్లు ప్రమాణం చేశారు. 1977 లో తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్నాట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. అనంతరం 1985 లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇదే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన చివరిసారి కూడా. ఆ తర్వాత నితీశ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఆరుసార్లు గెలిచారు. చివరగా 2004 లో నలంద పార్లమెంటరీ నియోజకవర్గం నుండి గెలిచి.. మరో స్థానం బార్ నుంచి ఓటమి పాలయ్యారు. 2005 లో బిహార్ ముఖ్యమంత్రి అయిన తరువాత పార్లమెంట్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

2014-15లో తొమ్మిది నెలల స్వల్ప కాలం మినహా.. ఆయన 2005 నవంబర్ నుంచి బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో ఏర్పడిన రాజకీయ విభేదాల కారణంగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సమయంలో జీతాన్‌రాం మాంజీ బిహార్‌ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే మారిన రాజకీయ సమీకరణల కారణంగా నితీష్ కుమార్ 2015 లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. ఈ సారి ఎన్నికల్లో లాలూప్రసాద్‌తో పొత్తు పెట్టుకుని పూర్తిస్థాయి మెజార్టీ సాధించారు. అనంతరం మరోసారి 2017 లో ఎన్డీఏకు తిరిగి వచ్చారు. 

బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన బిహార్ అసెంబ్లీలోని ఏ సభలోనూ సభ్యుడు కాదు. దాంతో ఆయన పదవీకాలం ఎనిమిది రోజులు మాత్రమే కొనసాగింది. అప్పుడు ఆయన రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం లేదు. 2005 నవంబర్‌లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా ఆయన ఎమ్మెల్యే కాదు. ఆ తర్వాతి ఏడాది ప్రారంభంలో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా నితీష్ కుమార్ పదవీకాలం 2012 లో ముగియడంతో.. ఆయనను తిరిగి ఎగువ సభకు ఎన్నుకున్నారు. "నాకు ఎగువసభ అంటే అమితమైన గౌరవం. అందుకే ఎమ్మెల్సీగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. ఒక నియోజకవర్గంపై తన మొత్తం దృష్టిని పరిమితం చేయకూడదనుకుంటున్నాను. అందకే తాను అసెంబ్లీకి పోటీ చేయను." అని 2012 జనవరిలో శాసనమండలి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో నితీష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ఆరేండ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికవుతాను అని నవ్వుతూ చెప్పారు.  నితీష్ కుమార్ 2018 లో శాసనమండలికి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2024 లో ముగుస్తుంది.